గుత్తేదారులను భిక్షాటకులుగా మార్చారు
eenadu telugu news
Published : 15/10/2021 05:29 IST

గుత్తేదారులను భిక్షాటకులుగా మార్చారు

ఉపాధి, నీరు-చెట్టు బిల్లులపై కోర్టును ఆశ్రయిస్తాం ●

ఉల్లి, టమాటకు గిట్టుబాటు ధరలు కల్పించాలి

తెదేపా నేతల తీర్మానం

ఎన్టీఆర్‌ విగ్రహ ప్రతిమకు నివాళులర్పిస్తున్న తెదేపా నేతలు

కర్నూలు సచివాలయం, న్యూస్‌టుడే: ఉపాధి హామీ పథకం, నీరు- చెట్టు కింద గత ప్రభుత్వంలో చేసిన పనులకు సంబంధించిన బిల్లులను చెల్లించకుండా అటు ప్రభుత్వం, ఇటు అధికారులు తీవ్ర జాప్యం చేస్తున్నారని, దీనిపై హైకోర్టు ఆదేశాలు జారీ చేసినప్పటికీ పట్టించుకోవడం లేదని తెదేపా నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయపరంగా బిల్లులు రావాల్సిన వారి కోసం కోర్టును ఆశ్రయించి నిధులు విడుదల చేయించాలని సమావేశంలో తీర్మానించారు. నగరంలోని తెదేపా కార్యాలయంలో ముఖ్య నాయకుల సమావేశం గురువారం జరిగింది. కర్నూలు, నంద్యాల పార్లమెంట్‌ నియోజకవర్గ అధ్యక్షులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, గౌరు వెంకటరెడ్డి, తెదేపా జాతీయ ఉపాధ్యక్షుడు కోట్ల జయసూర్యప్రకాష్‌రెడ్డి, పొలిట్‌బ్యూరో సభ్యుడు ఎన్‌.ఎం.డి.ఫరూఖ్‌, ఎమ్మెల్సీలు కేఈ ప్రభాకర్‌, బీటీ నాయుడు, బనగానపల్లి, ఎమ్మిగనూరు, ఆదోని, ఆలూరు, పాణ్యం, కోడుమూరు, నంద్యాల, కర్నూలు నియోజకవర్గ బాధ్యులు బీసీ జనార్దన్‌రెడ్డి, బి.వి.జయనాగేశ్వరరెడ్డి, కె.మీనాక్షి నాయుడు, కోట్ల సుజాతమ్మ, గౌరు చరితారెడ్డి, ఆకెపోగు ప్రభాకర్‌, భూమా బ్రహ్మానందరెడ్డి, టీజీ భరత్‌, పార్టీ రాష్ట్ర కార్యదర్శులు వై.నాగేశ్వరరావు యాదవ్‌, నాగేంద్రకుమార్‌ హాజరై ముందుగా ఎన్టీఆర్‌ విగ్రహ ప్రతిమకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.

వివరాలు పంపించండి...

సోమిశెట్టి మాట్లాడుతూ పెండింగ్‌లో బిల్లుల వివరాలు ఎవరైనా తెలియజేస్తే కోర్టు ద్వారా వారికి న్యాయం చేకూరుస్తామని, ప్రతి నియోజకవర్గ పరిధిలో పెండింగ్‌ బిల్లుల వివరాలు పంపాలని నియోజకవర్గ బాధ్యులను కోరారు.

ఆత్యహత్యలకు పాల్పడ్డారు..

మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డి మాట్లాడుతూ గత రెండేళ్లుగా నీరు-చెట్టు, ఉపాధి బిల్లుల చెల్లింపుల్లో తీవ్ర జాప్యం చేస్తుండటంతో పనులు చేసిన గుత్తేదారులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఆదేవన వ్యక్తం చేశారు.

అవినీతి పెరిగింది...

తెదేపా జాతీయ ఉపాధ్యక్షుడు కోట్ల జయసూర్యప్రకాష్‌ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అవినీతి పెరిగిపోయిందని విమర్శించారు. గత రెండు నెలలుగా ఉల్లి కొనుగోళ్లు పూర్తిస్థాయిలో జరగకపోవడంతో ఉల్లి రైతులు నష్టపోతున్నారని, గిట్టుబాటు ధరలు లేక రైతులు ఆత్మహత్యలు చేసుకునే దుస్థితి నెలకొందన్నారు.

గుండ్రేవుల ఏమైనట్లు

ఎమ్మిగనూరు మాజీ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి మాట్లాడుతూ పాదయాత్రలో ముద్దులు పెట్టి గద్దెనెక్కిన సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చాక ప్రజలపై గుద్దులే.. గుద్దులు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. పశ్చిమ ప్రాంత జీవనాడి అయిన గుండ్రేవుల ప్రాజెక్టు నిర్మాణ పనులను కనీసం గెజిట్‌లో చేర్చలేదన్నారు. సమావేశంలో ఎంఎన్‌ఆర్‌ఈజీఎస్‌ కౌన్సిల్‌ మాజీ సభ్యుడు సత్రం రామకృష్ణుడు తదితరులు పాల్గొన్నారు. ఈ ముఖ్య నాయకుల సమావేశంలో శ్రీశైలం, ఆళ్లగడ్డ, పత్తికొండ, మంత్రాలయం నియోజకవర్గాల బాధ్యులు హాజరు కాలేదు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని