9 నెలలు.. 92 వేలనిర్ధారణ పరీక్షలు
eenadu telugu news
Published : 20/10/2021 05:04 IST

9 నెలలు.. 92 వేలనిర్ధారణ పరీక్షలు

కీలకంగా తెలంగాణ డయాగ్నొస్టిక్‌ హబ్‌ సేవలు
న్యూస్‌టుడే, సిద్దిపేట టౌన్‌

జిల్లా కేంద్రంలోని డయాగ్నొస్టిక్‌ హబ్‌

వ్యాధి నిర్ధారణ.. విశ్లేషణకు.. వివిధ రకాల పరీక్షలు అనివార్యం. అప్పుడే సరైన ఔషధాలు, చికిత్స సాధ్యమవుతుంది. రోగి స్థితిగతుల ఆధారంగా తగిన చర్యలు తీసుకోవచ్ఛు ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా ఎక్కడికక్కడ నమూనాలు సేకరిస్తుండగా.. వాటికి అనుసంధానంగా తెలంగాణ డయాగ్నొస్టిక్‌ హబ్‌ కీలక సేవలు పరీక్షిస్తోంది. ఫలితాలు వెల్లడిస్తూ.. తదనంతర చికిత్స అందించేందుకు మార్గం సుగమం చేస్తోంది. సిద్దిపేటలో ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆరంభమైన సేవలు.. విస్తృతంగా కొనసాగుతున్నాయి. ఈ కేంద్రం ద్వారా 59 రకాల పరీక్షలు నిర్వహిస్తుండటం విశేషం. కరోనా పరిస్థితుల్లోనూ ఇన్‌ఫెక్షన్ల స్థాయి తెలుసుకునేందుకు కేంద్రం సేవలు కీలకంగా మారుతున్నాయి. తొమ్మిది నెలల్లో 92 వేలకు పైగా నిర్ధారణ పరీక్షలు చేశారు.

24 గంటల వ్యవధిలోనే..

జిల్లా కేంద్రంలోని డయాగ్నొస్టిక్‌ హబ్‌.. పేదలకు బాసటగా నిలుస్తోంది. రాష్ట్ర మంత్రి హరీశ్‌రావు ప్రత్యేక చొరవతో ఫిబ్రవరిలో ఈ కేంద్రం అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. తద్వారా ఎంతోమందికి పరీక్షల ఖర్చుల భారం తగ్గింది. ఇక్కడ నిత్యం సగటున 500 నుంచి 600 వరకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఆధునిక సాంకేతికతతో కూడిన పరికరాలు, యంత్రాలు త్వరితగతిన ఫలితాల వెల్లడికి దోహదం చేస్తున్నాయి. ముఖ్యంగా రక్త పరీక్షలు ఎక్కువగా జరుగుతున్నాయి. వాటిలో వ్యాధుల పరంగా అత్యధిక సంఖ్యలో థైరాయిడ్‌, షుగర్‌, బీపీ, గండెకు సంబంధించిన నిర్ధారణ పరీక్షల ఫలితాలు ఈ కేంద్రం ద్వారా వెల్లడవుతున్నాయి. జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రులు, వివిధ రకాల ఆరోగ్య కేంద్రాల నుంచి పరీక్షలు అవసరమైన వారి నుంచి రక్త, మూత్ర, ఇతర నమూనాలు సేకరిస్తున్నారు. ఈ మేరకు హబ్‌ ఆధ్వర్యంలో ఏర్పాటైన ఐదు వాహనాలు.. నిత్యం ఆసుపత్రులకు చేరుకొని నమూనాలను సేకరించి హబ్‌కు చేరవేస్తున్నాయి. సంబంధిత ఫలితాలు 24 గంటల వ్యవధిలో రోగితో పాటు ఆసుపత్రులకు ఆన్‌లైన్‌ విధానంలో అందజేస్తున్నారు. ఆ వెంటనే అనుగుణంగా చికిత్స ఆరంభిస్తున్నారు.

* కరోనా నిర్ధారణ అయిన తరువాత పలు రకాల ఇన్‌ఫెక్షన్ల బారినపడే వారి సంఖ్య పెరుగుతోంది. వైరస్‌ తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ క్రమంలో మహమ్మారిని సమర్ధవంతంగా ఎదుర్కోవాలంటే అనుగుణంగా చికిత్స అవసరం. ప్రైవేటు కేంద్రాల్లో రూ.వేలల్లో చెల్లించి పరీక్షలు చెల్లించుకోవాల్సి వస్తోంది. ఇలాంటి తరుణంలో ఈ కేంద్రం అనుసంధానంగా ఉచితంగా ఫలితాలు వెల్లడవుతున్నాయి. శరీరంలో ఇన్‌ఫెక్షన్లు ఏ స్థాయిలో ఉందనే విషయాన్ని ఇక్కడి నుంచే నిర్ధారిస్తున్నారు. మరోవైపు మారుతున్న జీవనశైలి.. అనేక రోగాలకు మూలమవుతోంది. దీనికి అడ్డుకట్ట వేయాలంటే ప్రాథమికస్థాయిలో నిర్ధారణ అనంతరం అనుగుణంగా చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. జిల్లాలో బీపీ, చక్కెర, హృద్రోగ బాధితులు పెరుగుతున్నారు. అనుమానితుల నుంచి నమూనాలు సేకరిస్తున్న తీరు అందుకు ప్రస్పుటమవుతోంది. ఆయా విభాగాల్లో వివిధ ప్రభుత్వ ఆసుపత్రుల నుంచి సంబంధిత నమూనాలను హబ్‌కు పంపిస్తుండటం గమనార్హం.

అన్నీ ఉచితమే.. - డా. కాశీనాథ్‌, జిల్లా నోడల్‌ అధికారి

ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రుల సేవలను సద్వినియోగం చేసుకోవాలి. తద్వారా వివిధ రకాల పరీక్షలు, వైద్యం ఉచితంగా అందుతుంది. ఆరోగ్యం విషయంలో ఎలాంటి అనుమానాలు ఉన్నా సమీప ప్రభుత్వ ఆసుపత్రిని ఆశ్రయించాలి. వైద్యుల సూచన మేరకు నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలి.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని