ఖానాపూర్‌(కె) పరిసరాల్లో చిరుత సంచారం వాస్తవమే
eenadu telugu news
Published : 05/08/2021 02:07 IST

ఖానాపూర్‌(కె) పరిసరాల్లో చిరుత సంచారం వాస్తవమే

అటవీశాఖ రేంజ్‌ అధికారి దేవిలాల్‌

అడవిలో గాలింపు చేపట్టిన అధికారులు, సిబ్బంది

కల్హేర్‌, న్యూస్‌టుడే: మండలంలోని ఖానాపూర్‌(కె) అటవీ ప్రాంతంలో చిరుత సంచరిస్తున్నట్లు రుజువులు లభించాయని నారాయణఖేడ్‌ అటవీశాఖ రేంజ్‌ అధికారి దేవిలాల్‌ స్పష్టం చేశారు. బీట్‌ అధికారులతో కలిసి బుధవారం ఆనవాలు సేకరించిన అనంతరం ‘న్యూస్‌టుడే’తో మాట్లాడారు. కొన్ని రోజులుగా రైతులు, గొర్రెల కాపరులు తమకు చిరుత కంటపడిందని లేగ దూడలను ఎత్తుకెళ్లిందని ఫిర్యాదు చేశారని.. ఆధారాలు లభించనందున వదంతులుగానే పరిగణించామన్నారు. రెండు రోజుల క్రితం గొర్రెల కాపర్లు మల్లేశం, బీరప్పలకు కనపడటంతో దూరం నుంచి చిత్రాలు తీశారన్నారు. దీంతో కాపర్లు, గ్రామస్థులను తీసుకొని చిరుత సంచరించిందని చెబుతున్న ప్రాంతాలకు వెళ్లి పరిశీలించినట్లు ఆయన వివరించారు. అక్కడక్కడ లభించిన కాలిముద్రల ఆధారంగా కచ్చితంగా చిరుత తిరుగుతున్నట్లు నిర్ధారణకు వచ్చామన్నారు.

గ్రామాల్లోకి రాదు...: కడుపల్‌, ఖాజాపూర్‌, ఖానాపూర్‌(కే), క్రిష్ణాపూర్‌, నాగధర్‌, సంజీవన్‌రావుపేట గ్రామాల పరిధిలో అడవి దట్టంగా ఉండటంతో ఇక్కడ స్థ్థావరం ఏర్పాటు చేసుకుందని ఆయన తెలిపారు. ఈ ప్రాంతంలో చిరుతకు ఆహారం, నీరు పుష్కలంగా ఉందని, అందువల్ల గ్రామాల్లోకి వచ్చే అవకాశం లేదన్నారు. పశువులు, గొర్రెలపై చిరుత దాడిచేసి చంపినట్లు ఆధారాలు చూపితే రైతులకు పరిహారం అందజేస్తామన్నారు. పగటిపూట వేటాడదని రాత్రివేళ, తెల్లవారుజామున, పొద్దుగూకే సమయంలో ఆహారం కోసం బయలుదేరుతుందన్నారు. అటవీ ప్రాంతంలో రైతులు జాగ్రతగా వెళ్లాలని ఆయన సూచించారు. బీట్‌ అధికారులు ఐలయ్య, మానస, గ్రామస్థులు ప్రశాంత్‌ సాగర్‌, భుంగొండ, బయ్యన్న, కుర్మసాయి ఆయన వెంట ఉన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని