గొలుసు దొంగలు అరెస్టు.. సొత్తు స్వాధీనం
logo
Published : 18/06/2021 02:58 IST

గొలుసు దొంగలు అరెస్టు.. సొత్తు స్వాధీనం

బాలాపూర్‌, న్యూస్‌టుడే: జల్సాలకు అలవాటు పడి దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరిని మీర్‌పేట పోలీసులు అరెస్టు చేసి రూ.4.10 లక్షల విలువైన సొత్తు స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు. వనస్థలిపురం ఏసీపీ పురుషోత్తంరెడ్డి గురువారం మీర్‌పేట ఇన్‌స్పెక్టర్‌ మహేందర్‌రెడ్డితో కలిసి విలేకరులకు  వివరాలు వెల్లడించారు. బీఎన్‌రెడ్డినగర్‌ సమీపంలో నివసిస్తున్న పాతకోటి భాగ్యలక్ష్మి వెదురు దుకాణం నిర్వహిస్తోంది. మార్చి 31న ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి నిచ్చెన ధర అడిగారు. ఆమె రూ.800 చెప్పగా వారు రూ.వెయ్యి ఇచ్చారు. ఆమె చిల్లర తెచ్చేందుకు లోపలికి వెళుతుండగా నిందితుల్లో ఓ వ్యక్తి ఎదురుగా వచ్చి ఆమె మెడలో ఉన్న అరు తులాల బంగారు గొలుసును, చేతిలో ఉన్న రూ.వెయ్యిని లాక్కున్నాడు. వెంటనే ఇద్దరూ అక్కడి నుంచి పరారయ్యారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గురువారం హస్తినాపురంలో అనుమానాస్పదంగా ఇద్దరు వ్యక్తులు తిరుగుతుండగా వారిని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. నల్గొండ జిల్లా నేరుడగొమ్మ మండలం రేకియా తండాకు చెందిన కేతావత్‌ నర్సింగ్‌(25) హస్తినాపురంలోని శ్రీరమణ కాలనీలో నివాసం ఉంటూ కూలీ పని చేస్తున్నాడు. డిండి మండలం సోమ్లా గ్రామానికి చెందిన ఇస్లావత్‌ విగ్నేష్‌(19) గుర్రంగూడ శ్రీకృష్ణనగర్‌ కాలనీ ఉంటూ చదువుకుంటున్నాడు. వీరిద్దరూ దగ్గరి బంధువులు. కొవిడ్‌ కారణంగా పని లేకపోవడంతో జల్సాలకు అలవాటు పడి సులభంగా డబ్బులు సంపాదించేందుకు దొంగతనాలకు పాల్పడాలని నిర్ణయించుకున్నారు. మధ్యాహ్నం రహదారుల వెంట తిరుగుతూ వృద్ధులను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలకు పాల్పడే వారు. ఈ నేపథ్యంలోనే మార్చి నెలలో వెదురు దుకాణం నిర్వహిస్తున్న మహిళ దగ్గరకు కొనడానికి వచ్చినట్లుగా నటించి బంగారు ఆభరణాలతో పాటు నగదును తస్కరించుకుని పరారయ్యారు. గురువారం వారిని అదుపులోకి తీసుకుని రూ.4.10 లక్షల విలువైన బంగారు ఆభరణాలతో పాటు ఒక ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని