క్రికెట్‌ బరిలో దిగితే మెరుపులే!
eenadu telugu news
Updated : 25/10/2021 12:57 IST

క్రికెట్‌ బరిలో దిగితే మెరుపులే!

న్యూస్‌టుడే, సిద్దిపేట టౌన్‌

 ఆఫ్రిది..

క్రికెట్‌ సాధన లేని రోజు.. ఆ యువకుడికి శూన్యమే. నిరంతర శ్రమ.. ఉన్నతంగా ఎదగాలన్న తలంపు అంచలంచెలుగా ఎదిగేందుకు దోహదం చేస్తోంది. 22 ఏళ్లున్న ఈ కుర్రాడు.. వందలాది మ్యాచ్‌ల్లో బ్యాటింగ్‌, బౌలింగ్‌తో మెరిశారు. అతడే సిద్దిపేటకు చెందిన మహమ్మద్‌ ఆఫ్రిది. ఈ యువ ఆటగాడు.. బీసీసీఐ నిర్వహించే సయ్యద్‌ముస్తాక్‌ అలీ ట్రోఫీ (సీనియర్‌ మెన్స్‌ టీ-20 టోర్నీ)కి ఎంపికయ్యారు. హెచ్‌సీఏ (హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌) జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్నారు.
సిద్దిపేటలోని సాజిద్‌పురా కాలనీకి చెందిన టెంట్‌హౌస్‌ నిర్వాహకుడు అమీర్‌జానీ, నసీమా సుల్తానా దంపతులకు ఇద్దరు చొప్పున కుమార్తెలు, కుమారులు ఉన్నారు. అమీర్‌జానీ క్రికెటర్‌. తండ్రి ప్రోత్సాహంతో పెద్ద కుమారుడు ఆఫ్రిదికి క్రికెట్‌పై ఆసక్తి పెరిగింది. ఇంటర్‌ పూర్తిచేసిన ఈ యువకుడు.. నాలుగేళ్లుగా పూర్తిస్థాయిలో క్రికెట్‌పై దృష్టి సారించారు. తండ్రి సారథ్యంలో నిత్యం సిద్దిపేటలోని క్రీడా మైదానంలో తర్ఫీదు పొందుతున్నారు. సీనియర్లు, శిక్షకుల ప్రోత్సాహం, సలహాలు కలిసొచ్చాయి. ఉదయం 5 నుంచి 9 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి 7 గంటల సాధన.. నిత్యం జీవితంలో ఓ భాగంగా మార్చుకున్నారు. ఆల్‌రౌండర్‌గా రాణిస్తునఆనరు. మరోవైపు తండ్రికి చేదోడువాదోడుగా నిలుస్తున్నారు. ఇతడి తమ్ముడు అర్ఫాజ్‌అహ్మద్‌ లీగ్‌ స్థాయిలో రాణిస్తున్నారు.

 ఆఫ్రిది.. జిల్లాస్థాయిలో ఇప్పటి వరకు 50 మ్యాచ్‌లు ఆడారు. 2017లో ఆల్‌ ఇండియా టోర్నీలో భాగంగా మలేషియా జట్టుతోనూ తన భాగస్వాములతో కలిసి తలపడ్డారు. 2018 నుంచి హెచ్‌సీఏ తరఫున మ్యాచ్‌ల్లో ఆడుతున్నారు. ఇప్పటి వరకు 50కి పైగా మ్యాచ్‌లు ఆడగా.. ఒక శతకం, 15 అర్ధ శతకాలు సాధించారు. 30 వికెట్లు తీశారు. 2డే, 3డే లీగ్‌లు ఆడారు. ఈ తరుణంలో హరియాణాలో నవంబరు 4వ తేదీ నుంచి జరిగే క్రికెట్‌ పోటీలకు ఎంపికయ్యారు. హైదరాబాద్‌ సీనియర్‌ పురుషుల జట్టుకు 25 మందిని ఎంపిక చేయగా, అందులో ఇతడు ఒకరవడం విశేషం. ఈ మేరకు ఆదివారం హుజురాబాద్‌లో మంత్రి హరీశ్‌రావును ఆఫ్రిది కలవగా అభినందించి సత్కరించారు. విజయంలో కీలకపాత్ర పోషించాలని ఆకాంక్షించారు. బల్దియా అధ్యక్షురాలు మంజుల, హెచ్‌సీఏ సభ్యుడు, కౌన్సిలర్‌ మల్లికార్జున్‌, వన్‌టౌన్‌ సీఐ శ్రీనివాస్‌ తదితరులు ఉన్నారు. భారత క్రికెటర్‌ హార్దిక్‌ పాండ్య నాకు స్ఫూర్తి అని, నాన్న వెన్నంటే ఉంటూ ప్రోత్సహిస్తున్నారని చెప్పుకొచ్చారు ఆఫ్రిది. తనను ఎంపిక చేసిన నిర్వాహకులు, హెచ్‌సీఏ అధ్యక్షుడు అజహరుద్దీన్‌లకు కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో భారత జట్టుకు ఆడాలనేది సంకల్పమని చెప్పారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని