ప్రేమ వ్యవహారంలో ప్రత్యర్థులపై దాడి
logo
Published : 18/06/2021 02:58 IST

ప్రేమ వ్యవహారంలో ప్రత్యర్థులపై దాడి

చింతపల్లి, న్యూస్‌టుడే: ప్రేమ వ్యవహరంలో జైలుకు వెళ్లి తిరిగి గ్రామానికి వచ్చిన ఆరుగురిపై ప్రత్యర్థులు దాడి చేయగా ఒకరికి తీవ్ర గాయాలు కాగా మరో ఐదుగురికి స్వల్ప గాయాలైన ఘటన మండలంలోని వర్కాల గ్రామంలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది. ఎస్సై వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం... చింతపల్లి మండలంలోని వర్కాల గ్రామానికి చెందిన కలకొండ దేవదానం కుమారుడు శ్రీకాంత్‌ ఇదే గ్రామానికి చెందిన వింజమూరి మహేందర్‌ కుమార్తెను ప్రేమ వివాహం చేసుకొన్నారు. ఏప్రిల్‌ నెలలో వింజమూరి మహేందర్‌, ఆయన సోదరుడు సురేందర్‌ దంపతులతోపాటు మహేందర్‌ కుమారుడు కలిసి దేవదానం ఇంటి మీదికి వెళ్లి దాడి చేయడంతో దేవదానం అక్కడిక్కడే మృతి చెందాడు. దీంతో మృతుని భార్య జ్యోతి ఇచ్చిన ఫిర్యాదుతో మహేందర్‌తోపాటు మరో నలుగురిపై కేసు నమోదు కావడంతో పోలీసులు అరెస్టు చేసి జైల్‌కు పంపారు. ఈ నెల 14న బెయిల్‌ రావడంతో మహేందర్‌, సురేందర్‌ దంపతులు వర్కాల గ్రామానికి వచ్చారు. సమాచారం తెలుసుకున్న దేవదానం భార్య జ్యోతి, వింజమూరి రవితోపాటు మరికొంత మంది కలిసి మహేందర్‌ ఇంటి మీద దాడి చేయడంతో మహేందర్‌తోపాటు కుటుంబ సభ్యులకు గాయాలు అయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలించారు. ఈ విషయంపై సురేందర్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు 12 మందిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని