వలసల సమయం... నియంత్రిస్తే నయం!
eenadu telugu news
Published : 20/10/2021 05:04 IST

వలసల సమయం... నియంత్రిస్తే నయం!

చెరకు సీజన్‌ వస్తే ఖేడ్‌లో తండాలు ఖాళీ

చదువులకు దూరమవుతున్న విద్యార్థులు

న్యూస్‌టుడే, నారాయణఖేడ్‌

ఎద్దుల బండ్లపై వెళుతున్న గిరిజనులు

ఖేడ్‌ నియోజకవర్గంలో ఎలాంటి పరిశ్రమలు లేవు. ఉపాధి అవకాశాలు తక్కువ. పేదలు ఎక్కువ. జిల్లాలోకెల్లా గిరిజన జనాభా ఇక్కడే అధికం. 167 రెవెన్యూ గ్రామాలు ఉంటే తండాలు 188 ఉన్నాయి. గిరిజన జనాభా 50వేల వరకు ఉంటుంది. ఉపాధి హామీ పనులు తండాల్లో చేపట్టక పోవడంతో ఏటా చెరకు నరికే సీజన్‌ వచ్చిందంటే ఖేడ్‌ నియోజకవర్గంలోని తండాలు ఖాళీ అవుతాయి. వృద్ధులు, చదువుకుంటున్న పిల్లల్లో కొంతమంది మాత్రమే కనిపిస్తుంటారు. కొందరు తాము వలస వెళితే ఇంటివద్ద పిల్లల ఆలనా పాలనా చూసేవారు లేకపోవడంతో, మరికొందరు పెద్ద పిల్లలు వెంట ఉంటే తాము పనులు చేస్తున్నప్పుడు చిన్నారులను ఆడిస్తారనే భావంతో బడులు మాన్పించి మరీ వెంట తీసుకెళుతుంటారు. ఏటా నవంబరులో చక్కెర కర్మాగారాలు తెరచుకుంటాయి. వలసలూ ప్రారంభమవుతాయి. అక్టోబరు నుంచే కర్మాగారాల వద్ద, చెరకు తోటల యజమానుల వద్ద అడ్వాన్స్‌ కింద డబ్బులు తెచ్చుకొంటుంటారు. ఈ ప్రక్రియ ఇప్పటికే మొదలైంది. ఏడాదిన్నర కాలంగా కరోనా వల్ల ఉపాధి లేకపోవడం.. ఇటీవల భారీవర్షాల కారణంగా పంటలనూ నష్టపోయినందున స్థానికంగా పనులు దొరికే అవకాశం అంతంతే. దీంతో ఈసారి వలస వెళ్లేవారి సంఖ్య భారీగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో అధికారులు ఇప్పటి నుంచే నివారణకు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది.

వ్యవసాయమే ఆధారం

గిరిజనుల్లో అత్యధికశాతం మంది వలసలతోపాటు వ్యవసాయంపైనే ఆధారపడి జీవనాన్ని కొనసాగిస్తుంటారు. ప్రస్తుత వర్షాకాలంలో భారీ వర్షాల కారణంగా పంటటు దెబ్బతినడంతో దిగుబడులు గణనీయంగా తగ్గాయి. ఎక్కువ మంది పెట్టుబడులు నష్టపోయారు. గత వేర్వేరు ప్రాంతాలకు ఉద్యోగ, ఉపాధి కోసం వెళ్లిన వారు కరోనా కారణంగా సొంత తండాలకు వచ్చారు. బతుకు బండి ముందుకు సాగాలంటే చక్కెర కర్మాగారాలకు వలస వెళ్లక తప్పని పరిస్థితి నెలకొందనే వ్యాఖ్యలు వారి నుంచి వినిపిస్తున్నాయి.

యంత్రాంగం దృష్టిపెడితే మంచిది

వలసల నివారణకు తండాల్లోనే ఉపాధి హామీతోపాటు ఇతరత్రా పనుల కల్పనకు జిల్లా యంత్రాంగం ఉపక్రమించాల్సిన అవసరం ఉంది. ఏయే తండాల్లోంచి ఎంతమంది వెళ్తారు. వారిని ఆపేందుకు ఏయే పనులు చేపట్టాలి, వలస వెళ్లకతప్పని పరిస్థితులు ఉన్న కుటుంబాలు ఎన్ని తదితర వివరాలన్నీ సేకరించాలి. తదనుగుణంగా కార్యాచరణ ప్రణాళిక రూపొందించి అమలు చేయడంపై జిల్లా పాలనా యంత్రాంగం దృష్టిపెట్టాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

2019లో ఇలా...

ఖేడ్‌ నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల్లో దాదాపు 10,000 మంది గిరిజన విద్యార్థులు ఉన్నారు. వీరిలో 2019లో సుమారు 3,000 మంది వరకు తల్లిదండ్రుల వెంట వలస వెళ్లారు. ప్రైవేటు పాఠశాలల్లో 1,500 మంది వరకు ఉండగా 250 మంది వరకు వెళ్లారు. ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్‌, డిగ్రీ కళాశాలల్లో 300 మంది చదువుతుండగా 180 మంది వలస పోయారు. గత అయిదేళ్లుగా ఏటా ఇలాంటి పరిస్థితులే నెలకొంటున్నాయి. చెరకు కోత సీజన్‌ ప్రారంభం నుంచి ముగిసేవరకు అంటే నాలుగు నెలల వరకు వారు పాఠశాలలు, కళాశాలలకు వెళ్లకపోతుండటంతో చదువులో వెనుకబడుతున్నారు. మధ్యలో చదువు నిలిపివేస్తున్న కారణంగా విద్యలో రాణించలేక పదో తరగతి, ఇంటర్‌తోనే ఆపేస్తున్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని