సిద్దిపేట.. వలస కూలీలకు సద్దిమూట!
eenadu telugu news
Updated : 20/10/2021 06:00 IST

సిద్దిపేట.. వలస కూలీలకు సద్దిమూట!

జోరుగా ప్రభుత్వ, ప్రైవేటు నిర్మాణాలు

పొరుగు రాష్ట్రాల వారికి చేతినిండా పని

న్యూస్‌టుడే, గజ్వేల్‌

గజ్వేల్‌లో భవన నిర్మాణ పనిలో పొరుగు రాష్ట్రాల కార్మికులు

దివరకు చేతినిండా పని లభించక కార్మికులు ముంబాయి.. భివాండీ తదితర ప్రాంతాలకు వలస వెళ్లిన ప్రాంతం సిద్దిపేట. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత పరిస్థితి మారి తాజాగా స్థానికులతో పాటు వలస కార్మికులకు సైతం ఉపాధి నిచ్చే కల్పతరువుగా మారింది. ప్రభుత్వ చొరవతో జిల్లా నిర్మాణ రంగంలో గణనీయ ప్రగతి సాధిస్తోంది. ప్రభుత్వ కార్యాలయాలు, రెండు పడక గదులు, రహదారుల నిర్మాణ పనులు జోరుగా జరుగుతుండటంతో కార్మికులకు రెండు చేతులా పని దొరుకుతోంది. దీంతో ఇక్కడికి ఇతర జిల్లాల నుంచి వేల సంఖ్యలో వలస వస్తున్నారు. జిల్లాలో పనులు చేస్తున్న దాదాపు 25 వేల మంది కార్మికుల్లో 60 శాతం మంది పొరుగు రాష్ట్రాల వారే కావటం విశేషం. ప్రస్తుతం జిల్లాలో పలు చోట్ల ప్రభుత్వ నిర్మాణాలు, గజ్వేల్‌లో భూగర్భ మురుగు పారుదల వ్యవస్థ పనులు శరవేగంగా సాగుతున్నాయి. సిద్దిపేట సమీపంలో కలెక్టరేట్‌, ఎస్పీ కార్యాలయాలు, రెండు పడక గదుల ఇళ్లు, ఆస్పత్రి భవనం, ములుగులో విశ్వవిద్యాలయాలు, గజ్వేల్‌లో ఆస్పత్రి భవనాలు, విద్యాసౌధాలు, నిర్వాసితులకు నిర్మించిన రెండు పడక గదుల ఇళ్లు కార్మికుల శ్రమ, నైపుణ్యానికి గుర్తుగా నిలిచాయి.

వేకువజామునే మొదలు..

పొరుగు రాష్ట్రాల కార్మికుల దినచర్య భిన్నంగా ఉంటుంది. పొద్దు పొడవక ముందే పనిలో చేరిపోతారు. మధ్యాహ్నం 12 గంటలకు భోజన విరామం. సాయంత్రం ఆరు గంటల తర్వాతే నిష్క్రమిస్తారు. ఉదయం పనిలో చేరే వేళలోనే ఆ రోజు నిర్దేశించుకున్న పని ఆలస్యమైనా సరే పూర్తి చేసిన తరువాతే అక్కడి నుంచి కదులుతారు.పలు నిర్మాణాలకు వినియోగిస్తున్న సిమెంటు ఇటుకలను జార్ఖండ్‌ నుంచి వచ్చిన కార్మికులు బాగా తయారు చేస్తారన్న పేరుంది. సిమెంటు, రాతిపొడి, చిప్స్‌, కాంక్రీట్‌ కలపడం, క్యూరింగ్‌, తయారీ అనంతరం పని ప్రదేశానికి తరలించడంలో వీరు సిద్ధహస్తులు.

కార్మికులు ఉంటున్న తాత్కాలిక ఇళ్లు

● గజ్వేల్‌లో విద్యాసౌధాలు, రెండు పడకగదుల ఇళ్ల నిర్మాణ సమయంలో సెంట్రింగ్‌ పనులను మొత్తం ఒడిశా, బిహార్‌ కార్మికులే చేశారు. ఆయా పనుల్లో ఎక్కువ మంది యువకులే ఉండటం విశేషం. పునాది తీయటం, పుటింగ్‌ వేయటం తదితర పనులు పాలమూరు కార్మికులు చేస్తున్నారు. గజ్వేల్‌లో పాతిక వరకు కుటుంబాలు ఇదే పనిలో నిమగ్నమై ఉన్నాయి. గోడలు కట్టడం, వాటికి ప్లాస్టింగ్‌ చేయటం, నునుపైన డిజైన్లు తదితర పనులు ఆంధ్రప్రదేశ్‌లోని ఒంగోలు, శ్రీకాకుళం, గుంటూరు జిల్లాల కార్మికులు చేస్తున్నారు. జిల్లాలో ఈ మూడు జిల్లాలకు చెందిన వారు 1500 మంది వరకు ఉన్నట్లు ఓ భవన నిర్మాణ గుత్తేదారు తెలిపారు.

● జిల్లాలో ఒక్కో మేస్త్రీకి రోజుకు రూ.వెయ్యి నుంచి రూ.1200 వరకు, కార్మికులకు రూ.600 నుంచి రూ.800 ఇస్తున్నారు. కొందరు భవన నిర్మాణదారులు కార్మికులకు ముందస్తుగా జోడి (దంపతులు)కి నెలకు రూ.25 వేల వరకు చెల్లిస్తుండటం గమనార్హం.

ప్రభుత్వం ఆదేశిస్తే పాఠశాలలు ప్రారంభిస్తాం

- డాక్టర్‌ రవికాంత్‌రావు, డీఈవో

కరోనాకు ముందు జిల్లాలో పలు చోట్ల డిమాండుకు తగ్గట్టు వర్క్‌సైట్‌ స్కూల్స్‌ నడిపించాం. 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి ఆదేశాలు రాలేదు. వస్తే ఎక్కడ ఎక్కువగా వలస కూలీల పిల్లలున్నారో గుర్తించి అక్కడ పాఠశాలలు ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తాం.

మౌలిక సదుపాయాలు అవశ్యం

పనులు చేపట్టేందుకు కార్మికులను తీసుకొస్తున్న మునీంలు (బిల్డర్లు) వారు నివాసం ఉండే చోట మౌలిక వసతులు కల్పించడంలో శ్రద్ధ చూపడం లేదన్న విమర్శలున్నాయి.. 2019-20 ఆర్థిక సంవత్సరంలో జిల్లాలోని కోహెడ, హుస్నాబాద్‌, సిద్దిపేటలో 9 చోట్ల వర్క్‌ సైట్‌ పాఠశాలలు నిర్వహించగా వాటిల్లో దాదాపు 200 మంది విద్యార్థులు చదువుకున్నారు. 2021-22 ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో ఎక్కడా పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు ప్రారంభించలేదు. దీంతో చిన్నపిల్లలను పని వద్దకు తీసుకు వెళుతూ ఇబ్బందులు పడుతున్నామని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పని వద్ద పిల్లలను సముదాయించుకోలేక ఒక్కోసారి పనులు మానేసి ఇంటి వద్ద ఉండాల్సి వస్తోందని, స్థానిక అంగన్వాడీ కేంద్రాల్లో అవకాశం ఇవ్వాలని పలువురు కోరుతున్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని