హరిత సంకల్పం
logo
Published : 18/06/2021 02:58 IST

హరిత సంకల్పం

ఏడో విడత లక్ష్యాన్ని నిర్దేశించిన అధికారులు

-సూర్యాపేట పట్టణం, భువనగిరి పట్టణం, న్యూస్‌టుడే

భవనగిరి పట్టణంలో నర్సరీలో సిద్ధంగా ఉన్న మొక్కలు

రాష్ట్ర ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుంచి అటవీ విస్తీర్ణం పెంచేందుకు నిత్యం కృషి చేస్తోంది. విడతల వారీగా మొక్కల పెంపకానికి ప్రాధాన్యమివ్వడమే కాకుండా వాటి సంరక్షణకూ ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటోంది. ‘తెలంగాణకు హరితహారం’లో భాగంగా పచ్చదనాన్ని కాపాడటానికి మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. దీనిలో భాగంగా ఇప్పటికే ఆరు విడతలు పూర్తి చేసుకొని ఏడో విడతకు చేరుకుంది. అందులో భాగంగా ఏడో విడతకు పురపాలికలు సన్నాహాలు చేస్తున్నాయి. వాతావరణంలో మార్పులు వస్తుండటంతో ఆ దిశగా అధికారులు చర్యలు ప్రారంభించారు.

మ్మడి జిల్లావ్యాప్తంగా 19 పురపాలికల్లో ఈ ఏడాది ఏడో విడతలో సుమారు 30.48 లక్షలు మొక్కలు నాటేలా అధికారులు లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. అందుకు తగినట్లుగా మహిళా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నర్సరీల్లో మొక్కలు పెంచుతున్నారు. గత ఆరు విడతలుగా నాటిన మొక్కలను రక్షించడంతో పచ్చదనం ఉట్టి పడుతోంది. ఎటు చూసినా ఎడారిని తలపించిన పట్టణాల్లో పచ్చదనం పర్చుకుంటుంది. నాలుగు, అయిదో విడత నాటిన మొక్కలు ఎదగకపోగా, ఆరో విడత, మొదటి మూడు విడతలు నాటిన మొక్కలు ఎదిగాయి. గత స్థానాలు మెరుగుపడాలంటే ఖాళీ స్థలం కనిపిస్తే చాలు హరితవనాలు విరివిగా పెంచాల్సిన అవసరం ఉంది. మొక్కలు పెంచేందుకు నర్సరీలు ఏర్పాటు చేశారు. నర్సరీల వారీగా లక్ష్యాన్ని విధించారు. ఆ మేరకు నర్సరీలు మొక్కలు పెరగకపోతే కొనుగోలు చేసుకుని నాటాల్సి ఉంటుంది.
అధికార యంత్రాంగం కసరత్తు
ఎక్కువ మొత్తంలో నాటి పచ్చదనాన్ని పెంచేందుకు హరితహారం ఎంతో దోహదం చేస్తోంది. అటవీ ప్రాంతాల్లోని ఖాళీ స్థలాల్లో రహదారులకు ఇరువైపులా, వైకుంఠధామాల్లో, డంపింగ్‌ యార్డులు, చెరువు గట్లపై, ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, ఇళ్ల ఆవరణలో పెంచేందుకు అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. ఈసారి ముందుగానే వర్షాలు కురుస్తాయనే సమాచారం మేరకు హరితహారం కార్యక్రమానికి సన్నాహాలు చేస్తున్నారు. రుతు పవనాలు ముందస్తుగానే వస్తుందనే సమాచారంతో మొక్కలు నాటేందుకు కావాల్సిన స్థల సేకరణ, గుంతలు తవ్వడం, ఎర్రమట్టి తీసుకురావడం, ట్రీగార్డులు తెప్పించుకోవడం, మొక్కలు తెప్పించుకోవడం వంటి పనుల్లో అధికార యంత్రాంగం కసరత్తు చేస్తోంది.
50 రకాల మొక్కలు
నర్సరీల్లో సుమారు 50 రకాల మొక్కలు పెంచుతున్నారు. టేకు, గుల్మోహర్‌, టెకోమా, వేప, కానుగ, చింత, కర్జూర, మద్ది, వెదురు, రావితోపాటు పూలు, పండ్ల మొక్కలు మామిడి, దానిమ్మ, నిమ్మ, జామ, సీతాఫలం, ఉసిరి, మునగ తదితర మొక్కలు అందుబాటులో ఉన్నాయి. అయితే కొన్ని మొక్కలు వివిధ దశల్లో ఉన్నాయని ఈ నెలాఖరు నాటికి అన్ని నటడానికి వస్తాయని అధికారులు చెబుతున్నారు. వీటితోపాటు ఇంటికి ఆరు చొప్పున పెరటి మొక్కలు కూడా పంపిణీ చేయనున్నారు. ఇప్పటికే ఇళ్లల్లో పండ్లు, పూల మొక్కలు, ఇతరత్రా చెట్లను పంపిణీ చేసేలా లక్ష్యాన్ని తీసుకుంటున్నారు. ఖాళీ స్థలాల్లో ఇళ్లల్లో లేదా ఇంటి ముందు మొక్కలు పెంచి వాటిని సంరక్షించాల్సిన బాధ్యతలు వారే తీసుకోవాలని అధికారులు పేర్కొంటున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని