పర్యాటకం.. పరిహాసం..!
eenadu telugu news
Published : 22/09/2021 01:55 IST

పర్యాటకం.. పరిహాసం..!

● ముందుకు సాగని కుటీరాలు, అతిథి గృహాలు

● ఐదు మాసాలుగా ఆగిన పనులు

● నర్సాపూర్‌ అర్బన్‌ పార్కులో దుస్థితి

న్యూస్‌టుడే, నర్సాపూర్‌


పూర్తికాని అతిథి గృహం

పర్యాటకుల ఆసక్తి, అభిరుచిని దృష్టిలో పెట్టుకుని వారు అడవిలో కుటుంబంతో పాటు రాత్రి పూట నిద్రించేలా, హాయిగా గడిపేందుకు వీలుగా నర్సాపూర్‌లోని అర్బన్‌ పార్కులో పట్టణ ఉద్యానం) నిర్మిస్తున్న కుటీఫఫరాలు, అతిథి గృహాల పనులు అర్ధంతరంగా ఆగిపోయి వెక్కిరిస్తున్నాయి. రూ.1.20 కోట్లతో చేపట్టిన పనులు నిధుల కొరతతో అయిదు నెలలుగా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారాయి.

జిల్లా మొత్తం మీద నర్సాపూర్‌లో మాత్రమే అటవీ శాఖ ఆధ్వర్యంలో రూ.20 కోట్ల నిధులు ఖర్చు చేసి పట్టణ ఉద్యానాన్ని నెలకొల్పారు. గతేడాది జూన్‌లో సీఎం కేసీఆర్‌ చేతుల మీదుగా దీన్ని ప్రారంభించారు. పచ్చని అందాలు, ఆహ్లాదకర వాతావరణంలో సందర్శకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. హైదరాబాద్‌ నగరానికి అతి సమీపంలో ఉండటంతో సందర్శకుల తాకిడి రోజు రోజుకు అధికమవుతోంది. దీన్ని మరింత అభివృద్ధి చేసే క్రమంలో పలు పనులు చేపట్టారు. అందులో భాగంగా పర్యాటకులు రాత్రి వేళ బస చేసేందుకు వీలుగా అతిథి గృహాలు, కుటీరాలు నిర్మించ సంకల్పించారు. ఈ మేరకు ఆరు కుటీరాలు, రెండు అతిథి గృహాలు, భోజనశాల నిర్మాణానికి రూ.1.20 కోట్ల నిధులు మంజూరు చేశారు. టెండరు ప్రక్రియను పూర్తిచేసి ఈ ఏడాది జనవరిలో గుత్తేదారుకు పనులు అప్పగించారు. ఒక్కో కుటీరానికి రూ.9 లక్షలు చొప్పున, రెండు అథితి గృహాలకు రూ.18 లక్షలు, భోజనశాల, రిసెప్షన్‌ గదులకు రూ.14 లక్షలు చొప్పున నిధులు కేటాయించారు. 5 కుటీరాలు, 2 అతిథి గృహాలు, మిగిలిన వాటి నిర్మాణానికి పునాదులు తీసి, పిల్లర్లు నిర్మించి శ్లాబు సైతం వేశారు. దాదాపు రూ.30 లక్షల పనులు పూర్తయినా ప్రభుత్వం బిల్లులు విడుదల చేయకపోవడంతో గుత్తేదారు చేతులెత్తేశారు.

పూర్తయితేనే ప్రత్యేక శోభ...

నర్సాపూర్‌ అర్బన్‌ పార్కులో కుటీరాలు, అతిథిగృహాల పనులు పూర్తయితేనే ఈ ప్రాంతానికి పర్యాటక శోభ వస్తుంది. నర్సాపూర్‌ రాయరావు చెరువుకు అతి సమీపంలో సర్వే నంబరు 114లో 11 మంది రైతుల అసైన్డు భూములను తీసుకుని పనులు ప్రారంభించారు. సందర్శకులు రాత్రివేళ చెరువు అందాలను ఆస్వాదిస్తూ గడిపేందుకు వీలుగా ఇక్కడ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అర్బన్‌ పార్కులోకి వాహనాలు ప్రవేశించే మార్గం నుంచి కుటీరాల వరకు విశాలమైన మట్టి రోడ్డును సైతం పూర్తి చేశారు. కుటీరాలు, అతిథిగృహాలు పూర్తయితే సందర్శకులు రాత్రిపూట అడవిలో బస చేయడానికి అవకాశం ఉంటుంది. పార్కులో సైక్లింగ్‌ ట్రాక్‌ను సైతం నిర్మించారు. 30 సైకిళ్ల వరకూ అందుబాటులో ఉంచేందుకు చర్యలు చేపడుతున్నారు. ఉదయం, సాయంత్రం అడవిలో సైక్లింగ్‌ చేసేందుకు వచ్చేవారికి విడిది ఏర్పాట్లు కూడా చేశారు.


త్వరలో పనులు ప్రారంభిస్తాం..

- అంబర్‌సింగ్‌, అటవీ క్షేత్రాధికారి, నర్సాపూర్‌

నిధుల సమస్య కారణంగానే పనులు నిలిచిపోయాయి. విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. వీలైనంత త్వరలో పనులు పునఃప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. పనులు పూర్తయితే పర్యాటకులు మరింతగా ఆదరించే అవకాశాలున్నాయి.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని