ఆటాడలేకున్నారు!
eenadu telugu news
Published : 24/07/2021 01:23 IST

ఆటాడలేకున్నారు!

● పలు క్రీడాంశాల్లో శిక్షణ కరవు

● ప్రతిభ చాటలేకపోతున్న క్రీడాకారులు

అంతర్జాతీయ క్రీడాకారులను తీర్చిదిద్దేందుకుగాను ప్రభుత్వం పలు పథకాలను అందుబాటులోకి తెచ్చింది. వాటి అమలు ఎక్కడేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. సరైన నిపుణులు లేక జిల్లా క్రీడకారులు రాష్ట్ర స్థాయి పోటీలకు మాత్రమే పరిమితమవుతున్నారు. పలువురు జాతీయస్థాయి పోటీలో ప్రాతినిధ్యం వహిస్తున్నా పతకాలు మాత్రం ఆమడదూరంలో ఉన్నాయి. దీనికితోడు గత ఏడాదిన్నరగా క్రీడాకారులపై కొవిడ్‌ ప్రభావం చూపింది. టోక్యో ఒలింపిక్స్‌ ప్రారంభమైన నేపథ్యంలో జిల్లాలో క్రీడలపై ‘న్యూస్‌టుడే’ అందిస్తున్న కథనం. - న్యూస్‌టుడే-కర్నూలు క్రీడలు

జిల్లాలో వందలాది క్రీడాకారులు ఉన్నా ఆశించినస్థాయిలో ప్రతిభ చాటలేకపోతున్నారు. పలువురు జాతీయస్థాయి పోటీల వరకు వెళుతున్నా పతకాలు మాత్రం అందని ద్రాక్షగా మారింది. జిల్లాలో శిక్షణ ఇచ్చేందుకు అవసరమైన నిపుణులు లేకపోవడం.. దీనికితోడు నిధుల కొరత వేధిస్తుండటంతో సమస్యలు ఎదురవుతున్నాయి. నగరంలోని డీఎస్‌ఏ పరిధిలో మైదానాలు ఉన్నాయి. లాంగ్‌జంప్‌, హైజంప్‌, హ్యాండ్‌బాల్‌, వాలీబాల్‌, కబడ్డీ, ఖోఖోలో సాధన చేసుకునేలా వీటిని తీర్చిదిద్దినా శిక్షకులు కరవయ్యారు. జిల్లాకు చెందిన క్రీడాకారులు 2017లో అంతర్జాతీయ స్థాయిలో లాన్‌టెన్నిస్‌ ఒకరు, 2018లో మాస్టర్‌ అథ్లెటిక్స్‌, బ్యాడ్మింటన్‌, లాన్‌టెన్నిస్‌, వాలీబాల్‌ విభాగాల్లో ఒక్కొక్కరు.. 2019లో లాన్‌టెన్నిస్‌లో ఒకరు ప్రాతినిధ్యం వహించారు.

మౌలిక వసతులు కరవు: జిల్లాస్థాయి అథ్లెటిక్స్‌ పోటీలకు సంబంధించి పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు. వీరు తమ ప్రతిభ చాటుతున్నా మౌలిక వసతులు కరవయ్యాయి. సింథటిక్‌ ట్రాక్‌ ఏర్పాటు చేయాలని జిల్లా అథ్లెటిక్స్‌ సంఘం నాయకుల డిమాండ్‌ ఉంది. ఇంత వరకు ఆ దిశగా అడుగులు పడలేదు. దీనికితోడు క్రీడాకారులకు కరోనా శాపంగా మారింది. శిక్షణ కార్యక్రమాలు జరగడం లేదు. దీనికితోడు మైదానాలు, ట్రాక్‌ల నిర్వహణ అధ్వానంగా మారింది.

అటకెక్కిన గాండీవం ప్రాజెక్టు

అంతర్జాతీయ క్రీడాకారులను తయారు చేయడమే లక్ష్యంగా గాండీవం ప్రాజెక్టును అందుబాటులోకి తెచ్చారు. రాష్ట్ర, జాతీయస్థాయి పోటీల్లో రాణించిన క్రీడాకారులను ఎంపిక చేసి గుంటూరులోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ మైదానంలో విదేశీ శిక్షకుల చేత అథ్లెటిక్స్‌లో శిక్షణ గతంలో ఇచ్చారు. ఇందుకోసం ఒక్కో క్రీడాకారుడికి రోజుకు రూ.550 వరకు ఖర్చు చేశారు. ఆ తర్వాత రెండేళ్లుగా గాండీవం ప్రాజెక్టు ఊసే కానరావడం లేదు.

రాష్ట్ర విభజన నేపథ్యంలో అప్పట్లో కేంద్ర ప్రభుత్వం జిల్లాకు వరాలు కురిపించింది. ఇందులో భాగంగా హాకీ క్రీడలకు సంబంధించి ప్రత్యేకమైన కోర్టు, ఓర్వకల్లు సమీపంలో క్రీడా కాంప్లెక్స్‌ నిర్మాణానికి హామీ ఇచ్చింది. ఇప్పటివరకు అమలుకాలేదు.

నాణ్యత ప్రమాణాలు గాలికి..

జిల్లాలో జడ్పీ, మండల పరిషత్‌ ఉన్నత పాఠశాలల్లో ఉపాధి హామీ పథకం కింద క్రీడా మైదానాలను అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. దీనికిగాను ఎకరా నుంచి రెండెకరాల వరకు భూమి ఉండాలన్న నిబంధన ఉంది. తొలి విడత 220 విద్యాలయాల్లో పనులు చేపట్టారు. ఇందులో నాణ్యత ప్రమాణాలు గాలికి వదిలేశారంటూ గతంలో జిల్లాలోని పలు మైదానాలను పరిశీలించిన రాష్ట్ర క్రీడాప్రాధికారిక సంస్థ ముఖ్య అధికారి దేవానంద్‌ బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేశారు. మరి రెండో విడత పనులకు మోక్షమెప్పుడు లభిస్తుందో తెలియని పరిస్థితి.

వసతులు అంతంతే..- లిఖిత, జాతీయ స్థాయి అథ్లెటిక్స్‌ క్రీడాకారిణి

గత రెండేళ్లుగా క్రీడా సాధన చేసేందుకు పరిస్థితులు అనుకూలంగా లేదు. కరోనా కారణంగా మైదానంలోకి అడుగు పెట్టని పరిస్థితి ఏర్పడింది. దీనికితోడు వసతులు అంతంతమాత్రంగా ఉండటంతో సమస్యలు ఎదురవుతున్నాయి. శిక్షకులు లేకపోవడం పెద్ద లోటే. ఇలాంటి పరిస్థితుల్లో క్రీడాకారులు రాణించాలంటే కష్టమే..

కొవిడ్‌ కారణంతో.. - ఎంఎన్‌వీ రాజు, డీఎస్‌ఏ ప్రధాన శిక్షకుడు

కొవిడ్‌ ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా క్రీడా మైదానాలు మూతపడ్డాయి. కరోనా నిబంధనలు అమలులో ఉన్నాయి. కొవిడ్‌ పూర్తిగా తగ్గాక నిబంధనలు సడలిస్తారు. రాష్ట్ర క్రీడాశాఖ ఆదేశాలతో గాండీవం ప్రాజెక్టు వంటి పథకాలు అమలు చేస్తాం. నిపుణులైన శిక్షకులను సైతం అందుబాటులోకి తీసుకొస్తాం.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని