అన్నీ ఉచితం..చరవాణికే సమాచారం
eenadu telugu news
Published : 22/09/2021 01:55 IST

అన్నీ ఉచితం..చరవాణికే సమాచారం

● పేదలకు వరం రోగ నిర్ధారణ పరీక్ష కేంద్రం

● రోజురోజుకు పెరుగుతున్న ఆదరణ

న్యూస్‌టుడే, మెదక్‌

మెదక్‌ పట్టణంలోని రోగ నిర్ధారణ కేంద్రం

రోగ నిర్ధారణ పరీక్షల కేంద్రం (డయాగ్నాస్టిక్‌ హబ్‌) పేదల పాలిట వరంగా మారింది. ప్రారంభంలో డ్రై రన్‌ నిర్వహించగా, అధికారికంగా ప్రారంభమైన తర్వాత నుంచి ప్రతి నెలా పరీక్షల సంఖ్య పెరుగుతోంది. రూ.వేలు వెచ్చించి ప్రైవేటు ప్రయోగశాలలో పరీక్షలు చేయించుకోలేని పేదలు కేంద్రానికి వస్తుండటంతో రోజురోజుకు ఆదరణ పెరుగుతోంది. జిల్లాలోని ఆయా ప్రభుత్వ ఆస్పత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి నమూనాలను తీసుకువచ్చి ఇక్కడ పరీక్షలు చేస్తున్నారు. ఈ అంశంపై ‘న్యూస్‌టుడే’ కథనం.

జిల్లాలో 19 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఒక పట్టణ ఆరోగ్య కేంద్రం, మెదక్‌, నర్సాపూర్‌లో ప్రాంతీయ, రామాయంపేట, తూప్రాన్‌లో సామాజిక ఆస్పత్రులు ఉన్నాయి. వాటిల్లో పలు రకాల శస్త్ర చికిత్సలు, కాన్పులు నిర్వహిస్తున్నారు. శస్త్రచికిత్స నిర్వహించే ముందు రోగి ఆరోగ్యానికి సంబంధించి పలు రకాల పరీక్షలు చేయాల్సి ఉంటుంది. ఆయా ఆస్పత్రుల్లో ఆధునిక రోగ నిర్ధారణ పరీక్ష యంత్రాలు అందుబాటులో లేవు. ఇప్పటివరకు ఉన్న వాటితో పరీక్ష చేసి ఫలితాలు పంపేవారు. వైద్యులు రాసిన పరీక్షల్లో అత్యధికంగా ప్రైవేట్‌ రోగ నిర్ధారణ కేంద్రాలకు వెళ్లి చేయించుకోవాల్సిన పరిస్థితి ఉండేది. ఇందుకు రోగులపై ఆర్థిక భారం పడుతుండగా వారి ఇబ్బందులను గుర్తించిన ప్రభుత్వం 19 జిల్లాలో డయాగ్నాస్టిక్‌ హబ్‌లు ఏర్పాటు చేసింది. అందులో భాగంగా జిల్లా కేంద్రం మెదక్‌ ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో జాతీయ ఆరోగ్య మిషన్‌ నిధులు రూ.38 లక్షలతో రోగ నిర్ధారణ పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.

అనుసంధానంతో సులువైన పని..

జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలోని రోగ నిర్ధారణ పరీక్షల కేంద్రానికి 15 పీహెచ్‌సీలతో పాటు రెండు ప్రాంతీయ, రెండు సామాజిక ఆస్పత్రులను అనుసంధానం చేశారు. వైద్యం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చే రోగుల నుంచి రక్త నమూనాలను సేకరించి బార్‌ కోడ్‌ వేసి ప్రత్యేక వాహనంలో మధ్యాహ్నం 2 గంటల లోపు కేంద్రానికి తరలిస్తారు. ఇందుకు మూడు వాహనాలను అందుబాటులో ఉంచారు. రోగ నిర్ధారణ కేంద్రంలో పరీక్షలు నిర్వహించి నివేదికలను ఆన్‌లైన్‌లో సంబంధిత ఆస్పత్రులకు పంపుతున్నారు. ఫలిలాలను రోగుల స్మార్ట్‌ ఫోన్‌ లేదా ఈ-మెయిల్‌కు పంపుతున్నారు. మాన్యువల్‌ నివేదికలు అవసరమున్న రోగులు రక్త నమూనాలు ఇచ్చిన ఆస్పత్రులకు వెళ్లి తీసుకునే వెసులుబాటు సైతం కల్పించారు.

ప్రతి రోజూ 250 పైగా..

ఆయా ఆస్పత్రుల నుంచి వచ్చిన నమూనాలకు రోగ నిర్ధారణ కేంద్రంలో పని చేస్తున్న ప్రయోగశాల సాంకేతిక నిపుణులు (ల్యాబ్‌ టెక్నీషియన్లు) 8 మంది పరీక్ష చేస్తున్నారు. వారంతా కలిసి రోజూ 250కి పైగా నమూనాలను పరీక్షించి ఫలితాలు వెల్లడిస్తున్నారు. మార్చిలో కేంద్రం అందుబాటులోకి రాగా మూడు నెలల పాటు డ్రై రన్‌ నిర్వహించారు. జూన్‌ 9న రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లాల్లో అధికారికంగా ప్రారంభించాలని ఆదేశించడంతో మెదక్‌లో పూర్తి స్థాయిలో వినియోగంలోకి వచ్చింది. రక్తం, క్షయ వ్యాధికి సంబంధించి స్పుటం నమూనాలను సేకరించి రోగ నిర్ధారణ కేంద్రానికి పంపుతున్నారు. ప్రస్తుతం ఇక్కడ 45 రకాల పరీక్షలు చేస్తున్నారు. కేంద్రం అధికారికంగా అందుబాటులోకి వచ్చిన నాటి నుంచి పరీక్షల సంఖ్య పెరుగుతోంది. ఆయా నమూనాల ఫలితాలను ఇద్దరు వైద్యులు పరిశీలించాల్సి ఉండగా ఇక్కడ వైద్యుల నియామకం లేకపోవడంతో హైదరాబాద్‌కు పంపుతున్నారు. అక్కడి వైద్యులు పరీశీలించిన తర్వాత నివేదికలను సంబంధిత ఆస్పత్రులు లేదా రోగి చరవాణికి సందేశం చేరవేస్తున్నారు. పాథాలజిస్ట్‌, బయోకెమిస్ట్రీ ఎండీ పోస్టులను భర్తీ చేస్తే మరింత వేగంగా రోగులకు ఫలితాలు అందే అవకాశం ఉంటుంది.

నాలుగు ఆస్పత్రులను చేర్చితే..

రేగోడ్‌, పెద్దశంకరంపేట, అల్లాదుర్గం, గడిపెద్దాపూర్‌ పీహెచ్‌సీలు మినహా మిగిలిన 15 పీహెచ్‌సీలతో పాటు రెండు ప్రాంతీయ, రెండు సామాజిక ఆస్పత్రుల నుంచి నమూనాలు రోగ నిర్ధారణ కేంద్రానికి వస్తున్నాయి. ఈ నాలుగు పీహెచ్‌సీల నుంచి నమూనాలను సంగారెడ్డి జిల్లా వైద్య సిబ్బంది సేకరిస్తున్నారు. మిగిలిన నాలుగు పీహెచ్‌సీలను జిల్లా పరిధిలోకి తీసుకువస్తే పరీక్షలు నిర్వహించే సంఖ్య మరింత పెరగనుంది.


సద్వినియోగం చేసుకోవాలి..

- ప్రజ్ఞ, మేనేజర్‌, రోగ నిర్ధారణ కేంద్రం

జిల్లాలో నాలుగు పీహెచ్‌సీలు మినహా మిగిలిన ప్రభుత్వ ఆస్పత్రుల నుంచి వచ్చిన నమూనాలకు పరీక్షలు చేస్తున్నాం. 57 రకాలకు ప్రస్తుతం 45 రకాల పరీక్షలు అందుబాటులో ఉన్నాయి. ప్రతి రోజు ఆయా మార్గాల్లో వాహనాలు వెళ్లి నమూనాలను సేకరించి కేంద్రానికి తీసుకువస్తారు. జిల్లాలో మిగిలిన ఆస్పత్రులను సైతం కేంద్రం పరిధిలోకి తీసుకురావాలని కోరాం. నమూనాలు తీసుకున్న తర్వాత 24 గంటల్లో నివేదికలు పంపుతున్నాం. ఇటీవల ఎక్కువగా డెంగీ పరీక్షలకు సంబంధించి నమూనాలు రావడంతో త్వరితగతిన నిర్ధారణ చేస్తున్నాం. ఉచిత సేవలను పేదలు సద్వినియోగం చేసుకోవాలి.


నెల నిర్వహించిన పరీక్షలు

మార్చి 2,951

ఏప్రిల్‌ 1,436

మే 2,488

జూన్‌ 17,425

జులై 33,225

ఆగస్టు 42,916

సెప్టెంబర్‌ 22,629 (20 వరకు)


 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని