
డీఈవో ఆకస్మిక తనిఖీ

తిప్పర్తి, న్యూస్‌టుడే: మండలంలోని తిప్పర్తి బాలికల ఉన్నత పాఠశాల, ఇండ్లూరు ప్రాథమికోన్నత పాఠశాల, మామిడాల ఉన్నత పాఠశాలను డీఈవో భిక్షపతి బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆన్లైన్ తరగతుల ద్వారా జరుగుతున్న విద్యాభోదనను పరిశీలించారు. విద్యార్థుల ఇంటికి వెళ్లి పాఠ్యాంశాలపై మట్లాడారు. ఉపాధ్యాయులు డైరీ, పాఠ్యాంశాల నిర్వహణ, అసైన్మెంట్స్, వర్క్‌షీట్స్, విద్యార్థుల ప్రతిస్పందనలపై అడిగి తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు ఆన్లైన్ తరగతులు పరిశీలిస్తూనే విద్యార్థులకు కలిగే సందేహాలను నివృత్తి చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్‌రెడ్డి, విజయనిర్మల తదితరులు పాల్గొన్నారు.
నకిరేకల్: ఆన్లైన్ బోధనను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని డీఈవో బి.బిక్షపతి అన్నారు. గోరెంకలపల్లిలో ఆన్లైన్ పాఠాల అమలుతీరును బుధవారం పరిశీలించారు. నోట్స్ రాసుకోవాలని, సందేహాలుంటే పాఠశాలల్లో అందుబాటులో ఉండే ఉపాధ్యాయులను అడిగి నివృత్తి చేసుకోవాలని సూచించారు. ఒకటి, రెండోతరగతి విద్యార్థులు కూడా విద్యాసంవత్సరం నష్టపోకుండా ఉండేందుకు పాఠశాలల స్థాయిలోనే వీడియో పాఠాలు రూపొందించాలని ఉపాధ్యాయులకు సూచించారు.
ఉపాధ్యాయుడికి నోటీసులు: కలెక్టరేట్: వేములపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎస్ఏ(సాంఘికశాస్త్రం)గా పని చేస్తున్న దుర్గంపూడి జగదీశ్వర్‌రెడ్డి దాదాపు గత 20 నెలల నుంచి అనుమతి లేకుండా విధులకు హాజరు కానందున విధుల నుంచి ఎందుకు తొలగించకూడదో వివరణ ఇవ్వాలని డీఈఓ భిక్షపతి బుధవారం నోటీసులు జారీ చేశారు. ఉపాధ్యాయుని నుంచి పది రోజుల్లో సంజాయిషీ అందనట్లయితే ఎలాంటి వివరణ లేదని భావించి తదుపరి క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం జరుగుతుందని ప్రకటనలో తెలిపారు.