నిధులున్నా.. ఆసక్తి కరవు!
eenadu telugu news
Published : 25/10/2021 03:20 IST

నిధులున్నా.. ఆసక్తి కరవు!

ముందుకు రాని  గుత్తేదారులు
న్యూస్‌టుడే, జహీరాబాద్‌

అధ్వానంగా మిర్జాపూర్‌-కుప్పానగర్‌ మార్గం..

ఓ వైపు అధిక వర్షాలు.. మరోవైపు వాహనాల రద్దీ.. రెండేళ్లుగా జిల్లాలోని అనేక రహదారులు అధ్వానంగా మారాయి. కొన్ని రోడ్లపై పెద్దపెద్ద గుంతలు ఏర్పడటంతో రాకపోకలకు వాహనదారులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దెబ్బతిన్న రహదారులకు మరమ్మతు చేసి ఇబ్బందులు తీర్చాలనే ఉద్దేశంతో ఏడాది క్రితం ప్రభుత్వం నిధులు కేటాయించింది. ఆయా పనులకు సంబంధించి మూడు పర్యాయాలు టెండర్లు పిలిచినా గుత్తేదార్లు ముందుకు రాకపోవటంతో నిధులు మూలుగుతున్నాయి. జహీరాబాద్‌ డివిజన్‌ పరిధిలోని వివిధ రహదారుల పనులే ఇందుకు నిదర్శనం. ఈ నేపథ్యంలో కథనం.
మూడు సార్లు టెండర్లు పిలిచినా..
* జహీరాబాద్‌-రాయికోడ్‌ మార్గంలో కప్పాడ్‌ నుంచి రాయికోడ్‌ చౌరస్తా వరకు 8 కిలో మీటర్ల మరమ్మతులకు నిధులు రూ.4.87 కోట్లు కేటాయించారు. ఈ పనులు చేపట్టడానికి ఆరు నెలల్లో మూడు పర్యాయాలు టెండర్లు పిలిచినా ఎవరూ ముందుకు రాలేదు. జహీరాబాద్‌ నుంచి ఝరాసంగం, రాయికోడ్‌ మండలాల మీదుగా నారాయణఖేడ్‌, జోగిపేటకు వెళ్లడానికి కీలక మార్గం ఇది. నిత్యం రద్దీగా ఉండే ఈ రోడ్డపై అనేక చోట్ల గుంతలు పడి అధ్వానంగా మారడంతో ప్రయాణికులు, వాహనదారుల ఇక్కట్లు వర్ణనాతీతంగా మారాయి.
* మిర్జాపూర్‌-కుప్పానగర్‌ 4 కిలో మీటర్ల దారిని బాగు చేయడానికి రూ.1.52 కోట్ల నిధులు మంజూరయ్యాయి. ఇప్పటి వరకు మూడు సార్లు టెండర్లు పిలిచినా గుత్తేదారులెవరూ ఆసక్తి చూపలేదు. న్యాల్‌కల్‌, ఝరాసంగం మండలాల్లోని అనేక గ్రామాల రైతులు కర్మాగారానికి చెరకును తరలించేందుకు ఈ మార్గం ఉపయుక్తంగా ఉంటుంది. ‘నిమ్జ్‌’కు కేటాయించిన భూములకు వెళ్లడానికి అనుసంధాన రోడ్డు ఇది. పెద్దపెద్ద గుంతలు పడటంతో ప్రజలకు ఇబ్బందులు తప్పటం లేదు.
* కంకోల్‌-కప్పాడ్‌ మార్గంలో 16 కిలో మీటర్ల మరమ్మతులకు రూ.3.90 కోట్లు మంజూరయ్యాయి. ఇప్పటికే మూడు సార్లు టెండర్లు పిలిచినా పనులు దక్కించుకోవడానికి ఎవరూ ముందుకు రాలేదు. 65వ నంబర్‌ జాతీయ రహదారికి అనుసంధానంగా కంకోల్‌ నుంచి కప్పాడ్‌కు, మునిపల్లి, రాయికోడ్‌, ఝరాసంగం మండలాల్లోని వివిధ గ్రామాలను కలుపుతూ నారాయణఖేడ్‌, జోగిపేట తదితర ప్రాంతాలకు వెళ్లడానికి ఈ దారే కీలకం. మరమ్మతులకు నోచక పోవటంతో అవస్థలు తప్పటం లేదని స్థానికులు పేర్కొంటున్నారు. ఇప్పటికైనా అధికారులు, ప్రభుత్వం చొరవ తీసుకొని పనులు పూర్తి చేయాలని కోరుతున్నారు.
పురోగతి లేక ఇక్కట్లు...
ప్రత్యేక మరమ్మతుల (పీఆర్‌) నిధుల కింద జహీరాబాద్‌ శివారులోని భరత్‌నగర్‌ రోడ్డును 2.4 కిలో మీటర్ల మేరకు మరమ్మతులకు రూ.50లక్షలు మంజూరయ్యాయి. మిర్జాపూర్‌ (బి) కుప్పానగర్‌ రహదారికి రూ.30లక్షలు, రామ్‌తీర్థ్‌-వడ్డి రహదారికి రూ.1.32 కోట్లు కేటాయించారు. పనుల నిర్వహణలో జాప్యం కారణంగా ఇటీవల కురిసిన వర్షాలకు రోడ్లు బాగా దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో అదనపు నిధులు కావాలని అధికారులు ప్రతిపాదించడంలో జాప్యం జరిగింది. చాల్కి-చీకుర్తి మధ్యలో వంతెన నిర్మాణానికి రూ.80లక్షలు, జాతీయ రహదారి నుంచి ధనసిరి వరకు రెండు వారధుల నిర్మాణానికి రూ.2కోట్లు మంజూరు కాగా.. అదనపు నిధులకు ప్రతిపాదనల విషయంలో జాప్యం కారణంగా పనుల్లో ఎలాంటి పురోగతి లేదు.
ఉన్నతాధికారులకు నివేదించాం..
- నర్సింహులు, డీఈఈ, ర.భ. జహీరాబాద్‌ డివిజన్‌

డివిజన్‌ పరిధిలోని వివిధ రహదారుల మరమ్మతులకు నిధులు మంజూరయ్యాయి. నిబంధనల ప్రకారం ఆన్‌లైన్‌ విధానంలో టెండర్లు పిలిచాం. ఇప్పటికే మూడు పర్యాయాలు టెండర్లు పిలిచినా ఎవ్వరూ ముందుకు రాలేదు. ఉన్నతాధికారుల సూచన ప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటాం.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని