భూనిర్వాసితులకు ఇళ్ల స్థలాలు
eenadu telugu news
Published : 05/08/2021 02:39 IST

భూనిర్వాసితులకు ఇళ్ల స్థలాలు

గజ్వేల్‌ శివారులో సిద్ధమవుతోన్న వెంచర్‌

రహదారులు, మురుగు కాలువల నిర్మాణం

న్యూస్‌టుడే, గజ్వేల్‌

వెంచర్‌ లో భూగర్భ మురుగు పారుదల వ్యవస్థ

కొమురవెల్లి మల్లన్నసాగర్‌ జలాశయం నిర్వాసితులకు ప్రభుత్వం గజ్వేల్‌ పట్టణ శివారులో పలు సౌకర్యాలతో కూడిన వెంచర్‌ ఏర్పాటు అవుతోంది. జిల్లా పాలనాధికారి వెంకటరామరెడ్డి పర్యవేక్షణలో పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఒక్కో ప్లాటు 250 గజాలుగా నిర్ణయించారు. వెంచర్‌లో విశాలమైన రహదారులు, భూగర్భ మురుగు పారుదల వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి అంతర్గత రహదారిని సీసీతో నిర్మిస్తున్నారు. మల్లన్నసాగర్‌ ప్రాజెక్టు నిర్మాణంతో తొగుట మండలం ఏటిగడ్డ కిష్టాపూర్‌, వేములఘాట్‌, లక్ష్మాపూర్‌, రాంపూర్‌, బంజేరుపల్లి, పల్లెపహాడ్‌, కొండపాక మండలం సింగారం, ఎర్రవల్లి గ్రామాలు ముంపునకు గురవుతున్న విషయం తెల్సిందే. నిర్వాసితుల కోసం గజ్వేల్‌-ప్రజ్ఞాపూర్‌ పురపాలిక పరిధిలోని సంగాపూర్‌-ముట్రాజ్‌పల్లి కాలనీల మధ్య సుమారు 600 ఎకరాలను అభివృద్ధి చేశారు. ఇందులో 2256 ఇళ్లు నిర్మిస్తున్నారు. 3429 మందికి ఇంటి స్థలాలు ఇవ్వడానికి చర్యలు చేపట్టారు. ఇప్పటివరకు 2200 వేల ఇళ్ల నిర్వాసితులకు పంపిణీ చేశారు. మిగతా వాటికి సంబంధించి పనులు పూర్తి చేసి త్వరలోనే నిర్వాసితులకు ఇవ్వనున్నట్లు అధికారులు చెబుతున్నారు.

కనీస వసతులతో...

ఇళ్లు నిర్మించిన కాలనీల్లో 40 అడుగుల వెడల్పుతో ప్రధాన రహదారులు... 33 అడుగులతో అంతర్గత దారులు నిర్మించారు. వెంచర్‌లో సైతం ఇదే విధంగా పనులు చేపడుతున్నారు. నిర్వాసితులకు విద్యుత్తు, తాగునీటి సదుపాయం, మురుగు కాలువలను నిర్మిస్తున్నారు. ఆహ్లాదం పంచేందుకు ఉద్యానాలు సిద్ధం చేస్తున్నారు. గజ్వేల్‌ బ్యాహవలయ రహదారికి ఆనుకునే వెంచర్‌ ఏర్పాటు అవుతోంది. పనులు పూర్తి కాగానే నిర్వాసితులకు ఇంటి స్థలాలను అప్పగిస్తామని సిద్దపేట ఆర్డీవో అనంతరెడ్డి తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని