
కార్మిక వ్యతిరేక విధానాలపై ఆందోళన
కోదాడ పట్టణం: కేంద్రంలోని భాజపా ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలపై దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా ఐక్య కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపుమేరకు కోదాడలో ఆందోళన చేపట్టారు. సీఐటీయూసీ, ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ, సీఐటీయూ, ఐఎఫ్టీయూ, టీఎన్టీయూసీ, ఐఎఫ్టీయూ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో గురువారం సీపీఐ కార్యాలయం నుంచి ప్రారంభమైన కార్మిక నిరసన ర్యాలీలో వందలాది మంది కార్మికులు, వివిధ రాజకీయ, విద్యార్థి యువజన సంఘ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రంగ థియేటర్ చౌరస్తాలో మానవహారం, రాస్తారోకో, ధర్నా నిర్వహించారు. ఆయా సంఘాల నాయకులు మాట్లాడుతూ.. కేంద్రంలో భాజపా అధికారంలోకి వచ్చాక కార్మిక సంఘాలు పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను కాలరాయడానికి ప్రయత్నిస్తోందని ధ్వజమెత్తారు. ఇటీవల కాలంలో చట్ట సభల్లో 24 రకాల చట్టాలను ఆమోదించి రైతులకు వ్యతిరేకంగా మూడు బిల్లులను ప్రవేశపెట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు శ్రీనివాసరావు, వెంకటేశ్వర్లు, లక్ష్మినారాయణ రెడ్డి, రాములు, ముత్యాలు, ప్రభాకర్, నర్సింహారావు, వెంకటేశ్వరరావు, వెంకటయ్య, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.