వేగం పెంచాలి.. నిగ్గు తేల్చాలి.!
eenadu telugu news
Published : 05/08/2021 02:39 IST

వేగం పెంచాలి.. నిగ్గు తేల్చాలి.!

కొనసాగుతున్న ఉపాధి హామీ సామాజిక తనిఖీలు

ఇప్పటి వరకు ఎనిమిది మండలాల్లో పూర్తి

ఈనాడు డిజిటల్‌, సిద్దిపేట

ఇటీవల రాయపోల్‌ మండలంలో నిర్వహించిన సామాజిక తనిఖీ ప్రజావేదికలో అధికారులు

పాధి హామీ పథకం కింద చేపట్టిన పనుల్లో అక్రమాలను నిగ్గు తేల్చడానికి సామాజిక తనిఖీల్లో భాగంగా ప్రజావేదికలు నిర్వహించాల్సి ఉంటుంది. మొత్తంగా పథకం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 11 విడతల్లో తనిఖీలు పూర్తి చేశారు. తాజాగా ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన సామాజిక తనిఖీలు కొనసాగుతున్నాయి. సాధారణంగా ఏడాదికి రెండుసార్లు ఈ ప్రక్రియ చేపట్టాల్సి ఉండగా.. గతేడాది కరోనా ప్రభావంతో అంతంతమాత్రమే సాగింది. ఈ ప్రక్రియను ప్రస్తుతం మరింత వేగవంతం చేయాల్సి ఉంది. జిల్లాలో ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి దాకా ఎనిమిది మండలాల్లో తనిఖీలు పూర్తి చేశారు. ఈనెలలో చేర్యాల, మర్కూక్‌ మండలాల్లో ప్రజావేదికలు నిర్వహించడానికి అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. జిల్లాలో 2019-20 ఆర్థిక సంవత్సరంలో ఉపాధి హామీ ద్వారా రూ.162 కోట్లు, 2020- 21లో రూ.190 కోట్లు వెచ్చించారు. కూలీలకు ఉపాధి కల్పించడం, నిర్మాణాత్మక పనులు చేపట్టారు.

135 మందికి తాఖీదులు..

జిల్లాలో కొత్తగా ఏర్పాటైన వాటితో కలిపి మొత్తం 24 మండలాలు ఉన్నాయి. అందులో నారాయణరావుపేట, సిద్దిపేట అర్బన్‌, సిద్దిపేట గ్రామీణం, రాయపోల్‌, కొమురవెల్లి, అక్కన్నపేట మండలాలకు సంబంధించి ఈ ఏడాది తనిఖీలు నిర్వహించారు. కొండపాక, గజ్వేల్‌ మండలాల్లో ఇదివరకే పది విడతల్లో తనిఖీలు నిర్వహించగా తాజాగా పదకొండోసారి అయ్యింది. తనిఖీలు పూర్తయిన నారాయణరావుపేట, సిద్దిపేట గ్రామీణ, కొండపాక మండలాల్లో అవకతవకలకు పాల్పడిన 135 మందిని గుర్తించి తాఖీదులు జారీ చేశారు. మిగతా మండలాల్లోనూ జారీ చేసేదిశగా కసరత్తు చేస్తున్నారు. గతేడాది కరోనా తగ్గుముఖం పట్టిన అనంతరం సెప్టెంబరు నుంచి ఈ ఏడాది మార్చి వరకు జరిపిన తనిఖీల్లో రూ.43,650 సొమ్మును రికవరీ చేశారు. ఈ ఏడాదిలో ఆడిట్‌ అభ్యంతరం జరిగిన మండలాలకు సంబంధించి ఆయా అంశాలతో సంబంధం ఉన్న అధికారులు, సిబ్బంది నోటీసులు అందుకున్నాక సంజాయిషీ ఇవ్వాల్సి ఉంటుంది.

ప్రధానంగా గుర్తించినవి..

ఉపాధి హామీ పనుల్లో జరిగే అవకతవకల్లో ప్రధానంగా.. హరితహారంలో నాటిన మొక్కలకు సంబంధించి నిధుల వినియోగం, పనుల్లో కొలతలు తేడా ఉండటం, మస్టర్లలో తప్పడు సమాచారం నమోదు వంటివి ఉన్నట్లు తేల్చారు. జిల్లాలో చేపట్టిన మెటీరియల్‌ కాంపొనెంట్‌ పనులకు సంబంధించి ఎక్కువగా రైతువేదికలు, డంపింగ్‌యార్డులు, వైంకుంఠధామాలు, పల్లెప్రకృతి వనాలు ఉన్నాయి. ఇవి కాకుండా రైతులకు వ్యక్తిగతంగా ఉపయుక్తమయ్యే.. కల్లాలు, గొర్రెలు, పశువుల షెడ్లను సైతం నిర్మించారు. ఆయా వాటిల్లో అవకతవకలు ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. మెటీరియల్‌ కాంపొనెంట్‌ పనులకు సంబంధించి తాజాగా రాజీవ్‌ రహదారిపై మొక్కలు నాటే ప్రక్రియ కొనసాగుతోంది.

అక్రమాలు వెలికితీస్తాం.. - గోపాల్‌రావు, డీఆర్డీవో

కరోనా ప్రభావంతో గతేడాది సామాజిక తనిఖీల ప్రక్రియ పూర్తిస్థాయిలో చేపట్టలేదు. ఈ ఏడాదికి సంబంధించి ఇప్పటిదాకా ఎనిమిది మండలాల్లో ప్రక్రియ పూర్తయ్యింది. చేర్యాల, మర్కూక్‌ మండలాల్లో ప్రజావేదికలు నిర్వహించనున్నాం. మిగతా మండలాల్లోనూ వేగంగా తనిఖీలు జరిపి అక్రమాలు వెలికితీసి.. నిధులను రికవరీ చేసి, బాధ్యులపై చర్యలు తీసుకుంటాం.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని