జడ్పీ ఛైర్మన్‌ పదవి నుంచి తొలగించాలి
eenadu telugu news
Published : 27/09/2021 04:01 IST

జడ్పీ ఛైర్మన్‌ పదవి నుంచి తొలగించాలి

తెదేపా నాయకుల డిమాండ్‌

సమావేశంలో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే

బీసీ జనార్దన్‌రెడ్డి, పక్కన తెదేపా నేతలు

కర్నూలు సచివాలయం, న్యూస్‌టుడే: జడ్పీ ఛైర్మన్‌ ఎం.వెంకటసుబ్బారెడ్డిని వెంటనే పదవి నుంచి తొలగించాలని తెదేపా నేతలు డిమాండ్‌ చేశారు. ఆయనపై వివిధ కేసులు ఉన్నాయని, అనర్హుడిగా భావించి పదవి నుంచి తొలగించాలని కోరారు. నగరంలోని తెదేపా కార్యాలయంలో కర్నూలు, నంద్యాల పార్లమెంట్‌ తెదేపా అధ్యక్షులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, గౌరు వెంకటరెడ్డి, బనగానపల్లి, ఆలూరు, పాణ్యం తెదేపా బాధ్యులు బీసీ జనార్దన్‌రెడ్డి, కోట్ల సుజాతమ్మ, గౌరు చరితారెడ్డి ఆదివారం మాట్లాడారు. వెంకటసుబ్బారెడ్డిపై పలు కేసులు నమోదైన విషయాన్ని బీసీ జనార్దన్‌రెడ్డి వెల్లడించారు. ఇలాంటి వారిని జడ్పీ ఛైర్మన్‌గా నియమించడం జిల్లా ప్రజలను అవమానపరిచినట్టేనని, చేసిన పొరపాటును సరిదిద్దుకునేందుకు వెంటనే ఆయన్ను పదవి నుంచి తొలగించి మరొకరిని నియమించాలని సీఎంను కోరారు. జడ్పీకి ప్రస్తుతమున్న సభ్యుల్లో నీతిమంతులు దొరకలేదా? పోలీసులు, ఇంటెలిజెన్స్‌ విభాగం నుంచి సమాచారం రాలేదా? అని ముఖ్యమంత్రిని ప్రశ్నించారు. సోమిశెట్టి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ జిల్లా మంత్రులకు, ఇన్‌ఛార్జి మంత్రికి ఆయన నేర చరిత్ర తెలిసే ఎంపిక చేశారన్నారు. తితిదే పాలకమండలి సభ్యుల్లోనూ నేర చరిత్ర కలిగిన వారిని నియమించారన్నారు. రాష్ట్రంలో డ్రగ్స్‌ మాఫియా జోరుగా సాగుతోందని గౌరు వెంకటరెడ్డి మండిపడ్డారు. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శులు నాగేంద్రకుమార్‌, పి.రవికుమార్‌, నాయకులు సత్రం రామకృష్ణుడు, ఎస్‌.అబ్బాస్‌ తదితరులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని