గణనాథుడికి వీడ్కోలు..!
eenadu telugu news
Published : 22/09/2021 02:16 IST

గణనాథుడికి వీడ్కోలు..!

మెదక్‌ పాత బస్టాండ్‌ సమీపంలో..

పదకొండు రోజుల పాటు విశేష పూజలందుకున్న ఆది దేవుడుకి భక్తులు ఘనంగా వీడ్కోలు పలికి, గంగమ్మ ఒడికి చేర్చారు. డప్పు చప్పుళ్ల నడుమ గణనాథుడి శోభాయాత్ర వైభవంగా జరిపారు. మంగళవారం మెదక్‌ పట్టణంతో పాటు జిల్లాలోని ఆయా మండలాల్లో గణేష్‌ నిమజ్జనోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా గణపతి బప్పా మోరియా అంటూ యువత, చిన్నారులు నినాదాలు, నృత్యాలు చేస్తూ సందడి చేశారు. ఆయా ప్రాంతాల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. మెదక్‌లో జిల్లా అదనపు ఎస్పీ కృష్ణమూర్తి పర్యవేక్షణలో డీఎస్పీ సైదులు సహా సుమారు 600 మంది సిబ్బంది, జిల్లాలోని ఆయా ప్రాంతాల్లో స్థానిక పోలీసులు పటిష్ఠ బందోబస్తు చేపట్టారు. మనోహరాబాద్‌ మండలం కాళ్లకల్‌లో క్రేజీ బాయ్స్‌ ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన వినాయకుడి లడ్డూ వేలం వేయగా గ్రామానికి చెందిన శ్రీనివాస్‌ గౌడ్‌ రూ.1,12,111కు, మెదక్‌ పట్టణంలోని కోలిగడ్డలో నేతాజీ గణేశ్‌ ఆధ్వర్యంలో 41 కిలోల లడ్డూను మై-బడ్డీస్‌ బృందం రూ.61 వేలకు దక్కించుకున్నారు. గ్రామంలో నిర్వహించిన ఉత్సవాల్లో బతుకమ్మ సినిమా హీరో విజయ్‌భాస్కర్‌రెడ్డి, కితకితలు సినిమా ఫేం గీతాసింగ్‌ పాల్గొని సందడి చేశారు. శోభాయాత్ర అనంతరం స్థానిక చెరువులు, కుంటల్లో విగ్రహాలను నిమజ్జనం చేశారు. మెదక్‌లో కమిషనర్‌ శ్రీహరి, కౌన్సిలర్లు, చిన్నశంకరంపేట మండలం గజగట్లపల్లి, చిలప్‌చెడ్‌ మండలం అజ్జమర్రి, చండూర్‌, గంగారం, హవేలి ఘనపూర్‌ మండలం బూర్గుపల్లి, హవేలి ఘనపూర్‌, నాగపూర్‌, శివ్వంపేట మండలం గోమారం, రేగోడ్‌ గ్రామాల్లో స్థానిక నాయకులు, కాళ్లకల్‌లో ఎంపీటీసీ సభ్యురాలు లావణ్య, ఆత్మ కమిటీ డైరెక్టర్‌ రాహుల్‌రెడ్డి పాల్గొన్నారు. నర్సాపూర్‌లో కేరళ రాష్ట్రం నుంచి వచ్చిన కళాకారుల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తూప్రాన్‌ పట్టణంలో రాక్‌స్టార్‌ యువజన విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుడి లడ్డూ వేలం వేయగా పట్టణానికి చెందిన శ్రీకాంత్‌, బాలేశ్‌ కలిసి రూ.1.23 లక్షలకు దక్కించుకున్నారు.

- న్యూస్‌టుడే, మెదక్‌ అర్బన్‌, మెదక్‌ టౌన్‌, మెదక్‌ రూరల్‌, చిన్నశంకరంపేట, మనోహరాబాద్‌, చిలప్‌చెడ్‌, హవేలి ఘనపూర్‌, నర్సపూర్‌ టౌన్‌, రేగోడ్‌, శివ్వంపేట, తూప్రాన్‌


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని