పంటలకు నీరందేదెలా..
eenadu telugu news
Published : 25/10/2021 02:28 IST

పంటలకు నీరందేదెలా..

ఆధునికీకరణ పూర్తికాని ఘనపూర్‌ (వన దుర్గా) ప్రాజెక్టు
న్యూస్‌టుడే, మెదక్‌

ముత్తాయిపల్లి వద్ద మహబూబ్‌ నహర్‌ కాలువ ఇలా..

ఘనపూర్‌ ప్రాజెక్టు (వన దుర్గా) ఏటా రెండు పంటలకు సాగు నీరందిస్తోంది. మంజీరా నదిపై 0.135 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో కొల్చారం మండలం చిన్నఘనపూర్‌ వద్ద ఆనకట్ట నిర్మించారు. మెదక్‌, హవేలి ఘనపూర్‌, కొల్చారం, పాపన్నపేట మండలాల్లో 21,625 ఎకరాల ఆయకట్టును స్థిరీకరించారు. ఈ ఆనకట్ట కింద మహబూబ్‌ నహర్‌ (ఎంఎన్‌), ఫతే నహార్‌ (ఎఫ్‌ఎన్‌) కాలువలు ఉండగా ఎంఎన్‌ కెనాల్‌ ద్వారా మెదక్‌, హవేలి ఘనపూర్‌, కొల్చారం మండలాలు, ఎఫ్‌ఎన్‌ కెనాల్‌ ద్వారా పాపన్నపేట మండలంలోని చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించేందుకు కాలువలు నిర్మించారు. సింగూర్‌ ప్రాజెక్టులో 0.4 టీఎంసీల నీటి వాటా ఉండగా, ఏడాదిలో ఖరీఫ్‌, రబీ సీజన్లలో నీటిని ఘనపూర్‌ ప్రాజెక్టుకు విడుదల చేస్తారు. సింగూర్‌ నుంచి ఘనపూర్‌కు నీరు చేరగానే అధికారులు వాటిని ఎంఎన్‌, ఎఫ్‌ఎన్‌ కాలువలకు విడుదల చేయడంతో కేవలం. మూడు, నాలుగు రోజుల్లో మాత్రమే నీరు నిల్వ ఉంటుంది. ఆ తర్వాత ఆనకట్ట ఎడారిలా మారుతుంది. ఆనకట్టలో పూడిక పేరుకు పోవడంతో ఆయకట్టుకు పూర్తి స్థాయిలో నీరందడం లేదు. దీంతో రెండు కాలువల కింద స్థిరీకరణ జరగడం లేదు. కేవలం పదిహేను వేల ఎకరాలకు మాత్రమే నీరందుతోంది.


గాంధారిపల్లి వద్ద పంట కాలువ దుస్థితి

కాలువల సిమెంట్‌ లైనింగ్‌ పనులు..

ప్రాజెక్టు పరిధిలో రెండు కాలువల ద్వారా చివరి ఆయకట్టు వరకు నీరందాలంటే సిమెంట్‌ లైనింగ్‌ చేపట్టాలి. తెరాస ప్రభుత్వం వచ్చాక జైకాతో పాటు ఇతర నిధులను కేటాయించారు. 43 కి.మీ. ఉన్న మహబూబ్‌ నహర్‌ లైనింగ్‌ పనుల్లో 32 కి.మీల వరకే పూర్తి చేశారు. కొల్చారం, మెదక్‌ మండలాల్లో పనులు పూర్తవగా హవేలి ఘనపూర్‌ మండలం నక్కవాగు వద్ద నిలిచిపోయాయి. దీంతో చివరి ఆయకట్టు వరకు నీరందడం లేదు. మరో వైపు ఫతేనహర్‌ ప్రధాన కాలువ 12.8 కి.మీ.ల సిమెంట్‌ లైనింగ్‌ పూర్తయింది. 27 కి.మీల మేర పంట కాలువలు ఉండగా, వీటికి మరమ్మతులు చేపట్టలేదు.
నిలిచిన భూసేకరణ...
ఆనకట్ట ఎత్తు పెంపునకు ప్రభుత్వం రూ.43.60 కోట్లు నిధులు మంజూరు చేసింది. అందులో ఎత్తుపెంపు, ఇతర పనులకు రూ.28 కోట్లు, భూసేకరణ రూ.13.01 కోట్లు కేటాయించారు. దీంతో రెవెన్యూ, నీటిపారుదల శాఖ అధికారులు భూసేకరణకు ముందుకొచ్చారు. ఎత్తు పెంపుతో పాపన్నపేట మండలంలోని నాగ్సాన్‌పల్లి, కొడిపాక, చిత్రియాల్‌లో 271 మంది రైతులకు చెందిన 256 ఎకరాలు, కొల్చారం మండలంలోని సంగాయిపేట, చిన్నఘనపూర్‌ గ్రామాలకు చెందిన 95 మంది రైతులకు సంబంధించిన 62.26 ఎకరాల భూములు ముంపునకు గురికానున్నాయి. భూమి ఇచ్చేందుకు పాపన్నపేట మండలంలోని మూడు గ్రామాల రైతులు ఇదివరకే ముందుకురాగా 2016లో అధికారులు ఆనకట్ట ఎత్తు పెంపు పనులను ప్రారంభించేందుకు వెళ్లగా కొల్చారం మండల రైతులు అభ్యంతరం తెలిపారు. పరిహారం ఎక్కువ కావాలని వారు డిమాండ్‌ చేయడంతో, ఆనకట్ట ఎత్తు పెంపు పనులు చేపట్టమని కేవలం జలాశయం కట్టను పటిష్టం చేస్తామని అధికారులు చెప్పడంతో వారు అంగీకరించారు. దీంతో ఆ పనులు చేపట్టారు. ఈ నేపథ్యంలో ఇటీవల కట్ట ఎత్తు పెంపునకు కొల్చారం మండలంలోని రెండు గ్రామాల రైతులు గతేడాది ముందుకొచ్చారు. భూములు ఇచ్చేందుకు అంగీకరించగా పరిహారం చెల్లింపు విషయంలో అధికారులు తుది నిర్ణయం తీసుకోకపోవడంతో భూసేకరణ నిలిచిపోయింది.
నిధులొస్తేనే ప్రయోజనం..
మహబూబ్‌ నహర్‌ కాలువ చివరి ఆయకట్టు వరకు సిమెంట్‌ లైనింగ్‌, ఫతే నహర్‌ కాలువ కింద పంట కాలువల ఆధునికీకరణకు నీటిపారుదల శాఖ అధికారులు గతంలో రూ.55 కోట్లతో ప్రతిపాదనలు పంపారు. గత జూన్‌లో ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు సంబంధిత శాఖల అధికారులతో ఘనపూర్‌ ప్రాజెక్టు పనులపై సమీక్ష నిర్వహించి నిధుల మంజూరుకు కృషి చేస్తామని ప్రకటించారు. ప్రభుత్వం నుంచి నిధులు కేటాయిస్తేనే పనులు ముందుకు సాగి, చివరి ఆయకట్టుకు నీళ్లందడమే కాకుండా ప్రాజెక్టులో నీటి నిల్వ సామర్థ్యం కూడా పెరగనుంది. నీటిపారుదల శాఖ డీఈ శివనాగరాజును వివరణ కోరగా.. ఎంఎన్‌ ప్రధాన కాలువ ఆధునికీకరణ, ఎఫ్‌ఎన్‌ పంట కాలువల మరమ్మతు పనులు చేపట్టేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించామని తెలిపారు. నిధులు మంజూరైతే త్వరితగతిన పనులు చేపడతామన్నారు.

ప్రస్తుతం ప్రాజెక్టు  ఆయకట్టు 21,625 ఎకరాలు
ఎత్తుపెంపుతో.. 5,000 ఎకరాలు


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని