నిండుకున్న బియ్యం.. పంపిణీలో జాప్యం..!
logo
Published : 18/06/2021 02:58 IST

నిండుకున్న బియ్యం.. పంపిణీలో జాప్యం..!

కొన్నిచోట్ల మూతపడిన రేషన్‌ దుకాణాలు

గడువును పొడిగించాలని కోరుతున్న కార్డుదారులు

చౌటుప్పల్‌గ్రామీణం, న్యూస్‌టుడే: ప్రభుత్వం ఉచితంగా అందజేస్తున్న రేషన్‌ బియ్యానికి కరవొచ్చింది. ఈ నెల 20 వరకే పంపిణీకి తుది గడువు ఉండగా నేటికి కొన్ని దుకాణాలకు బియ్యం నిల్వలు రాలేదు. మరికొన్ని దుకాణాలకు రావాల్సిన కోటాలో ఇంకా పెండింగ్‌ ఉంది. వచ్చిన నిల్వలు పంపిణీ పూర్తి కావడంతో దుకాణాలను నిర్వాహకులు మూసేశారు. లబ్ధిదారులు మాత్రం దుకాణాలు ఎప్పుడూ తెరుస్తారనో ఎదురుచూస్తున్నారు. కరోనా, లాక్‌డౌన్‌ పరిస్థితులతో ఇబ్బందులు పడుతున్న పేద ప్రజలకు ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్‌ అన్న యోజన పథకం కింద పేదలకు ఒక్కొక్కరికి 5 కిలోల చొప్పున తిండి గింజలు అదనంగా ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం గత నెల ఏప్రిల్‌లోనే నిర్ణయించింది. రాష్ట్రంలో మే నెల నుంచే ఉచిత బియ్యం అందించాలని భావించినా అది సాధ్యం కాలేదు. జూన్‌ నెలలో మే బియ్యం కోటా కలిపి ఒక్కో కార్డుదారునికి 15 కిలోల చొప్పున ఉచితంగా అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఒక కార్డులో నలుగురు కుటుంబ సభ్యులు ఉంటే 60 కిలోల వరకు ఇవ్వాల్సి వస్తుంది. అంతకు మించి ఉంటే 15 చొప్పున పెంచి ఇవ్వాల్సిందే. దుకాణానికి బియ్యం లోడ్‌ రావడమే ఆలస్యం నిల్వలు నిండుకుంటున్నాయి. రద్దీకి అనుగుణంగా పౌరసరఫరాలశాఖ నిల్వలను సరఫరా చేయలేకపోతుండటంతో దుకాణాలను డీలర్లు తేరవడం లేదు. అధికారుల దృష్టికి తీసుకెళ్లిన నాలుగైదు రోజుల వరకు బియ్యం రావడం లేదని డీలర్లు వాపోతున్నారు. ప్రభుత్వం బియ్యం పంపిణీ గడువు పెంచాలని కార్డుదారులు, డీలర్లు కోరుతున్నారు.

నేటితో పంపిణీ పూర్తి చేస్తాం
-గోపికృష్ణ, డీఎం, పౌరసరఫరాలశాఖ, యాదాద్రి

బియ్యం పంపిణీ గడువు పెంచే నిర్ణయం ప్రభుత్వ పరిధిలో ఉంది. పూర్తిస్థాయిలో లబ్ధిదారులకు అందలేదు కాబట్టి ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తాం. దుకాణాలకు లక్ష్యం మేరకు బియ్యం సరఫరా శుక్రవారానికి పూర్తిచేస్తాం. ఒక్కో యూనిట్‌కు 15కిలోలు చొప్పున పంపిణీ చేస్తుండటంతోనే పంపిణీలో జాప్యం అవుతోంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని