గోదావరి జలాలకు ఎదురుతెన్నులు
eenadu telugu news
Published : 25/10/2021 03:20 IST

గోదావరి జలాలకు ఎదురుతెన్నులు

రూ.30 కోట్లు వెచ్చించినా ఫలితం శూన్యం
న్యూస్‌టుడే, నర్సాపూర్‌, శివ్వంపేట

శివ్వంపేటలో పూర్తయిన సంపు నిర్మాణం

రెండేళ్ల క్రితం తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో నర్సాపూర్‌ నియోజకవర్గ ప్రజలు తాగునీటికి నానా ఇబ్బందులు పడ్డారు. మంజీరా నది ఎండిపోవడంతో చక్రియాల నుంచి నీటి సరఫరాను నిలిపివేశారు. అందుకు తోడు భూగర్భజలాలు అడుగంటగా ఎన్ని బోర్లు వేసినా నీరు లభ్యం కాలేదు. దీంతో ట్యాంకర్లతో నీటిని సరఫరా చేయగా కేవలం నర్సాపూర్‌ పట్టణంలోనే ప్రతిరోజూ 40-50 ట్యాంకర్లు తిరిగేవి. పరిస్థితిని స్థానిక ఎమ్మెల్యే మదన్‌రెడ్డి సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకువెళ్లగా ఆయన తన పుట్టిన రోజు కానుకగా నర్సాపూర్‌ ప్రాంతానికి గజ్వేల్‌లోని కోమటిబండ నుంచి గోదావరి నీటి సరఫరాకు హామీ ఇచ్చి ఆ మేరకు నిధులు కూడా విడుదల చేశారు.
రెండేళ్లయినా శివ్వంపేట సంప్‌కు చేరని నీరు
చక్రియాల నుంచి దౌల్తాబాద్‌, నర్సాపూర్‌, తూప్రాన్‌ మీదుగా గజ్వేల్‌ వరకు ఉన్న మంజీరా నీటి పథకం ప్రధాన పైప్‌లైన్ల ద్వారానే గోదావరి నీటిని తరలించేందుకు సిద్ధమయ్యారు. వాటికి తోడు కోమటిబండ నుంచి శివ్వంపేట మండలం శభాష్‌పల్లి వరకూ 18 కిలోమీటర్ల దూరం కొత్తగా పైప్‌లైన్‌, వాల్వుల నిర్మాణం చేపట్టారు. తూప్రాన్‌ వరకూ గోదావరి నీటిని సరఫరా చేసిన అధికారులు శివ్వంపేట సంప్‌కు చేర్చడానికి మీనమేషాలు లెక్కిస్తున్నారు. 12 కిలోమీటర్ల మేర ఉన్న పాత మంజీరా పథకం పైప్‌లైన్‌ నుంచి ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఏళ్ల క్రితం వేసిన పైప్‌లైన్లు కావడంతో అడుగడుగునా పరిశీలిస్తున్నారు. శివ్వంపేటలో 8 లక్షల లీటర్ల సామర్థ్యంతో సంపు నిర్మించగా పనులు పూర్తయి ఏడాది అయింది. ఇక్కడ నుంచి చిన్నగొట్టిముక్ల అనంతరం నర్సాపూర్‌లో పీర్ల గుట్టపై నిర్మించిన ట్యాంకుకు పంపింగ్‌ చేయనున్నారు. అక్కడనుంచి శివ్వంపేట, వెల్దుర్తి, కొల్చారం, కౌడిపల్లి, చిలప్‌చెడ్‌ మండలాలకు గోదావరి నీటిని సరఫరా చేస్తామని ప్రకటించి రెండేళ్లు కావస్తున్నా పనులన్నీ పూర్తయిన గోదావరి జలాలు మాత్రం సరఫరా కావడం లేదు.
మంజీరా రాకతో నత్తనడకన పనులు..
మధ్యలో కరోనా మహమ్మారి విజృంభణతో కూలీల కొరత తలెత్తి పనులు నిలిచిపోయాయి. మధ్యలో మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్యే మదన్‌రెడ్డి పలుమార్లు సమీక్షలు చేపట్టి పనులు త్వరితగతిన చేపట్టాలని ఒత్తిడి తీసుకురాగా పురోగతి కనిపించింది. ఇంతలో వానాకాలం రాగా భారీ వర్షాలతో మంజీరా నీటి సరఫరాతో అన్ని ఇబ్బందులు తీరాయి. మంజీరా నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడితే గోదావరి నీటిని వినియోగించుకుందామన్న ధీమాతో ఉన్నారు.
పక్షం రోజుల్లో షురూ..
- ప్రవీణ్‌కుమార్‌, డీఈ, మిషన్‌ భగీరథ పథకం

గోదావరి నీటిని కోమటిబండ నుంచి తూప్రాన్‌ కమాన్‌ వరకూ తీసుకొచ్చాం. అక్కడి నుంచి పక్షం రోజుల్లో శివ్వంపేట సంప్‌లోకి వెళతాయి. నీటి తరలింపు పనులు దాదాపు పూర్తయ్యాయి. ప్రస్తుతం ప్రయోగాత్మక పరిశీలన చేస్తున్నాం. ఇది విజయవంతమైతే నేరుగా గోదావరి జలాలు శివ్వంపేట సంప్‌లోకి వచ్చి చేరతాయి. తర్వాత శివ్వంపేట, వెల్దుర్తి మండలాల్లోని 149 ఆవాసాలకు నీటిని సరఫరా చేస్తాం.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని