ఉపఎన్నికలో కాషాయ జెండా ఎగరేస్తాం: ఎమ్మెల్యే
logo
Updated : 22/07/2021 06:12 IST

ఉపఎన్నికలో కాషాయ జెండా ఎగరేస్తాం: ఎమ్మెల్యే


జిల్లా కార్యవర్గ సమావేశంలో మాట్లాడుతున్న రఘునందన్‌రావు

దుబ్బాక, న్యూస్‌టుడే: భాజపా కార్యకర్తల పోరాట పటిమతో దుబ్బాకలో గెలిచిన విధంగానే, రానున్న హుజూరాబాద్‌ ఉపఎన్నికలోనూ కాషాయ జెండా ఎగరేస్తామని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు తెలిపారు. బుధవారం దుబ్బాక లో నిర్వహించిన భాజపా జిల్లా కార్యవర్గ సమావేశంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్‌రెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రధాన మంత్రి మోదీ యుద్ధప్రాతిపదికన అందిస్తున్న ఉచిత టీకాలు అభినందనీయమని అన్నారు. కరోనా సమయంలో పేదల ఆకలి తీర్చడానికి కేంద్రం ప్రతి ఒక్కరికీ ఇస్తున్న 5 కేజీల ఉచిత బియ్యం పథకం ఎంతో గొప్పదన్నారు. ఇటీవల సిద్దిపేట పర్యటనలో ముఖ్యమంత్రికి భూంపల్లి కూడలిని మండలం ఏర్పాటుకు 13 గ్రామాల తీర్మానంతో కూడిన వినతిపత్రాన్ని ఇవ్వగా ఈ వారంలో నివేదిక ప్రభుత్వానికి చేరి, మండలం ఏర్పాటు దిశగా చర్యలు తీసుకుంటారని తెలిపారు. దీన్ని తెరాస నాయకులు తమ కృషితోనే నూతన మండలం ఏర్పాటు అవుతుందని సామాజిక మాధ్యమాల్లో విస్తృత ప్రచారం చేసుకోవడం తగదన్నారు. కొన్నేళ్లుగా అసంపూర్తిగా ఉన్న రఘోత్తంపల్లి పంచాయతీ కార్యాలయ భవనాన్ని ఆరు నెలల్లోపు పూర్తి చేస్తామన్నారు. తాను మాటల మనిషిని కాదని, చేతల మనిషినని అన్నారు. అనంతరం ప్రేమేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. త్వరలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ పాదయాత్ర చేపట్టబోతున్నారని, వారి నేతృత్వంలో రానున్న శాసనసభ ఎన్నికల్లో భాజపా అధిక స్థానాల్లో గెలిచి అధికారంలోకి వస్తుందన్నారు. సమావేశంలో జిల్లా అధ్యక్షుడు దూది శ్రీకాంత్‌రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అంబటి బాలేశ్‌ గౌడ్‌, పార్టీ కౌన్సిలర్లు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని