Published : 17/04/2021 05:26 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

శుభకార్యానికి వెళ్తూ తిరిగిరాని లోకాలకు..

డీసీఎం, బైక్‌ ఢీకొని ఇద్దరు దుర్మరణం


ఘటనా స్థలంలో మృతదేహాలు

పూడూరు, న్యూస్‌టుడే: అన్న కుమారుడి పుట్టువెంట్రుకలు తీయించే శుభకార్యానికి ఏర్పాట్లు చేసేందుకు బయలుదేరిన ముగ్గురిలో ఇద్దరు రోడ్డుప్రమాదంలో దుర్మరణం చెందగా ఒకరి పరిస్థితి మిషమంగా ఉంది. దీంతో ఆ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. సీఐ లక్ష్మిరెడ్డి, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. యాలాల మండలం అచ్యుతాపూర్‌కు చెందిన పిచ్చకుంట్ల మల్కయ్య(46) కుటుంబం కొన్నాళ్లుగా హైదరాబాద్‌లో ఉంటూ కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అన్న కుమారుడి సంతానంలో ఒకరికి శుక్రవారం కోస్గి సమీపంలోని పాలేపల్లి ఆలయం వద్ద పుట్టు వెంట్రుకలు తీయించే కార్యక్రమం ఉండటంతో ఏర్పాట్లు చేసేందుకు మల్కయ్య, ఆయన కుమారుడు నవీన్‌, బంధువైన చౌదరిగూడెం మండలం రావిరాలకు చెందిన శివకుమార్‌(17) కలిసి తెల్లవారుజామునే హైదరాబాద్‌ నుంచి ద్విచక్రవాహనంపై బయలుదేరారు. పూడూరు మండలం చినబండతండా గేటు వద్ద ఎదురుగా పుచ్చకాయల లోడుతో వచ్చిన డీసీఎం వీరి బైక్‌ను ఢీకొట్టింది. ప్రమాదంలో మల్కయ్య, శివకుమార్‌ అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. వెనుక కూర్చున్న నవీన్‌కు తీవ్రగాయాలు కావటంతో పరిగి ఆసుపత్రికి అక్కడి నుంచి ఉస్మానియాకు తరలించారు. శుభకార్యానికి మిగిలిన కుటుంబీకులు మరో వాహనంలో బయలుదేరాల్సి ఉండగా ప్రమాదం విషయం తెలియటంతో వెంటనే ఘటనా స్థలానికి చేరుకొన్నారు. శివకుమార్‌ తండ్రి బుగ్గయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్‌ కానిస్టేబుల్‌ గోపాల్‌గౌడ్‌ వెల్లడించారు. డీసీఎం చోదకుడు పరారీలో ఉన్నాడని తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని