పర్యాటక ధామం.. శ్రీశైలం
eenadu telugu news
Published : 27/09/2021 04:01 IST

పర్యాటక ధామం.. శ్రీశైలం

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిధులతో వసతులు

సిద్ధమవుతున్న యాంఫీ థియేటర్‌

పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్న శివాజీ ధ్యాన మందిరం

ఉద్యానవనాలను శ్రీశైల దేవస్థానం విరివిగా అభివృద్ధి చేస్తోంది. తెలుగు విశ్వవిద్యాలయ పీఠం పక్కనే సిద్ధం చేసిన రుద్ర పార్క్‌ ప్రత్యేక ఆకర్షణగా ఉంది. టోల్‌గేటు వద్ద నిర్మించిన బసవ వనం భక్తులను మంత్రముగ్ధులను చేస్తోంది. అక్క మహాదేవి గుహలను సందర్శించేందుకు బోటు సదుపాయం సైతం ఉంది. ●

● శ్రీశైలంలో శివాజీ స్ఫూర్తి కేంద్రం మరో విశిష్ట ప్రదేశంగా అభివృద్ధి చెందింది. ఇక్కడ ఏర్పాటుచేసిన శివాజీ కాంస్య విగ్రహం ఆకట్టుకుంటోంది. రాజస్థాన్‌ నుంచి ప్రత్యేకంగా తెప్పించిన రాళ్లతో స్ఫూర్తి కేంద్రం పక్కనే ఈ మధ్యకాలంలోనే నిర్మించిన ధ్యాన మందిరాన్ని చూడదగ్గ ప్రదేశంగా తీర్చిదిద్దారు.

శ్రీశైలం ఆలయం, సున్నిపెంట సర్కిల్‌, న్యూస్‌టుడే : దేశంలో ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాల్లో ఒకటిగా శ్రీశైలం అభివృద్ధి చెందుతోంది. శ్రీశైల దేవస్థానం, అటవీ, పర్యాటక శాఖలు సంయుక్తంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నాయి. సందర్శకులకు మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. శ్రీశైలంలో పర్యాటక యాత్ర అంటే కనీసం నాలుగైదు రోజులైనా విడిది చేయక తప్పదు. అందుకే ఏటా దేశ, విదేశాల నుంచి తాకిడి పెరుగుతోంది. ప్రపంచ పర్యాటక దినోత్సవం నేపథ్యంలో శ్రీశైలంలో పర్యాటకాభివృద్ధిపై ప్రత్యేక కథనం.

ప్రకృతి సౌందర్యానికి నిలయంగా శ్రీశైలం అభివృద్ధి చెందింది. శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జునస్వామి ఆలయం చుట్టూ దట్టమైన నల్లమల అడవులు పర్యాటకులను ఎంతో ఆకట్టుకుంటున్నాయి. దేశంలో అతిపెద్ద పులుల అభయారణ్యంగానూ పేరు గాంచింది. వర్షాకాలంలో ఇక్కడి ప్రకృతి సౌందర్యాలను ఆస్వాదించేందుకు పెద్దఎత్తున ఆసక్తి చూపుతుంటారు. శ్రీశైలం అడవుల విశిష్టతను తెలుసుకునేందుకు సున్నిపెంటలో అటవీశాఖ ఏర్పాటుచేసిన పర్యావరణ విజ్ఞాన కేంద్రం, జింకల పార్కు, బయోడైవర్సిటీ కేంద్రాలకు జనం భారీగా వస్తున్నారు. వన్యప్రాణుల సంరక్షణకు చేపడుతున్న చర్యలను ఇక్కడ గైడ్‌లు వివరిస్తారు.

ఔరా.. అనిపించేలా!

శ్రీశైల దేవస్థానం, పర్యాటక శాఖలు సంయుక్తంగా పర్యాటకాభివృద్ధికి గత 15 ఏళ్లుగా కృషి చేస్తున్నాయి. ఇప్పటికే శ్రీశైలంలో ఏరియల్‌ రోప్‌వే, బోటింగ్‌ సేవలు అందుబాటులో ఉన్నాయి. రూ.49 కోట్ల కేంద్ర ప్రభుత్వ నిధులతో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. వివిధ రకాల కార్యక్రమాలతో ఆకట్టుకునేందుకు యాంఫీ థియేటర్‌ నిర్మిస్తున్నారు. శ్రీమల్లికార్జునస్వామివారి ఆలయంలో సౌండ్‌ అండ్‌ లైటింగ్‌ సిస్టం ఏర్పాటు చేశారు. ఇవన్నీ త్వరలో ప్రారంభించేందుకు చర్యలు చేపట్టారు.

శ్రీశైలం, శిఖరేశ్వరం, హఠకేశ్వరంలో మంచినీరు, వసతి, ఆహారం అందించేందుకు పిలిగ్రిమ్‌ ఎమినిటీస్‌ సెంటర్లను సిద్ధం చేశారు. త్వరలో నంది సర్కిల్‌, హఠకేశ్వరం, శిఖరేశ్వరం వద్ద నెలకొల్పిన పిలిగ్రిమ్‌ ఎమినిటీస్‌ సెంటర్లను ప్రారంభించనున్నారు.

ట్రైబల్‌ మ్యూజియం మరో ఆకర్షించే ప్రదేశం. ఇక్కడ రాష్ట్రంలోని గిరిజన జాతుల సంప్రదాయాలు కళ్లకు కట్టినట్లు బొమ్మల రూపంలో తీర్చిదిద్దారు.

తెలుగు రాష్ట్రాలు పర్యాటక శాఖల తరఫున కృష్ణా నదిలో బోటు ప్రయాణాలకు అనుమతిచ్చాయి. శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్‌ వరకు సాగే బోటు ప్రయాణాలు పర్యాటకులను అలరిస్తున్నాయి.

మరిన్ని ప్రాజెక్టులు అభివృద్ధి చేస్తాం

- ఈశ్వరయ్య, పర్యాటక శాఖ అధికారి

శ్రీశైలంలో ప్రసాద్‌ పథకంలో భాగంగా చేపట్టిన పలు సౌకర్యాలు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. ఆధ్యాత్మికత, భక్తిభావం ఉట్టిపడేలా పర్యాటక శాఖ తరఫున శ్రీశైలంలో 5 స్టార్‌ హోటల్‌ ఏర్పాటుకు ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. దీనికి పదెకరాల స్థలం మంజూరు చేయాలని దేవాదాయ శాఖను కోరాం. ఈగలపెంట-శ్రీశైలం వరకు మరో కొత్త రోప్‌వే ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన ఉంది.

శ్రీశైలం- నాగార్జునసాగర్‌ బోటు యాత్ర


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని