ఆర్థిక ఇబ్బందులతో యువకుడి ఆత్మహత్య
eenadu telugu news
Published : 25/10/2021 03:28 IST

ఆర్థిక ఇబ్బందులతో యువకుడి ఆత్మహత్య

రాకేష్‌ మృతదేహం

బెజ్జంకి, న్యూస్‌టుడే: కుటుంబ అవసరాలకు, పంటల సాగుకు చేసిన అప్పులు తీర్చలేక, ఆర్థిక ఇబ్బందులతో సతమతమైన ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడిన ఘటన బెజ్జంకి మండలం బేగంపేటలో చోటుచేసుకుంది. ఏఎస్‌ఐ చేరాలు, కుటుంబీకులు తెలిపిన వివరాలు.. గ్రామంలోని వడ్డెర కాలనీకి చెందిన దండి సారవ్వ, రాజయ్య దంపతులకు కుమారుడు రాకేష్‌ (23), ఓ కుమార్తె ఉన్నారు. రాజయ్య కొద్ది నెలల క్రితం అనారోగ్యంతో మృతి చెందగా కుటుంబ బాధ్యత కుమారుడు రాకేష్‌పై పడింది. రెండేళ్ల క్రితం సోదరికి పెళ్లి చేయగా రూ.5 లక్షల వరకు అప్పులయ్యాయి. గ్రామ శివారులో నాలుగెకరాలు కౌలుకు తీసుకొని పత్తి పంట సాగు చేశాడు. ఆశించిన స్థాయిలో దిగుబడి రాలేదు. దీంతో సాగుకు, పెళ్లికి చేసిన అప్పులు ఎలా తీర్చాలో అర్థంకాక మనోవేదనకు గురై శనివారం పత్తి చేలో పురుగు మందు తాగాడు. దీన్ని అక్కడున్న వారు కుటుంబసభ్యులకు సమాచారం ఇవ్వగా వారొచ్చి 108 వాహనంలో కరీంనగర్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ రాకేష్‌ రాత్రి సమయంలో మృతి చెందాడు. ఆదివారం తల్లి సారవ్వ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఏఎస్‌ఐ వివరించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని