ఎవరూ పట్టించుకోరనే ధైర్యమా?
eenadu telugu news
Published : 05/08/2021 02:39 IST

ఎవరూ పట్టించుకోరనే ధైర్యమా?

నకిలీ పత్రాల సృష్టిలో మతలబు

మిరుదొడ్డి, న్యూస్‌టుడే: ఆధునిక సాంకేతిక వ్యవస్థ సాయంతో ఆస్తుల వ్యవహారాల్లో అవకతవకలు జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నా.. కొందరు మాత్రం నకిలీ పత్రాల సృష్టితో మాయ చేయడానికి యత్నిస్తున్నారు. మద్దూరు మండలంలో చంద్రవ్వ బతికున్నా ఆమె చనిపోయినట్టు ధ్రువపత్రం సృష్టించి.. ఆస్తి కాజేయడానికి చేసిన పన్నాగం బట్టబయలు కావడంతో.. అనేక ప్రశ్నలు ముందుకొస్తున్నాయి. ఎంతటి సాంకేతికం ఉన్నా తాము ఆస్తి మార్పిడి చేయిస్తామంటూ ఇంకా దళారులు కొందరిని మభ్య పెడుతున్నారు. నకిలీ పత్రాలను సృష్టించి, మీసేవ కేంద్రాలను వాడుకుంటున్నారు. చంద్రవ్వ మద్దూరు మండలంలో నివసిస్తుండగా.. ఆర్నెల్ల క్రితం చనిపోయిన ఆమె భర్తది మిరుదొడ్డి మండలం. ఈ రెండింటికీ సంబంధం లేని సిద్దిపేట అర్బన్‌ మండలంలోని గ్రామం ‘లింగారెడ్డిపల్లి’ పంచాయతీ ముద్రతో నకిలీ పత్రాన్ని మీసేవ కేంద్రంలో అప్‌లోడ్‌ చేశారు. వాస్తవంగా గ్రామం పేరు ‘పెద్దలింగారెడ్డిపల్లి’. ఆ పత్రాన్ని తాము జారీ చేయలేదని పంచాయతీ ముద్ర, సంతకం తప్ఫు. అని కార్యదర్శి సంధ్య వివరించారు. నకిలీ మరణ ధ్రువీకరణ పత్రంతో కుటుంబ సభ్యుల ధ్రువీకరణ ఎలా జరిగిందనేది అందరినీ తొలుస్తున్న ప్రశ్న! రెండు పత్రాల్లోని తేదీల్లోనూ తప్పులు స్పష్టంగా ఉన్నాయి. జూన్‌ 22న చంద్రవ్వ మృతి చెందినట్టు.. 25న దరఖాస్తు చేస్తే.. పంచాయతీ జూన్‌ 28న ధ్రువపత్రం ఇచ్చినట్టు అందులో ఉంది. మిరుదొడ్డి మండలానికి గతంలో సుజాత పనిచేశారు. జూన్‌ 7న ఆమె బదిలీపై వెళ్లారు. జూన్‌ 26న ఆమె డిజిటల్‌ సంతకంతో మీసేవ ద్వారా ధ్రువపత్రం జారీ అయినట్టు కాగితాన్ని రూపొందించి ఆస్తి బదలాయింపుకు ఆన్‌లైన్లో అప్‌లోడ్‌ చేయడం గమనార్హం. ప్రభుత్వ యంత్రాంగం పటిష్ఠ చర్యలు తీసుకొని ఇలాంటి దుష్టయత్నాలను ఎప్పటికప్పుడు అరికడితే ఆస్తుల యజమానులు నిశ్చింతగా ఉండగలుగుతారు. పట్టించుకోకపోతే మరింత రెచ్చిపోతారని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని