వచ్చేనెలలో నృసింహ జలాశయంలోకి గోదావరి జలాలు
logo
Published : 18/06/2021 02:58 IST

వచ్చేనెలలో నృసింహ జలాశయంలోకి గోదావరి జలాలు

బస్వాపూర్‌ జలాశయం పనులను పరిశీలిస్తున్న కలెక్టర్‌ పమేలా సత్పతి

భువనగిరి గ్రామీణం, న్యూస్‌టుడే: బస్వాపూర్‌ (నృసింహ) జలాశయం పనులను వేగవంతం చేయాలని కలెక్టర్‌ పమేలా సత్పతి అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మితమవుతున్న జలాశయం కట్టను ఆమె గురువారం సందర్శించారు. పనుల పురోగతిని సంబంధిత అధికారులను అడిగి తెలుసుకొన్నారు. జులై 15 నాటికి 1.5 టీఎంసీల గోదావరి జలాలను జలాశయంలోకి నింపాలనే ప్రభుత్వ లక్ష్యం దిశగా పనులను సకాలంలో పూర్తి చేయాలన్నారు. ఇందుకు ప్రాజెక్టు, రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ సూచించారు. భూసేకరణ, నష్టపరిహారం చెల్లింపుపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. వడపర్తి, బీఎన్‌ తిమ్మాపూర్‌, జంగంపల్లి గ్రామాల పరిధిలో కొనసాగుతున్న పనులు సత్వరమే పూర్తి చేసేందుకు ప్రాజెక్టు అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఇటీవల మంజూరైన రూ.79 కోట్లతోపాటు మరో రూ.36 కోట్ల నిధులు మరో రెండ్రోజుల్లో మంజూరు కానున్నాయని చెప్పారు. ఈ సందర్భంగా ముంపునకు గురవుతున్న గ్రామాలను నక్షా ద్వారా పరిశీలించారు. కార్యక్రమంలో ప్రాజెక్టు ఎస్‌ఈ శ్రీనివాస్‌, ఈఈ కుర్షిద్‌, ఆర్డీవో భూపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని