అవినీతి ఆరోపణలు... వ్యక్తిగత ఫిర్యాదులు!
eenadu telugu news
Published : 05/08/2021 02:07 IST

అవినీతి ఆరోపణలు... వ్యక్తిగత ఫిర్యాదులు!

మండలాల్లో తమకు గదులు కేటాయించడం లేదన్న జడ్పీటీసీలు
ఆడిటింగ్‌ కోసం లంచాలు వసూలు చేస్తున్నారంటూ ఆగ్రహం
వాగ్వాదాలతో వాడివేడిగా జిల్లా పరిషత్‌ సమావేశం
ఈనాడు, సంగారెడ్డి

మాట్లాడుతున్న శాసన మండలి ప్రొటెం స్పీకర్‌ భూపాల్‌రెడ్డి చిత్రంలో జడ్పీ అధ్యక్షురాలు మంజుశ్రీ,
కలెక్టర్‌ హనుమంతరావు, ఎమ్మెల్యేలు భూపాల్‌రెడ్డి, మాణిక్‌రావు

ప్రజా సమస్యలను చర్చించి వారి ఇబ్బందులను తీర్చేందుకు వేదిక కావాల్సిన జడ్పీ సర్వసభ్య సమావేశం వాగ్వాదాలకు కేంద్రంగా మారింది. క్షేత్రస్థాయిలో జనాలు పడుతున్న కష్టాలను సభ దృష్టికి తేవడం కన్నా వ్యక్తిగత ఫిర్యాదులు ఇవ్వడానికే చాలా మంది సభ్యులు యత్నించారు. దీంతో అర్ధవంతంగా సాగాల్సిన సమావేశం మొక్కుబడిగా మారింది. జిల్లా ప్రజా పరిషత్తు అధ్యక్షురాలు మంజుశ్రీ అధ్యక్షతన బుధవారం జరిగిన సమావేశంలో శాసనమండలి ప్రొటెం ఛైర్మన్‌ వి.భూపాల్‌రెడ్డి, పాలనాధికారి హనుమంతరావు, ఎమ్మెల్యేలు మాణిక్‌రావు, ఎం.భూపాల్‌రెడ్డి, డీసీఎంఎస్‌ ఛైర్మన్‌ మల్కాపురం శివకుమార్‌, గ్రంథాలయ సంస్థ జిల్లా అధ్యక్షుడు నరహరిరెడ్డి, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు. మండల కార్యాలయాల్లో తమకు కనీసం గది కూడా కేటాయించకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని నాగల్‌గిద్ద జడ్పీటీసీ రాజూ రాథోడ్‌ సభ దృష్టికి తెచ్చారు. ఆయనకు మద్దతుగా కొందరు జడ్పీటీసీలు ఇదే అంశాన్ని లేవనెత్తడంతో కాసేపు వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ సమస్యను తాను పరిష్కరిస్తానని జడ్పీ అధ్యక్షురాలు హామీ ఇచ్చారు. ఆ వెంటనే జడ్పీ ఉపాధ్యక్షుడు మైక్‌ అందుకున్నారు. ఇటీవల జడ్పీకి జాతీయ స్థాయిలో పురస్కారం వచ్చిన సందర్భంగా.. తనకు సమాచారం లేకుండా అధ్యక్షురాలు, సీఈవో వెళ్లి మంత్రి హరీశ్‌రావును కలవడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. అందరి కృషి వల్లే అవార్డు వచ్చిందనే విషయాన్ని గుర్తించాలన్నారు. మంత్రిని కేవలం వారిద్దరే వెళ్లి కలవడమేంటని ప్రశ్నించారు. అందరి తరఫున వెళ్లి కలిసొచ్చారంటూ పాలనాధికారి నచ్చజెప్పడంతో గొడవ సద్దుమణిగింది.

సర్పంచులను బలి చేస్తున్నారు..

పంచాయతీల్లో ఆడిటింగ్‌ చేసేందుకు వచ్చే సిబ్బంది లంచాలు అడుగుతున్నారని ఉపాధ్యక్షుడు ప్రభాకర్‌ ఆరోపించారు. ఏయే పంచాయతీ వాళ్లు ఎంత ఇచ్చారో ఆ వివరాలను చదివి వినిపించారు. అధికారులు తమ తప్పులను కప్పిపుచ్చుకునేందుకు సర్పంచులను బలి చేస్తున్నారన్నారు.కిష్టారెడ్డిపేట, ఇంద్రేశం సర్పంచులను సస్పెండ్‌ చేయడమే ఇందుకు నిదర్శనమన్నారు. అనవసరంగా కక్ష సాధింపు చర్యలకు దిగితే అందరం కలిసొచ్చి కార్యాలయాల ఆందోళన చేస్తామని హెచ్చరించారు. అధికారులు కిందిస్థాయి సిబ్బందితో కలిసి వసూళ్లకు పాల్పడుతున్నారన్నారు. పంచాయతీ రాజ్‌ విభాగంపై చర్చ సందర్భంగా కొందరు జడ్పీటీసీలు లేచి బిల్లుల రికార్డు సరిగా జరగడం లేదని ఫిర్యాదు చేశారు. పీఆర్‌ ఈఈ జగదీశ్వర్‌ స్పందించి... కొన్ని రాజకీయ అంశాలే ఇందుకు కారణమన్నారు. దీంతో నారాయణఖేడ్‌ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డితో పాటు మిగతా సభ్యులు అధికారి మాట్లాడిన తీరు సరికాదంటూ వాగ్వాదానికి దిగారు. ఆయన తరఫున తాను క్షమాపణలు చెబుతున్నానని పాలనాధికారి అన్నారు.

పాల్గొన్న ప్రజా ప్రతినిధులు, అధికారులు

అధికారి తీరుతోనే నా భర్త మరణం!

‘మా ఎంపీడీవో అభివృద్ధి పనుల్లో ఏమాత్రం సహకరించడం లేదు. పైగా నువ్వెంత అంటూ మాట్లాడుతున్నారు. ఇదే విషయాన్ని ఒకరోజు మా కుమారుడు నా భర్త దుర్గేష్‌కు ఫోన్‌లో చెబుతున్నాడు. ఆయన ఆ మాటలు వింటూ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. ఆస్పత్రికి తీసుకెళితే గుండెపోటుతో చనిపోయాడని వైద్యులు చెప్పారు. మీరేం చేసినా నా భర్త ప్రాణాలు తిరిగొస్తాయా’ అంటూ సంగారెడ్డి ఎంపీపీ లావణ్య కన్నీటిపర్యంతమయ్యారు. తమ కుటుంబానికి న్యాయం చేయాలంటూ కోరారు.


రైతులకు న్యాయం చేయండి..

తంలో సహకార బ్యాంకుల్లో భూమి పత్రాలను తనఖా పెట్టి రుణం తీసుకున్న రైతులకు న్యాయం చేయాలని డీసీఎంఎస్‌ అధ్యక్షులు శివకుమార్‌ కోరారు. రుణం చెల్లించిన తర్వాత సబ్‌రిజిస్ట్రార్‌, తహసీల్దార్‌ కార్యాలయాల్లోని రికార్డుల్లో తనఖా వివరాలను తొలగించాల్సి ఉండగా పట్టించుకోవడం లేదు. ఇందువల్ల ఆ భూముల క్రయ విక్రయాలకు ఆస్కారం లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆయన పేర్కొన్నారు.

* సమావేశంలో తొలుత రాయికోడ్‌ ఎంపీపీ విఠల్‌రావు మృతికి సంతాపం ప్రకటించారు. రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు.


మీ సేవలో దరఖాస్తు చేయించండి..

కొందరు సభ్యులు ధరణి అమల్లోకి వచ్చిన తర్వాత రైతులకు ఎదురవుతున్న ఇబ్బందులను ప్రస్తావించారు. పాలనాధికారి స్పందిస్తూ... అలాంటి సమస్యలపై జిల్లాలో 45వేల దరఖాస్తులు వచ్చాయన్నారు. 39 వేల వినతులను పరిష్కరించామన్నారు. మరో 6వేలు వివిధ దశల్లో ఉన్నాయన్నారు. సమస్య ఉన్న రైతులు మీ సేవ కేంద్రంలో దరఖాస్తు ఇచ్చేలా ప్రజాప్రతినిధులు అవగాహన కల్పించాలని సూచించారు. గుమ్మడిదల మండలం నాగిరెడ్డిగూడెంలో ఊరంతా భూసమస్య ఉన్న విషయం ప్రస్తావనకు వచ్చింది. రీసర్వే చేసి సాధ్యమైనంత త్వరగా అందరికీ పాసుపుస్తకాలు ఇప్పించేలా చర్యలు చేపట్టామని కలెక్టర్‌ బదులిచ్చారు.


ప్రస్తావనకు వచ్చిన సమస్యలివీ...

న్యూస్‌టుడే, సంగారెడ్డి అర్బన్‌

జిల్లా పరిషత్‌ సమావేశంలో సభ్యులు ప్రస్తావించిన అంశాలను విన్న పాలనాధికారి.. పరిష్కరించేందుకు కృషి చేస్తానంటూ హామీ ఇచ్చారు. తన పరిధిలోకి రాని సమస్యలను మంత్రి హరీశ్‌రావు దృష్టికి తీసుకెళతానని భరోసా ఇచ్చారు.

నల్లవాగు ప్రాజెక్టు ఆధునికీకరణ ఆగింది: భూపాల్‌రెడ్డి, ఖేడ్‌ ఎమ్మెల్యే

ఆధునికీకరణకు ప్రభుత్వం రూ. 24.14 కోట్లు విడుదల చేసింది. 2017లో మంత్రి హరీశ్‌రావు పనులు ప్రారంభించారు. ఇప్పటికి రూ. 2.05 కోట్ల మేరకు మాత్రమే జరిగాయి. మిగిలినవి చేయడంపై గుత్తేదారు ఆసక్తి చూపడం లేదు. నా నియోజకవర్గంలో ఆరు మండలాలకు ఒక్కరే పంచాయతీరాజ్‌ ఏఈ ఉండటంతో, పనులు సాగడం లేదు. ప్రతి సమావేశానికి ఇక నుంచి పీఆర్‌ ఎస్‌ఈని పిలవాలి. ఈఈలు కొన్ని నిర్ణయాలు తీసుకునేందుకు అధికారం ఉండదు.

కార్యదర్శుల బదిలీలు చేపట్టాలి: మాణిక్‌రావు, జహీరాబాద్‌ ఎమ్మెల్యే

గ్రామ పంచాయతీ కార్యదర్శుల బదిలీలు చేపట్టాలి. గతంలోనూ ఈ సమస్యను జడ్పీ దృష్టికి తీసుకొచ్చాను. సర్పంచులు, పంచాయతీ కార్యదర్శుల మధ్య సఖ్యత లేక గ్రామాల అభివృద్ధిపై ప్రభావం పడుతోంది. జహీరాబాద్‌ 24వ వార్డులో నడి రోడ్డుపై విద్యుత్‌ స్తంభం ఉండటంతో ప్రజల రాకపోకలకు ఇబ్బందిగా ఉంది. వెంటనే తొలగించాలి.

గంజాయి సరఫరాను అడ్డుకోండి: రమేశ్‌, జడ్పీటీసీ, అందోలు

యువత కొందరు గంజాయి మత్తులో జోగుతున్నారు. సంగారెడ్డి పోతిరెడ్డిపల్లి చౌరస్తా, అందోలు, జోగిపేట, లింగంపల్లి చౌరస్తా తదితర ప్రాంతాల్లో యథేచ్ఛగా విక్రయిస్తున్నారు, మత్తు ఇంజక్షన్లూ దొరుకుతున్నాయి. గంజాయి రవాణా, విక్రయిదారులపై చర్యలు తీసుకోవాలి. సింగూర్‌ నీటిని సాగు అవసరాలకు విడుదల చేయాలి. అక్సాన్‌పల్లి చెరువును సింగూర్‌ నీటితో నింపాలి.

కొత్లాపూర్‌ రహదారిని బాగు చేయండి: సునీత, జడ్పీటీసీ,సంగారెడ్డి

సంగారెడ్డి పరిధిలోని పోతిరెడ్డిపల్లి నుంచి కొత్లాపూర్‌ గ్రామ రహదారి పీఎంజీఎస్‌వై కింద మంజూరైనా పనులకు నోచుకోవడం లేదు. అధ్వానంగా ఉండటంతో రాకపోకలకు ప్రజలు అవస్థలు పడుతున్నారు. వెంటనే నిర్మాణ పనులు ప్రారంభించాలి. కరోనా వ్యాక్సినేషన్‌ కేంద్రాన్ని ఇస్మాయిల్‌ఖాన్‌పేటలో ఏర్పాటు చేస్తే 25 గ్రామాల ప్రజలకు మేలు జరుగుతుంది. ఈ విషయమై అధికారులు దృష్టి సారించాలి.

* కోహీర్‌లో విద్యుత్‌ సమస్యలను పరిష్కరించాలని తొలివిడత పల్లె ప్రగతిలో ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు ఏఈ పట్టించుకోలేదు. ఆయనను బదిలీ చేయాలని కోహీర్‌ ఎంపీపీ మాధవి కోరారు.

* కల్హేర్‌ ప్రభుత్వ ఆసుపత్రిని ఆరు నుంచి 30 పడకల స్థాయికి పెంచారు. రెండేళ్ల క్రితం కొత్త భవనం అందుబాటులోకి వచ్చింది. పరికరాలు సమకూర్చం, వైద్యులతోపాటు సిబ్బంది భర్తీ ఊసేలేదని జడ్పీటీసీ నర్సింహారెడ్డి సమావేశంలో పేర్కొన్నారు.

* అమీన్‌పూర్‌ మండలం సుల్తాన్‌పూర్‌ సర్వే నంబరు 30లోని భూమిలో 250 మంది రైతులు 1955 నుంచి సాగులో ఉన్నారు. 2018లో తహసీల్దార్‌ ఆ భూమిని ఖారీజు ఖాతా కింద స్వాధీనం చేసుకున్నారు. దీంతో రైతులకు కొత్తగా పట్టా పాసుపుస్తకాలు రాలేదు. ఫలితంగా రైతు బంధు, రైతు భీమా పథకాలు అందని పరిస్థితి ఏర్పడింది. వారికి న్యాయం చేయాలని జడ్పీటీసీ సుధాకర్‌రెడ్డి కోరారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని