
ప్రాణాలు తీసిన అక్రమ సంబంధం
పథకం ప్రకారం భార్యాభర్తలు కలిసి హత్య
నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు
అనంతగిరి, న్యూస్‌టుడే: అనంతగిరి మండలం శాంతినగర్ శివారులో సోమవారం జరిగిన హత్య కేసులో నిందితులను పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. హత్యకు సంబంధించిన వివరాలను కోదాడ ఇన్‌ఛార్జి డీఎస్పీ మోహన్‌కుమార్ వెల్లడించారు. ఖమ్మం జిల్లాకు చెందిన గ్రానైట్ వ్యాపారి వెన్ని రంగనాథ్(43)ను నేలకొండపల్లి వాస్తవ్యులు చల్లా రమేశ్, చల్లా రాజేశ్వరి దంపతులు పథకం ప్రకారం హత్య చేశారని చెప్పారు. మామయ్య వరుసైన రంగనాథ్, చల్లా రాజేశ్వరి మధ్య ఏడేళ్లుగా కొనసాగుతున్న అక్రమ సంబంధమే హత్యకు కారణమైంది. ఈ విషయమై భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండటంతో రాజేశ్వరి పుట్టింటికి వెళ్లి ఖమ్మంలో టైలరింగ్ పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. రంగనాథ్ వల్లే భార్యాభర్తల మధ్య గొడవలొస్తున్నాయని.. ఇందుకు కారణమైన అతడిని అంతమొందిస్తే ప్రశాంతంగా ఉంటామని రమేశ్ తన భార్యకు నచ్చజెప్పాడు. ఆమె సానుకూలంగా స్పందించడంతో పథకం పన్నారు. ముందుగా అనుకున్న ప్రకారం రంగనాథ్‌కు ఫోన్ చేసి ఆయన వాహనంలోనే ఖమ్మం నుంచి సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలం శాంతినగర్ సమీపంలోని గుట్ట వద్దకు రాజేశ్వరి వచ్చారు. అక్కడ రంగనాథ్, రాజేశ్వరి మాట్లాడుతుండగా సెంట్రింగ్ కర్రతో అతడి తలపై రమేష్ బలంగా కొట్టారు. తప్పించుకునేందుకు ప్రయత్నించగా బండ రాయితో కొట్టడంతో అక్కడికక్కడే రంగనాథ్ మృతి చెందారు. హత్యచేసిన అనంతరం రెండోరోజు కోదాడ రూరల్ పోలీస్‌స్టేషన్‌లో రాజేశ్వరి లొంగిపోయారు. తన భర్తతో కలిసి హత్యచేసినట్లు ఆమె అంగీకరించారు. నిందితులు రమేశ్, రాజేశ్వరి నుంచి ద్విచక్రవాహనం, రెండు సెల్ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
చెరువులో దూకి వ్యక్తి మృతి
సూర్యాపేట నేరవిభాగం: కుటుంబ కలహాలతో సూర్యాపేట పట్టణం తాళ్లగడ్డకు చెందిన నోముల వెంకటేశ్ (55) సద్దుల చెరువులో బుధవారం దూకి బలవన్మరణానికి పాల్పడ్డారు. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. కుడకుడ గ్రామానికి చెందిన యువతితో వెంకటేశ్ కుమారుడికి కొంతకాలం క్రితం వివాహం జరిగింది. ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో కోడలు కాపురానికి రావడం లేదు. ఇదే విషయమై బుధవారం కోడలు తరఫు బంధువులు వెంకటేశ్‌తో వాగ్వాదానికి దిగారు. మనస్తాపం చెందిన వెంకటేశ్.. చెరువులో దూకి బలవన్మరణానికి పాల్పడ్డారు. సాయంత్రం చెరువు కట్టపై నడకకు వచ్చిన వారు అతను చెరువులోకి దూకుతుండగా చూసి కాపాడేందుకు ప్రయత్నించారు. కొంతమంది యువకులు అతన్ని ఒడ్డుకు చేర్చారు. అప్పటికే వెంకటేశ్ మృతిచెందారు. ఇన్స్పెక్టర్ ఆంజనేయులు ఘటనా ప్రాంతానికి వెళ్లి మృతదేహాన్ని పరీక్షల నిమిత్తం సూర్యాపేట జనరల్ ఆసుపత్రికి తరలించారు.