చివరి మజిలీకి చిక్కులెన్నో.!
eenadu telugu news
Published : 20/10/2021 04:06 IST

చివరి మజిలీకి చిక్కులెన్నో.!

వైకుంఠధామం అభివృద్ధి పనులు శిలాఫలకానికే పరిమితం

 నర్సాపూర్‌ పురపాలికలో ఇదీ పరిస్థితి

న్యూస్‌టుడే, నర్సాపూర్‌

నర్సాపూర్‌లో దహన వాటిక దుస్థితి..

ట్టణం మొత్తానికి ప్రధానమైన శ్మశానవాటిక. అభివృద్ధి పనులకు రూ.కోటి కేటాయించి రాష్ట్ర మంత్రి హరీశ్‌రావు చేతుల మీదుగా నాలుగు నెలల క్రితం శంకుస్థాపన చేశారు. అయినా పనులు మాత్రం శిలాఫలకం దాటడం లేదు. దీంతో చివరి మజిలీకి ఇక్కట్లు పడాల్సి వస్తోంది. నర్సాపూర్‌ పురపాలికలో హిందూ శ్మశానవాటిక హైదరాబాద్‌ మార్గంలో ఉంది. అందులో సమస్యలు రాజ్యమేలుతున్నాయి. రాయరావుచెరువు సమీపంలో ఉండటంతో అంత్యక్రియలకు మృతుల కుటుంబ సభ్యులు, బంధువులు అనేక అవస్థలు పడుతున్నారు. ఒకే ఒక దహనవాటిక (ప్లాట్‌ఫాం) ఉండటంతో ఒకరి అంత్యక్రియలు జరుగుతుండగా, మరొకరివి చేయడానికి సాధ్యం పడటం లేదు. మరొకటి నిర్మించాలన్న స్థానికుల విజ్ఞప్తులు బుట్ట దాఖలవుతున్నాయి. శ్మశానవాటిక పరిసరాలు పిచ్చి మొక్కలు, ముళ్లపొదలు వ్యర్థాలతో కంపుకొడుతున్నా పురపాలిక అధికారులు పట్టించుకోవడం లేదు. అంత్యక్రియల అనంతరం భాధిత కుటుంబాల వారు స్నానాలు చేసేందుకు ఎలాంటి ఏర్పాట్లు లేకపోవడంతో సమీప రాయరావు చెరువులోకి దిగ తప్పని పరిస్థితి. అంత్యక్రియలు పూర్తయ్యే వరకు ఉందామంటే ఉండేందుకు కనీసం షెడ్లు కూడా లేవు. దీంతో ఎండకు ఎండుతూ, వానకు తడవాల్సిన దుస్థితి. నీటి కోసం ట్యాంకరుపై ఆధారపడక తప్పదు. ఇదివరకు మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి రూ.10 లక్షలు కేటాయించగా ప్రహరీ నిర్మించారు. ప్రస్తుతం రూ.30 లక్షలతో శ్మశాన వాటికకు వెళ్లేందుకు సీసీ రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నాయి. గతంలో శ్మశానవాటిక అభివృద్ధికి ఉపాధి హామీ పథకం కింద రూ.10 లక్షలు మంజూరైనట్లు ప్రకటించారు. 2020, ఆగస్టు 2 నాటికి నర్సాపూర్‌ మేజర్‌ గ్రామ పంచాయతీ పురపాలికగా ఆవిర్భవించడంతో ఆ నిధులు వెనక్కివెళ్లాయి.

పురపాలిక నిధులు కేటాయించినా...

శ్మశానవాటికలో నెలకొన్న సమస్యలను గుర్తించిన పురపాలక సంఘ పాలకవర్గం... అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. ఈమేరకు రూ.కోటి కేటాయించింది. దీంతో ఈ ఏడాది జూన్‌ 24న రాష్ట్ర మంత్రి హరీశ్‌రావు చేతుల మీదుగా పనులకు శంకుస్థాపన చేశారు. నాలుగు నెలలు కావస్తున్నా పనులు కార్యరూపం దాల్చలేదు.

త్వరలో ప్రారంభిస్తాం..: అశ్రిత్‌కుమార్‌, కమిషనర్‌

శ్మశానవాటిక అభివృద్ధి పనుల టెండరు దక్కించుకున్న గుత్తేదారుకు ఒప్పందం చేయాల్సి ఉంది. త్వరలో ఈప్రక్రియను పూర్తి చేసి పనులు ప్రారంభిస్తాం. పురపాలికలో ఏఈ లేకపోవడంతో పనులు ఆలస్యమయ్యాయి. ఇటీవల ఏఈ పోస్టును భర్తీ చేయడంతో పనులు త్వరితగతిన పూర్తికానున్నాయి.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని