కర్షకులకుదక్కని భరోసా
eenadu telugu news
Published : 27/09/2021 04:01 IST

కర్షకులకుదక్కని భరోసా

వెల్దుర్తిలో పంట నమోదుకు వచ్చిన రైతులు 

కర్నూలు సచివాలయం, న్యూస్‌టుడే: విత్తనం నుంచి విక్రయం వరకు కర్షకులకు సేవలందించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసింది. వెయ్యి హెక్టార్లకు ఒక గ్రామస్థాయి వ్యవసాయ సహాయకుడు, అనుబంధ శాఖల అధికారులను నియమించారు. వీరు ఆయా కేంద్రాల్లో ఉంటూ రైతులకు సూచనలు సలహాలు ఇవ్వాల్సి ఉంటుంది. క్షేత్రస్థాయిలో ‘న్యూస్‌టుడే’ బృందం పరిశీలించగా కర్షకులను సరైన సేవలు అందడం లేదని తేలింది. ●

నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు ఎంఆర్‌పీ ధరలకు అందించాలి. పశువులకు దాణా, చేప పిల్లలు పంపిణీ చేయాలి. ఖరీఫ్‌లో రాయితీ విత్తనాలు తక్కువ సంఖ్యలో ఇవ్వగా 11 వేల మెట్రిక్‌ టన్నుల ఎరువులే అందించారు. పురుగు మందుల విక్రయాలు పెద్దగా లేవు. ●

రైతు భరోసా, పీఎం కిసాన్‌ పెట్టుబడి, పంట నష్ట పరిహారం, ఈ-పంటల నమోదు, బీమా సౌకర్యం, వ్యవసాయ పరికరాలు, మట్టి పరీక్షలు, రుణాలు ఇప్పించడం.. ఇలా రైతుకు సంబంధించిన ప్రతి అంశాన్ని ఈ కేంద్రం నుంచే నిర్వహించాలి.●

జిల్లాలో రైతు భరోసా కేంద్రాల్లో పూర్తి స్థాయిలో సేవలు అందడం లేదని వ్యవసాయాధికారులే చెప్పడం గమనార్హం. ●

చాలా కేంద్రాలు అద్దె భవనాల్లో నడుస్తున్నాయి. రూ.1500 - రూ.2 వేల వరకు అద్దె చెల్లిస్తున్నారు. అంతర్జాలం, ఇతర ఖర్చులకు కలిపి నెలకు రూ.1000 - రూ.1500 ఇవ్వాలి. కేంద్రాలు అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి ఒక్కసారే నిధులు విడుదల చేశారు. ప్రత్యేక నిధులు లేకపోవడంతో ఇబ్బంది పడుతున్నారు.

బయటే ధరలు తక్కువ

- అమరేష్‌, రైతు, చిప్పగిరి

రైతు భరోసా కేంద్రాల కంటే బయట వ్యాపారుల వద్ద తక్కువ ధరకు ఎరువులు, పురుగు మందు, విత్తనాలు దొరుకున్నాయి. ముందు డబ్బు చెల్లిస్తే తెప్పిస్తున్నారు. రైతు కేంద్రాల్లో అద్దెకు వ్యవసాయ పరికరాలు లభించడం లేదు.

తేలని భూసార ఫలితం

పాణ్యం సచివాలయం-2లో రైతు భరోసా కేంద్రం

పాణ్యం మూడో సచివాలయం పరిధిలో రైతు భరోసా కేంద్రాన్ని ‘న్యూస్‌టుడే’ పరిశీలించింది. దీని పరిధిలో 240 మంది రైతులు 510 హెక్టార్లలో వివిధ పంటలు సాగు చేస్తున్నారు. 30 మందికి సంబంధించి భూసార పరీక్షలు నిర్వహించినా ‘ఫలితం’ చెప్పలేదు. కేంద్రంలో సౌకర్యాలు లేక సేవలకు ఆటంకాలు ఏర్పడుతున్నాయి. ఎరువులు, ఇతర సేవల నమోదుకు పాణ్యం-1 కేంద్రానికి వెళ్లాల్సి వస్తోంది. - న్యూస్‌టుడే, పాణ్యం గ్రామీణం

ఎరువులు లేవయా

కార్యాలయం బయట పంట వివరాలు నమోదు చేస్తూ..

వెల్దుర్తిలోని రైతు భరోసా కేంద్రం-2లో ఎరువులు అందుబాటులో లేవు. కేంద్రం పరిధిలో 521 హెక్టార్లలో 850 మంది రైతులు ఉన్నారు. పంటల వివరాల నమోదుకు కొందరు కేంద్రానికి వచ్చారు. సిగ్నల్స్‌ అందకపోవడంతో సిబ్బంది ఆరుబయట పనులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. - న్యూస్‌టుడే, వెల్దుర్తి

కానరాని విత్తనాలు

పురుగు మందులు లేక ఇలా.. 

చిప్పగిరి ఎస్సీ కాలనీలోని ఆర్‌బీకే కేంద్రాన్ని పరిశీలించగా ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు లేవు. కేవలం యూరియా బస్తాలే అందుబాటులో ఉన్నాయి. రైతు సంఘాలకు రాయితీ రూపంలో పరికరాలు ఇస్తున్నారు. భూసార పరీక్షల కోసం ఇప్పటి వరకు కేంద్రానికి నమూనా పరికరాలు రాలేదు. - న్యూస్‌టుడే, చిప్పగిరి


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని