వేర్వేరు రోడ్డు ప్రమాదాలు
logo
Published : 18/06/2021 05:39 IST

వేర్వేరు రోడ్డు ప్రమాదాలు

 ఇద్దరి మృతి, ముగ్గురికి గాయాలు 

రాజేశ్వర్‌రావు

ఐడీఏ బొల్లారం, (న్యూస్‌టుడే, జిన్నారం): జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృత్యువాత పడగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వివరాలు ఇలా.. సంగారెడ్డి జిల్లా ఐడీఏ బొల్లారం సీఐ జి.ప్రశాంత్‌, ఎస్సై జయశంకర్‌ తెలిపిన వివరాలు సిద్దిపేట జిల్లా బస్వాపూర్‌కు చెందిన సొలెంక రాజేశ్వర్‌రావు (30) బతుకుదెరువు నిమిత్తం కుటుంబంతో సహా ఐడీఏ బొల్లారం పరిధి పోచమ్మబస్తీలో ఉంటున్నాడు. కూకట్‌పల్లిలో ట్రాలీ ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. గురువారం తన ద్విచక్ర వాహనంపై 8.30 గంటల ప్రాంతంలో కూకట్‌పల్లికి వెళ్తుండగా పట్టణ శివారులోని కుడికుంట రహదారి వద్ద ఎదురుగా వచ్చిన స్కూటీ బలంగా ఢీకొట్టింది. దీంతో తీవ్రంగా గాయపడిన రాజేశ్వర్‌రావు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనలో స్కూటీపై వచ్చిన హుస్సేన్‌, సాయికిరణ్‌, అజారుద్దీన్‌లకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. మృతుడి సోదరుడు నర్సింగరావు ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేపట్టామని సీఐ వివరించారు. మృతదేహానికి పటాన్‌చెరు ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్ట్‌మార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. మృతుడినికి తల్లితో పాటు భార్య ఉన్నారు. అందరితో కలుపుగోలుగా ఉండే రాజేశ్వర్‌రావు మృతితో పోచమ్మబస్తీలో విషాదఛాయలు అలుముకున్నాయి.

ఘటనా స్థలిలో క్షతగాత్రులు

ద్విచక్ర వాహనం అదుపు తప్ఫి..

ద్విచక్ర వాహనం అదుపు తప్పి ఒకరు మృతి చెందిననట్లు జిన్నారం ఎస్సై సమీయజమా తెలిపారు. వివరాలు ఇలా.. పటాన్‌చెరు మండలం లక్డారం గ్రామానికి చెందిన పల్లెపు ప్రభు (43) కొంత కాలంగా బీరంగూడలో ఉంటున్నాడు. తన ద్విచక్ర వాహనంపై బొంతపల్లి నుంచి జిన్నారం వస్తున్న తరుణంలో వాహనం అదుపు తప్పి రాళ్లలోకి దూసుకెళ్లాడు. దీంతో తలకు, శరీరంలోని పలు భాగాలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. ఈమేరకు కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై చెప్పారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని