త్రినేత్రం..నేరాల అదుపునకు అస్త్రం
eenadu telugu news
Published : 20/10/2021 05:04 IST

త్రినేత్రం..నేరాల అదుపునకు అస్త్రం

జిల్లాల్లో కీలకంగా సీసీ కెమెరాలు

న్యూస్‌టుడే, సిద్దిపేట టౌన్‌, సంగారెడ్డి అర్బన్‌, మెదక్‌, వికారాబాద్‌, రామాయంపేట

నిఘా నేత్రం.. నేరాల అదుపునకు కీలకంగా మారింది. నేరగాళ్ల పాలిట పాశుపతాస్త్రమవుతోంది. అంతుచిక్కని వివిధ కేసుల ఛేదనలో సీసీ కెమెరాల పాత్ర అసామాన్యం. చిక్కుముడులు విప్ఫి. గుట్టు రట్టు చేయడంలో తిరుగులేని అస్త్రం. వివిధ సందర్భాల్లో లభ్యమయ్యే ఫుటేజీలు.. కేసు కొలిక్కి తేవడం సహా సాంకేతికత ఆధారంగా వినియోగం అవుతున్న తరుణంలో పోలీసు శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. విస్తృతంగా అందుబాటులోకి తెచ్చింది. ఉమ్మడి మెదక్‌, వికారాబాద్‌ జిల్లాల్లో ప్రతి పోలీసు ఠాణా పరిధిలో వాటిని బిగించడం విశేషం. సంబంధిత అంశంపై ‘న్యూస్‌టుడే’ ప్రత్యేక కథనం.

సీసీ ఫుటేజీల ఆధారంగా కొట్లాటలు, చోరీలు, రహదారి ప్రమాదాల వివరాలు ఇట్టే తెలిసిపోతున్నాయి. పల్లెల నుంచి వలస వచ్చే వారి సంఖ్య పెరుగుతుండటంతో పట్టణాలు పట్టణాలు విస్తరిస్తున్నాయి. శివారు ప్రాంతాల్లో కొత్త కాలనీలు వెలుస్తున్నాయి. మరో వైపు విలువైన వస్తువులు విక్రయించే దుకాణాల్లో రాత్రి వేళ నిఘా కొరవడి చోరులు అందినకాడికి దోచుకుంటున్నారు. ఏ మూల ఏం జరిగినా అంతా నిక్షిప్తం చేస్తున్నాయి.

మెదక్‌లోని కూడలిలో..

33 స్టేషన్ల పరిధిలో..

జిల్లా కేంద్రం సంగారెడ్డితో పాటు జహీరాబాద్‌, పటాన్‌చెరు, నారాయణఖేడ్‌ సబ్‌ డివిజన్‌ కార్యాలయాలు ఉండగా ఎనిమిది వలయాధికారి కార్యాలయాలు, మహిళా, సీసీఎస్‌, ట్రాఫిక్‌, శాంతి భద్రతలకు సంబంధించి 33 పోలీస్‌ స్టేషన్లు ఉన్నాయి. సంగారెడ్డి పరిధిలో 1225 కెమెరాలు బిగించారు. జహీరాబాద్‌లో 581, పటాన్‌చెరులో 2463, నారాయణఖేడ్‌ పరిధిలో 304 కెమెరాలు ఏర్పాటుచేశారు. ఇప్పుడు స్టేషన్లలోనే అందుబాటులోకి తెచ్చారు. ఎస్పీ, డీఎస్పీలు, సీఐల ఆధ్వర్యంలో జరిగే సమావేశాల్లో వాటి ఆవశ్యకతను వివరిస్తూ వాటిని ఏర్పాటుచేసుకునేలా ప్రజల్లో చైతన్యం తీసుకొస్తున్నారు.

మెదక్‌ జిల్లాలో..

జిల్లాలో మూడో కన్ను ఏర్పాటు సత్ఫలితాలన్నిస్తోంది. మెదక్‌లో పోలీసుశాఖ ఆధ్వర్యంలో 18 కెమెరాలు ఆయా కూడళ్లల్లో ఏర్పాటు చేయగా, మరో 1,200 కెమెరాలు ఆయా కమ్యూనిటీ కేంద్రాల వద్ద బిగించారు. మరో 100 వరకు బిగించేందుకు మున్సిపల్‌ పాలకులు ముందుకొచ్చారని సీఐ వెంకటయ్య తెలిపారు. త్వరలో ఏఆర్‌ హెడ్‌క్వార్టర్స్‌లో కమాండ్‌ కంట్రోల్‌రూం ఏర్పాటు చేయనున్నారు. రామాయంపేట పట్టణంలో ఇప్పటివరకు 102 వరకు పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో బిగించారు.


ఛేదించిన కేసులు..

* ఈ నెల 1వ తేదీన సిద్దిపేట, దుద్దెడలో ఇదరు మహిళలు హత్యకు గురయ్యారు. కలకలం రేపిన ఘటనలపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టి ఒకే వ్యక్తి జంట హత్యలు చేసినట్లుగా ప్రాథమిక అంచనాకు వచ్చారు. అందుకు సాంకేతిక ఆధారాలను వెతకడం ఆరంభించారు. ఘటనలు జరిగిన రెండు ప్రాంతాల్లో సీసీ కెమెరాలను పరిశీలించారు. అందులో నిందితుడిని గుర్తించారు. 11 రోజుల్లో ఈ హత్య కేసు మిస్టరీ వీడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. పెరోల్‌పై వచ్చిన ఖైదీనే ఈ దారుణాలకు పాల్పడ్డట్లు తేల్చారు. సదరు నిందితుడిని రిమాండ్‌కు తరలించారు.

* జులై 7న... సంగారెడ్డిలోని రాజంపేటకు చెందిన ఓ వృద్ధురాలు తన కూతురి భర్త చనిపోవడంతో రెండో పెళ్లి చేయాలని నిర్ణయించింది. ఆమెకు ఏడాదిన్నర కొడుకు ఉండగా, అతడిని చెరువులో తోసేసి చంపేసింది. అదృశ్యమయ్యాడని నమ్మబలికింది. దీనిపై ఫిర్యాదు రాగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరాలను పరిశీలించగా అసలు విషయం తెలిసింది. ఆటోలో రాజంపేట నుంచి వచ్చి మనవడిని చెరువు వద్దకు తీసుకెళ్లడం సీసీ కెమెరాలో నిక్షిప్తమైంది. దీంతో ఆమెను అదుపులోకి తీసుకొని విచారించడంతో సంగారెడ్డిలోని ఓ చెరువులో తోసేసి చంపేసినట్లు ఒప్పుకొంది. సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా కేసును సులభంగా ఛేదించారు.

* చేగుంట ఠాణా పరిధిలోని మాసాయిపేట జాతీయరహదారిపై గతేడాది అక్టోబరులో రూ.2.35 కోట్ల విలువైన 2,200 చరవాణులను కంటెయినర్‌ నుంచి ఎత్తుకెళ్లారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా పది రోజుల్లోనే కేసును ఛేదించారు. మధ్యప్రదేశ్‌లోని ధానఫేూట్‌ గ్రామంలో ఓ ఇంట్లో భద్రపర్చిన చరవాణులను స్వాధీనం చేసుకున్నారు.

* ఫిబ్రవరి 25న ధారూర్‌ మండలం అవుసుపల్లికి చెందిన అమృతమ్మ హత్యకు గురైంది. కిష్టయ్య అనే వ్యక్తి పరిచయం చేసుకొని కల్లు తాగించాడు. జనసంచారం లేని ప్రాంతానికి తీసుకెళ్లి దాడి చేసి చంపేశాడు. ఆమె శరీరంపై ఉన్న ఆరు గ్రాముల బంగారం, మెట్టెలు అపహరించాడు. ఈ కేసులో పోలీసులు సీసీ కెమెరా ఆధారంగా నిందితుడిని అరెస్టు చేశారు.


ఇట్టే తెలిసేలా..

ఫుటేజీని పరిశీలిస్తున్న సీఐ రాజశేఖర్‌

వికారాబాద్‌ జిల్లాలోనూ ప్రధాన కూడళ్లలో సీసీ కెమెరాలను అమర్చారు. జిల్లా కేంద్రంలో అన్ని ప్రాంతాల్లోనూ అందుబాటులోకి తీసుకొచ్చారు. ఎక్కడైనా పాడైతే వెంటనే మరమ్మతులు చేయిస్తున్నారు. నేను సైతం కార్యక్రమం ద్వారా వ్యాపారులు, భవన సముదాయాల్లో సీసీ కెమెరాల బిగింపుపై చైతన్యం తీసుకొస్తున్నారు. జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో ఇప్పటివరకు 1500కు పైగా నిఘా నేత్రాలు బిగించారు. సురక్షిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు 6 వేల వరకు ఏర్పాటుచేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. పల్లెల్లో సైతం సర్పంచులు ముందుకొస్తుండటంతో సత్ఫలితం చేకూరుతోంది.


నిఘా నీడన సిద్దిపేట జిల్లా..

​​​​​​​

సిద్దిపేటలోని కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రం

సిద్దిపేట జిల్లాలో పోలీసు శాఖ లక్ష్యం మేర సీసీ కెమెరాలు ఏర్పాటయ్యాయి. జిల్లాలోని 26 పోలీసు ఠాణాల పరిధిలో శతశాతం సీసీ కెమెరాలతో కమిషనరేట్‌ ప్రత్యేకతను చాటింది. జిల్లాలో ఐదు పురపాలికలతో సహా 489 గ్రామాల్లో 5,416 మేర బిగించారు. ఆయా వాటికి జియోట్యాగింగ్‌ ప్రక్రియ పూర్తయింది. వీటి సాయంతో ఐదేళ్ల వ్యవధిలో 500కి పైగా కేసులు ఛేదించారు. రాజీవ్‌ రహదారిపై 156 సీసీ కెమెరాలు ఏర్పాటవగా కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రం నుంచి పర్యవేక్షిస్తున్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని