అసైన్డ్‌ భూముల్లో అక్రమార్కుల దందా!
eenadu telugu news
Updated : 20/10/2021 06:05 IST

అసైన్డ్‌ భూముల్లో అక్రమార్కుల దందా!

ప్లాట్లు వేసి విక్రయిస్తున్న వైనం

న్యూస్‌టుడే, సంగారెడ్డి అర్బన్‌, సంగారెడ్డి గ్రామీణం

హనుమాన్‌నగర్‌లో ఇళ్ల నిర్మాణాలకు పునాది పనులు షురూ

విస్తరణ పనులు జరుగుతున్న సంగారెడ్డి-నాందేడ్‌-అకోలా జాతీయ రహదారికి, సంగారెడ్డి-నర్సాపూర్‌ రహదారికి అతి సమీపంలో ఉన్న అసైన్డ్‌ భూములు అవి. వాటిపై కొందరు నేతల కన్ను పడింది. త్వరలో ఇటుగా ప్రాంతీయ రింగ్‌ రోడ్డు వస్తుందని జోరుగా ప్రచారం సాగుతుండటంతో ఆ భూములను కైవసం చేసుకొని సొమ్ము చేసుకోవాలని భావించారు. సంబంధిత రైతుల నుంచి నయానో భయానో స్వాధీనం చేసుకోవాలని పథకం పన్నారు. తక్కువ ధరకు కొని ప్లాట్లుగా మార్చారు. అమ్మకాలనూ షురూ చేశారు. అసైన్డ్‌ భూమిని అమ్మడం.. కొనడం చట్టరీత్యా చెల్లదని తెలిసినా ఇక్కడ ఆ పట్టింపులు లేవు. ఈ వ్యవహారమంతా బహిరంగంగానే సాగుతున్నా అడ్డుకోవాల్సిన రెవెన్యూ అధికారులు చోద్యం చూడటం మినహా పకడ్బందీ చర్యలు తీసుకోవడం లేదు. సంగారెడ్డి మండలం హనుమాన్‌నగర్‌లో అసైన్డ్‌ ప్లాట్ల దందాపై ‘న్యూస్‌టుడే’ ప్రత్యేక కథనం.

రెండు ఎకరాల.. 20 గుంటల్లో...

జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న హనుమాన్‌నగర్‌లో ఈ దందా సాగుతోంది. ఇక్కడి 404/51/5 సర్వే నంబరులో మూడు ఎకరాల 14 ఎకరాల గుంటల భూమి ఉంది. అదే మండలంలోని గౌడిచెర్లకు చెందిన ముగ్గురు రైతులకు 1977లో అప్పటి ప్రభుత్వం రెండు ఎకరాల 55 గుంటల భూమిని పంపిణీ చేసింది. సాగుకు మాత్రమే దీనిని వినియోగించుకోవాల్సి ఉంది. ఈ ముగ్గురిలో ఇద్దరికి చెందిన రెండెకరాల 20 గుంటలను కొందరు తక్కువ ధరకు కొనుగోలు చేసినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ వ్యవహారంలో రాజకీయ పలుకుబడీ కీలకంగా పని చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దానిని 125 గజాల ప్లాట్లుగా మార్చి ఒక్కో ప్లాటును రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు నోటరీ ద్వారా విక్రయిస్తున్నారు. ఇప్పటికే సగానికి పైగా ప్లాట్లు అమ్ముడైనట్లు సమాచారం. కొన్నవారిలో నలుగురైదుగురు తాజాగా ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించడం గమనార్హం. కొనుగొలు చేసిన వారిలో ఎక్కువమంది సంగారెడ్డి, సదాశివపేట, హైదరాబాద్‌, జహీరాబాద్‌ ప్రాంతాల వారున్నట్లు తెలుస్తోంది. ఈ భూమి మొత్తం విలువ దాదాపు రూ.కోటి వరకు ఉంటుందని అంచనా.

చదును చేసిన స్థలం

కలెక్టరేట్‌లో ఫిర్యాదు..

హనుమాన్‌నగర్‌లో అసైన్డ్‌ భూమిని ప్లాట్లుగా మార్చి అమ్మకాలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఆ గ్రామానికి చెందిన 6, 8 వార్డుల సభ్యులు ప్రదీప్‌కుమార్‌, సత్యనారాయణ కలెక్టరేట్‌లో సోమవారం ఫిర్యాదు చేశారు. అనంతరం సంగారెడ్డి మండలం తహసీల్దార్‌ స్వామికి ఇదే విషయమై వినతి పత్రం అందించారు.

అమ్మడం.. కొనడం చెల్లదు: జె.స్వామి, తహసీల్దార్‌, సంగారెడ్డి

హనుమాన్‌నగర్‌ 404/51/5 సర్వే నంబరులో ముగ్గురికి గతంలో ప్రభుత్వం భూమిని పంపిణీ చేసిన మాట వాస్తవమే. వారిలో ఇద్దరు ఇతరులకు అమ్మేసినట్లుగా తెలిసింది. కొన్న వ్యక్తులు ప్లాట్లుగా మార్చి అమ్ముతునట్లు మా దృష్టికి వచ్చింది. తమ సిబ్బందిని క్షేత్రస్థాయికి వెళ్లి విచారించి చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చాం. అసైన్డ్‌ భూమిని అమ్మడం.. కొనడం నేరం. ప్లాట్లుగా మార్చినా తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని