Published : 08/04/2021 03:41 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

దిల్లీ నుంచి మైసూరుకు చేరిన అరుదైన బుద్ధ శాసనం

ఈనాడు, నల్గొండ: శాతవాహనుల కాలం నాటి కీ.శ. రెండో శతాబ్దానికి చెందిన అరుదైన బుద్ధ శాసనాలను సమగ్ర అధ్యయనం నిమిత్తం దిల్లీలోని జాతీయ మ్యూజియం నిర్వాహకులు దక్షిణ భారతదేశ పురావస్తు కేంద్రమైన మైసూరుకు బుధవారం పంపించారు. ఈ పాదుకలు నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు నిర్మాణ సమయంలో జరిపిన తవ్వకాల్లో బయల్పడ్డాయి. అప్పట్లో దిల్లీలోని జాతీయ మ్యూజియానికి తరలించగా ఇప్పటివరకు దీనిని సంబంధిత అధికారులు రికార్డుల్లో నమోదు చేయలేదు. జాతీయ మ్యూజియంలో ఉండి రికార్డుల్లో లేని శాసనాలను అధ్యయనం నిమిత్తం మైసూరుకు తరలిస్తుండగా వాటితో కలిపి ఈ అరుదైన బుద్ధ శాసనాలను సైతం పంపించినట్లు జాతీయ పురావస్తు శాఖ డైరెక్టర్‌ ఆచార్య మునిరత్నం రెడ్డి ‘ఈనాడు’కు వెల్లడించారు. శాసనం ప్రాకృత భాష, బ్రహ్మి లిపిలో ఉందని, వీటిని రెండో శతాబ్దానికి చెందిన సాక, మోద, బకన అనే బౌద్ధ బిక్షువులు నాగార్జున సాగర్‌ ప్రాంతంలో ఉన్న వారికి అందించినట్లు ఆయన వెల్లడించారు.
శాతవాహనుల కాలంలో తెలుగు రాష్ట్రాల్లోని నాగార్జునసాగర్‌, అమరావతి ప్రాంతాల్లో బౌద్ధం ఉజ్వలంగా విలసిల్లింది. నందికొండ ప్రాంతంలో ఆచార్య నాగార్జునుడు నిర్వహించిన నాగార్జున విశ్వవిద్యాలయ ఖ్యాతి అప్పట్లోనే ఖండాంతరాలకు వ్యాపించింది. అనంతరం కాలక్రమంలో ఆ ప్రభ కోల్పోగా తిరిగి నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు నిర్మాణ సమయంలో ఈ ప్రాంతంలో తవ్వకాలు జరపగా బౌద్ధానికి చెందిన అనేక అరుదైన, పురాతన శాసనాలు బయటపడ్డాయి. వీటిలో కొన్నింటిని నాగార్జున కొండపై భద్రపర్చగా మిగిలిన వాటిని దిల్లీ, కలకత్తా, మద్రాసులోని పలు మ్యూజియాలకు అప్పట్లో అధికారులు తరలించారు. కొన్నింటినీ రికార్డుల్లో నమోదు చేయలేదు. తాజాగా మైసూరుకు చేరిన ఈ శాసనాన్ని సమగ్ర అధ్యయనం చేస్తే ఈ ప్రాంతంలో బౌద్ధానికి సంబంధించి మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశముంది. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని