నిమజ్జన శోభాయాత్రలో విషాదం..
eenadu telugu news
Published : 22/09/2021 02:16 IST

నిమజ్జన శోభాయాత్రలో విషాదం..

విద్యుదాఘాతంతో యువకుడి మృతి

చేగుంట, న్యూస్‌టుడే: కొడుకు ప్రయోజకుడై మమ్మల్ని చూసుకుంటాడని ఆ తల్లిదండ్రులు ఆశపడ్డారు. ఎంతో శ్రమించి చదివిస్తున్నారు. కానీ విధి చిన్నచూపు చూసింది. సంతోషంగా వినాయకుడి నిమజ్జన శోభాయాత్రలో పాల్గొన్న ఆ కుర్రాడిని విద్యుదాఘాతం బలి తీసుకుంది. ఈ ఘటన చేగుంట మండలం కర్నాల్‌పల్లి గ్రామంలో చోటుచేసుకుంది. స్థానిక ఎస్‌ఐ సుభాష్‌గౌడ్‌ తెలిపిన వివరాలు.. కర్నాల్‌పల్లి గ్రామానికి చెందిన వడ్ల లత, శ్రీనివాస్‌ దంపతులకు కుమారుడు ప్రశాంత్‌, కుమార్తె వైష్ణవి ఉన్నారు. ప్రశాంత్‌ (20) హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు కళాశాలలో బీటెక్‌ చదువుతున్నాడు. వినాయక చవితి సందర్భంగా స్నేహితులతో కలిసి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. సోమవారం రాత్రి నిమజ్జనోత్సవం నిర్వహించారు. ఈ మేరకు ట్రాక్టర్‌పై ఇనుప రేకులతో అలంకరించారు. శోభాయాత్రలో ప్రశాంత్‌, మరో ఇద్దరు ట్రాక్టర్‌ ట్రాలీలో ఉండి గణనాథుడికి హారతి ఇస్తూ ప్రసాదాన్ని పంచిపెడుతున్నారు. కమ్మరి కృష్ణ అనే వ్యక్తి ఇంటి వద్దకు చేరుకోగానే విద్యుత్తు తీగలు డెకరేషన్‌ కోసం ఏర్పాటుచేసిన పైపులకు తగిలాయి. దీంతో ప్రశాంత్‌ విద్యుదాఘాతానికి గురై కింద పడిపోగా తీవ్రంగా గాయపడ్డాడు. మిగతా వారిలో ఒకరు అప్పటికే దూకగా, మరొకరు ట్రాక్టరుపైనే ఉండటంతో వారికి ఏమీ కాలేదు. క్షతగాత్రుడిని నార్సింగిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతుడి తండ్రి చేగుంటలో వడ్రంగి పని చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్‌ఐ వివరించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని