కచ్చా రోడ్లకు మహర్దశ!
eenadu telugu news
Published : 05/08/2021 02:07 IST

కచ్చా రోడ్లకు మహర్దశ!

గిరిజనుల కష్టాలకు చెల్లు

రూ.107 కోట్లతో తారు మార్గాలుగా మార్పు

అడుగు వేయలేని స్థితిలో వెంకట్‌రావు తండా రహదారి

న్యూస్‌టుడే, సంగారెడ్డి అర్బన్‌: కంది, జోగిపేట, సిర్గాపూర్‌ గిరిజన తండాలు.. ఓ మూలకు విసిరేసినట్లుగా ఉంటాయి. చినుకు పడితే చిత్తడిగా మారే దారులు.. అడుగు తీసి అడుగు వేయాలన్నా భయపడే పరిస్థితి. దశాబ్దాలుగా తమ దారులు బాగు చేయండని అధికారులకు, ప్రజా ప్రతినిధులకు ప్రజలు పలుమార్లు విన్నవించారు. పట్టించుకున్న నాథుడే లేడు. తాజాగా ప్రభుత్వం ఈ విషయంలో చొరవ చూపింది. గిరిజన ఉప ప్రణాళిక నిధుల ద్వారా తారు రోడ్లుగా మార్చేందుకు ఉపక్రమించింది. తండాల్లో ఆధ్వానంగా ఉన్న మట్టి దారులను గుర్తించాలని ఆదేశాలు జారీ చేసింది. దీనికి అనుగుణంగా జిల్లా పంచాయతీరాజ్‌ శాఖ అధికారులు, ఎంపీడీఓలు, ఎంపీఓలు క్షేత్ర స్థాయిలో పర్యటించి వాటిని ఎంపిక చేశారు. నూతన రోడ్ల నిర్మాణానికి ఎన్ని నిధులు అవసరం వంటి అంచనాలను పూర్తి చేసి జిల్లా కలెక్టర్‌ హనుమంతరావు ద్వారా ప్రభుత్వానికి శనివారం నివేదికను పంపారు. ఈ నేపథ్యంలో ‘న్యూస్‌టుడే’ ప్రత్యేక కథనం.

గతంలోనే ప్రభుత్వ ప్రకటన

జిల్లాలో సంగారెడ్డి, జహీరాబాద్‌, పటాన్‌చెరు, నర్సాపూర్‌ (హత్నూర), అందోల్‌, నారాయణఖేడ్‌ నియోజకవర్గాల్లో 7 మండలాలు, 14 గ్రామ పంచాయతీలను ప్రత్యేక తండాలుగా ప్రభుత్వం గతంలోనే ప్రకటించింది. ప్రత్యేక గ్రామ పంచాయతీ కాని వాటి జాబితాలో ఆయా నియోజకవర్గాల పరిధిలో 22 మండలాలు, 69 గ్రామ పంచాయతీలున్నట్లుగా పంచాయతీరాజ్‌ శాఖ అధికారులు తమ సర్వేలో తేల్చారు. గిరిజన జనాభా రాకపోకలకు అనుగుణంగా కచ్చా రహదారులను తారు రోడ్లుగా అభివృద్ధి చేసి వారి కష్టాలకు విముక్తి కల్పించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇందుకోసం కీలకమైన రహదారులను గుర్తించి వాటికి నిధులు, కిలో మీటర్ల మేరకు సర్వే చేశారు. ప్రభుత్వం నుంచి నిధులు వస్తే రూ.5లక్షల లోపు వరకు నామినేషన్‌ పద్ధతిలో పనులు చేస్తారు. అంతకుమించిన వాటికి నిధులు ఎక్కువగా ఉంటే టెండర్లు వేసి గుత్తేదారులకు అప్పగించేలా పీఆర్‌ శాఖ అధికారులు దృష్టి సారిస్తున్నారు.

ఇవీ ప్రతిపాదనలు

* అందోల్‌ మండలం రాంసాన్‌పల్లి తండాకు 30ఏళ్ల నుంచి మట్టి దారే దిక్కుగా ఉంది. వర్షం పడితే చాలు బురదమయంగా మారుతోంది. అర కిలో మీటరు వరకు రూ.40లక్షలతో తారు రోడ్డు వేయాలని అధికారులు సర్వేలో తేల్చి నిధులు ప్రతిపాదించారు. దీన్ని బాగు చేయాలని మూడు దశబ్దాలుగా స్థానిక గిరిజనులు ప్రజా ప్రతినిధులకు మొర పెట్టుకున్నా మోక్షం దక్కలేదు. ఈసారైనా నిధులు మంజూరు చేసి కొత్తది నిర్మించాలని కోరుతున్నారు.

* మండల కేంద్రమైన కందిలోని మదిర కంది (వెంకట్‌రావు తండా) ఉంది. ఇక్కడా 30 ఏళ్ల నుంచి రహదారి లేదు. తారు రోడ్డు నిర్మించాలని 20ఏళ్ల నుంచి వినతి పత్రాలు ఇస్తూనే ఉన్నారు. తాజాగా 2.50 కి.మీ. మేర విస్తరణకు రూ.1.62లక్షలు ప్రతిపాదించారు. తాము నిత్యం కంది, సంగారెడ్డి, శంకర్‌పల్లికి వెళ్లాలంటే నరకయాతన పడాల్సి వస్తోందన్నారు. ఉత్పత్తుల తరలింపులకు ఏటా రవాణా కష్టాలు అంతా ఇంతా కావని.. తారు రోడ్డు వేసి ఆదుకోవాలని గిరిజనులు వాపోతున్నారు.

* సిర్గాపూర్‌ మండలంలోని హేమ్లా తండా గతంలో వాసర్‌ గ్రామ పంచాయతీ పరిధిలో ఉండేది. ప్రస్తుతం కిషన్‌నాయక్‌ తండా పరిధిలోకి వచ్చింది. దీనికి కేవలం మట్టి దారి మాత్రమే ఉంది. దీనివల్ల గిరిజనులు రాకపోకలకు అవస్థలు పడుతున్నారు. ఇక్కడి నుంచి నారాయణఖేడ్‌, కంగ్టి వివిధ పనుల నిమిత్తం వెళుతుంటారు. ఈదారి బాగుకోసం 3 కి.మీ మేర రూ.3.10లక్షలతో నిర్మాణానికి ఖర్చు అవుతుందని అధికారులు అంచనాలు కట్టారు.

* సిర్గాపూర్‌ మండలం పొట్టిపల్లి తండా రహదారి అంతా బురదమయంగా గుంతలు, ఎత్తు, పల్లాలు, కయ్యలు పడి దర్శన మిస్తోంది. దీన్ని 2.19కి.మీ. మేర తారు రోడ్డుగా నిర్మించాలని, ఇందుకు రూ.1.83లక్షలు నిధులు అవసరం అవుతాయని అధికారులు గుర్తించారు. మూడు మాసాల క్రితం స్థానిక ఎమ్మెల్యేకు గిరిజనులు విన్నవించారు. తాజాగా అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు.

నిధులు రాగానే పనులు: జగదీశ్వర్‌, పీఆర్‌ ఈఈ, సంగారెడ్డి

గిరిజన తండాల్లోని మట్టిదారులను తారు రోడ్లుగా మార్చాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇందులో భాగంగా ఆయా ప్రాంతాల్లో వాటి దుస్థితిపై పూర్తి వివరాలను సేకరించాం. ప్రభుత్వానికి నివేదిక పంపించాం. కేటాయించే నిధుల ఆధారంగా తారు రోడ్లు నిర్మించి తండా వాసుల కష్టాలను తీరుస్తాం.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని