తెరుచుకోనున్న కస్తూర్బాలు
eenadu telugu news
Published : 25/10/2021 03:20 IST

తెరుచుకోనున్న కస్తూర్బాలు

నేటి నుంచి రెగ్యులర్‌ తరగతులు

న్యూస్‌టుడే, సంగారెడ్డి మున్సిపాలిటీ: కరోనా మహమ్మారి పరిస్థితుల తరువాత ఎట్టకేలకు కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాలు పునఃప్రారంభం కానున్నాయి. విద్యాశాఖ రాష్ట్ర కమిషనర్‌ ఆదేశాల మేరకు జిల్లాలో ప్రారంభించేందుకు విద్యాశాఖ చర్యలు చేపట్టింది. సోమవారం నుంచి వసతితో పాటు, ప్రత్యక్ష తరగతులకు శ్రీకారం చుట్టనున్నారు. ఇప్పటికే అన్ని పాఠశాలలను శానిటైజ్‌ చేయడంతో పాటు శుభ్రం చేశారు. సెప్టెంబరు 1 నుంచి పాఠశాలల్లో ప్రత్యక్ష తరగతులు ప్రారంభమైనా.. కస్తూర్బాలకు అనుమతి రాకపోవడంతో అంతర్జాలం ద్వారానే బోధించారు. వీటిలోనూ ప్రత్యక్ష తరగతులు ప్రారంభిస్తుండడంతో సందడి నెలకొననుంది. ఈ నేపథ్యంలో కథనం.
ఏడు చోట్ల ఇంటర్‌ తరగతులు: జిల్లాలో 17 కస్తూర్బా గాంధీ విద్యాలయాలు ఉన్నాయి. వీటిలో ఏడు చోట్ల ఇంటర్మీడియట్‌ తరగతులు నిర్వహిస్తున్నారు. జిల్లాలో 6 నుంచి 10వ తరగతి వరకు 3,419 మంది, ఇంటర్మీడియట్‌లో 612 మంది విద్యార్థినులు చదువుతున్నారు. నిరుపేద, అనాథ బాలికలకు వసతితో పాటు నాణ్యమైన విద్యను అందించేందుకు కస్తూర్బా పాఠశాలలను ప్రారంభించారు. వీటిలో చదువుతో పాటు కంప్యూటర్‌, ఆటలు, కరాటే, యోగ, ధ్యానం తదితర అంశాల్లో శిక్షణ ఇస్తారు. ఈ పాఠశాలలు ప్రారంభం అవుతుండటంతో కంప్యూటర్‌ ఆపరేటర్లు, పీఈటీలను నియమించేందుకు చర్యలు చేపడుతున్నారు. బాలికలకు పౌష్టికాహారం అందించాలన్న ఉద్దేశంతో ప్రతి రోజు కోడి గుడ్డు, వారానికి ఒకసారి కోడిమాంసం, ప్రతి నెలా ఖర్చుల కోసం కాస్మొటిక్‌ ఛార్జీలు చెల్లిస్తారు. కొవిడ్‌ నేపథ్యంలో ఏడాదిన్నరగా మూసి ఉంచడంతో విద్యార్థినులు చదువులో వెనకబడ్డారు. బడిగంట మోగడంతో విద్యార్థినులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ విద్యార్థినులను పాఠశాలలకు పంపించాలని ఎస్‌వోలు తల్లిదండ్రులకు చరవాణి ద్వారా సమాచారం అందిస్తున్నారు. రెండు రోజుల్లో పూర్తి స్థాయిలో విద్యార్థులు వచ్చే అవకాశం ఉంది.

వసతి, ప్రత్యక్ష తరగతుల నిర్వహణ
- అనురాధ, జిల్లా బాలికల అభివృద్ధి అధికారిణి

జిల్లాలో కస్తూర్బా బాలికల పాఠశాలలు ప్రారంభించాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. ఇక్కడ వసతితో పాటు ప్రత్యక్ష తరగతులు జరుగుతాయి. కొవిడ్‌ నిబంధనలు పక్కాగా పాటిస్తాం. పిల్లలను తల్లిదండ్రులు పాఠశాలలకు పంపించాలి.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని