కదలరు..కుర్చీ వదలరు
eenadu telugu news
Published : 15/10/2021 05:29 IST

కదలరు..కుర్చీ వదలరు

డీఈవో కార్యాలయంలో ఏళ్ల తరబడి తిష్ఠ

మితిమీరిన జోక్యంతో విసుగు చెందుతున్న సహోద్యోగులు

ఈనాడు డిజిటల్‌ - కర్నూలు: జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో కొందరు అధికారులు ఏళ్ల తరబడి తిష్ఠ వేశారు. విద్యార్థులకు బోధన చేయాల్సిన ఉపాధ్యాయులూ ఇదే బాట పట్టారు. ఒక్క మాటలో చెప్పాలంటే న్యూటన్‌ గమన సిద్ధాంతాన్ని విద్యార్థులకు బోధించకపోయినా.. విద్యాశాఖ గమన సిద్ధాంతాన్ని ఆకళింపు చేసుకొన్నారు. అక్రమార్జనకు కొందరు తెర తీస్తే.. మరికొందరు జిల్లా, విద్యాశాఖ కార్యాలయాన్ని వదిలి పెట్టకుండా ఉన్నారు.

రాయలసీమ జిల్లాలో ప్రధానంగా కర్నూలులో అక్షరాస్యత ఇంకా మెరుగుపడాల్సిన ఆవశ్యకత ఉంది. దీనిని గాడిలో పెట్టాల్సిన విద్యాశాఖ తడబడుతోంది. ప్రధానంగా ఆ శాఖలో ప్రక్షాళన చేయాల్సి ఉంది. ఎందుకంటే జిల్లా విద్యాధికారి ఎవరొచ్చినా వారికి నీడలా(షాడోల్లా) కొందరు అధికారులు, మరికొందరు ఉపాధ్యాయులు చక్రం తిప్పుతున్నారు. ఆరుగురు వ్యక్తులు డీఈవో కార్యాలయంలో ఏళ్ల తరబడి తిష్ఠవేసినట్లు చర్చనీయాంశంగా మారింది.

వెనకుండి నడిపిస్తారు

సీనియర్‌ అసిస్టెంట్లలో ఒకరు గతంలో పనిచేసిన డీఈవోకు నమ్మిన బంటుగా ముద్ర వేసుకున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే షాడో డీఈవో... ఇతని మితిమీరిన జోక్యాన్ని సహచర ఉద్యోగులు పలుసార్లు వ్యతిరేకించారు. ఇందులో మరొకరు సంఘం పేరు చెప్పి ఏ అధికారి వచ్చినా గుప్పిట్లో పెట్టుకొంటూ విధులకు డుమ్మా కొడుతుంటారు. మరొకరు 14 మందిపైగా డీఈవోలకు క్యాంప్‌ క్లర్క్‌ సీసీగా వ్యవహరించి అన్నీతానై నడిపిస్తున్నారు. ఇంకొకరు నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం నాయకుడిగా చలామణి అవుతూ ఉపాధ్యాయులకు అక్రమ మార్గాల్లో పనులు పూర్తి చేస్తున్నారు.

గత అధికారి రాకకు

గతంలో పనిచేసిన ఓ అధికారి హయాంలో చేపట్టిన డిప్యుటేషన్‌ నియామకాలు అక్రమమని తేలినా చర్యల్లేవు. ఆ అధికారే జిల్లా ఉన్నత పోస్టులో వస్తారన్న ప్రచారం జరుగుతోంది. విజయవాడకు పోస్టింగ్‌ ఇచ్చినా.. వెళ్లకుండా అనంతపురంలో తిష్ఠ వేశారు. ఒక నెలలో ఆర్జేడీ పోస్టులో కడపకు తీసుకొచ్చేలా వీరంతా పావులు కదుపుతున్నట్లు సమాచారం.

ఇక్కడే విధులు నిర్వహిస్తూ

సాధారణంగా డిప్యూటీ డీఈవో స్థాయి ఉద్యోగిని గ్రూప్‌-1 అధికారిగా పరిగణిస్తారు. ఓ జిల్లాలో మూడేళ్లకు మించి పనిచేయకూడదు. వేరే జిల్లాకు వెళ్లి తిరిగి రావొచ్ఛు అయితే ఈ పోస్టులో ఉన్న అధికారి ఏడీ నుంచి డిప్యూటీ, డిప్యూటీ నుంచి ఏడీగా ఇలా జిల్లాలోనే కొనసాగుతున్నారు.

దత్తత ఉపాధ్యాయులు

సెకండరీ గ్రేడ్‌ టీచర్‌గా ఉన్నప్పుడు డీపీఈపీలో కంప్యూటర్‌ ఆపరేటర్‌గా 15 ఏళ్లు డీఈవో కార్యాలంలో పనిచేశారు. స్కూలు అసిస్టెంట్‌గా పదోన్నతి పొందాక ఫిజిక్స్‌ బోధించాల్సిన ఆ ఉపాధ్యాయుడు పర్ల, లక్ష్మీపురం, జమ్ములదిన్నె(కోసిగి), ప్రస్తుతం ఆలూరులో నామ మాత్రంగా పనిచేస్తున్నారు. ఉండేదంతా డీఈవో కార్యాలయంలోనే. పదోన్నతులు, బదిలీలు, పరిశీలన అన్నీ ఇతని కనుసన్నల్లోనే జరుగుతున్నాయి.

మరో గణిత ఉపాధ్యాయుడు స్కూలు అసిస్టెంట్‌గా శ్రీశైలంలో పనిచేసినా.. నందికొట్కూరు.. కర్నూలు ఎక్కడ పనిచేసినా విధులు డీఈవో కార్యాలయంలోనే హవా సాగిస్తున్నారు.

స్టాంటన్‌పురంలో ప్రస్తుతం పనిచేస్తున్న సెకండ్‌ గ్రేడ్‌ టీచర్‌ డీఈవో కార్యాలయంలోనే 15 ఏళ్లుగా విధులు నిర్వహిస్తున్నారు. ఎమ్మిగనూరు ఉన్నత పాఠశాలలో జీవశాస్త్ర ఉపాధ్యాయులుగా పనిచేస్తూ డిప్యుటేషన్‌పై జిల్లా కామన్‌ ఎగ్జామినేషన్‌ బోర్డు కార్యాలయంలో 15 ఏళ్లుగా కొనసాగుతున్నారు.

చెరుకుచర్ల జెడ్పీహెచ్‌ఎస్‌ ప్రధానోపాధ్యాయులు 2017లో డీసీఈడీ కార్యదర్శి నియామకం పొందారు. కాలపరిమితి 2020 నవంబరుకు మూడేళ్లు ముగిసినా ఇంకా అనధికారికంగా కొనసాగుతున్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని