ఐదుగురిని మింగిన రోడ్డు ప్రమాదాలు
logo
Published : 22/06/2021 05:20 IST

ఐదుగురిని మింగిన రోడ్డు ప్రమాదాలు

యాదాద్రికి వెళ్లి తిరిగి వస్తుండగా ఘటన


బీబీనగర్‌ మండలం గూడూరు బస్‌స్టాప్‌ వద్ద లారీని వెనక నుంచి ఢీకొట్టిన కారు

బీబీనగర్‌, న్యూస్‌టుడే: లాక్‌డౌన్‌ ఎత్తివేయగానే ఆ కుటుంబమంతా యాదాద్రీశుడి దర్శనానికి వెళ్లింది. సాయంత్రం అందరూ కలిసి స్వామిని దర్శించుకున్నారు. రాత్రి వరకు ఆలయ పరిసరాల్లో సంతోషంగా గడిపారు. తిరుగు ప్రయాణంలో లారీ రూపంలో వచ్చిన మృత్యువు ఆ కుటుంబంలోని ఇద్దరి నిండు ప్రాణాలను బలితీసుకుంది. ఈ ఘటన ఆదివారం రాత్రి బీబీనగర్‌ మండలం గూడూరు శివారులో జరిగింది. బీబీనగర్‌ ఎస్సై రాఘవేందర్‌ సోమవారం తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌ నాచారం పరిధిలోని హెచ్‌ఎమ్‌టీ నగర్‌ కాలనీకి చెందిన సింగవరపు ప్రశాంత్‌ (43) ప్రయివేటు ఉద్యోగం చేస్తున్నాడు. లాక్‌డౌన్‌ వల్ల భార్య శిరీష (38), కుమార్తె సారాతో కలిసి 40 రోజులుగా ఇంట్లోనే ఉంటున్నాడు. లాక్‌డౌన్‌ ఎత్తివేయటంతో సమీప బంధువులతో కలిసి ఆదివారం యాదాద్రికి వెళ్లాలనుకున్నారు. సాయంత్రం ప్రశాంత్‌ కుటుంబసభ్యులతో కలిసి అతడి కారులో(టీఎస్‌08 హెచ్‌ఎఫ్‌ 4651), సమీప బంధువులు మరో కారులో యాదగిరిగుట్ట వెళ్లి స్వామివారి దర్శనం చేసుకునితిరుగు పయనమయ్యారు. గూడూరు శివారులోని బస్టాప్‌ వద్దకు రాగానే వారు ప్రయాణిస్తున్న కారు ముందర టైరు ఒక్కసారిగా పగిలింది. దీంతో రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని వెనకనుంచి వేగంగా ఢీకొన్నారు. దీంతో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు, టోల్‌సిబ్బంది, వెనకాల కారులో ఉన్న వారి బంధువులు హైవే అంబులెన్స్‌లో క్షతగాత్రులకు భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అర్ధరాత్రి సమయంలో ప్రశాంత్‌, శిరీష మృతిచెందారు. సారా పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్‌ ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్యం అందిస్తున్నారు. లారీ డ్రైవర్‌ పరారీలో ఉన్నాడు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

తుర్కపల్లి మండలంలో మహిళ..


మొగిరెడ్డి సుమీల

తుర్కపల్లి: రుస్తాపూర్‌ గ్రామానికి చెందిన మొగిరెడ్డి సుమీల (45) సోమవారం రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. స్థానికుల తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన సుమీల డ్వాక్రా సంఘంలో వీబీకేగా పనిచేస్తున్నారు. భర్త ధర్మారెడ్డితో కలిసి సోమవారం భువనగిరికి వెళ్తుండగా గ్రామ శివారు ప్రాంతంలో గజ్వేల్‌ వైపు వెళ్తున్న లారీ ఎదురుగా వచ్చి వారి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో సుమీల లారీ టైరు కింద పడి అక్కడికక్కడే మృతి చెందారు. ఇంట్లో నుంచి బయలు దేరిన కొద్ది సేపటికే ప్రమాదం జరగటం.. సుమీల మరణించటంతో కుటుంబ సభ్యులు బోరునా విలపించారు. ప్రమాదంలో ధర్మారెడ్డికి సైతం తీవ్రగాయాలయ్యాయి. చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. సుమీల, ధర్మారెడ్డిలకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమార్తెకు వివాహం చేసేందుకు సంబంధాలు కూడా చూస్తున్నారు ఇంతలోనే సుమీల మరణించింది. ఎస్‌ఐ మధుబాబు, హెడ్‌కానిస్టేబుల్‌ మైసయ్య ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని భువనగిరి ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

నూతనకల్‌లో...


మెంతబోయిన సతీష్‌

నూతనకల్‌ గ్రామీణం, న్యూస్‌టుడే: పది నిమిషాల్లో అత్తగారింటికి చేరుకుంటాడనుకున్న యువకుడిని ట్రాక్టర్‌ రూపంలో మృతువు కబలించిన ఘటన సోమవారం రాత్రి నూతనకల్‌ మండల కేంద్రంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తుంగతుర్తికి చెందిన మెంతబోయిన సతీష్‌(25) అత్తగారి గ్రామమైన ఇస్తాళపురానికి ద్విచక్ర వాహనంపై వెళ్తున్నారు. నూతనకల్‌ తహసీల్దారు కార్యాలయం సమీపంలో మహబూబాబాద్‌ జిల్లా నర్సింహులపేట మండలం పడమటి గూడెం చెందిన పాతూరి సురేందర్‌రెడ్డి సూర్యాపేట నుంచి కల్టీవేటర్‌తో వెళ్తుండగా సతీష్‌ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు. మృతునికి భార్య, కుమారుడు ఉన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ప్రసాద్‌ తెలిపారు.

ఆకుపాముల శివారులో...

మునగాల, న్యూస్‌టుడే: ఆకుపాముల శివారులో జాతీయ రహదారిపై వాహనం ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందిన సంఘటన సోమవారం చోటుచేసుకుంది. ఎస్సై శ్రీనివాసులు తెలిపిన వివరాల ప్రకారం.. నీలం రంగు చారల చొక్కా ధరించిన ఓ వ్యక్తి (35)ని గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో తలకు చేతులకు బలమైన గాయాలు కావడంతో సంఘటన స్థలంలోనే మృతిచెందారు. మృతదేహాన్ని శవపరీక్షల నిమిత్తం కోదాడ ప్రభుత్వ వైద్యశాలకు తరలించి, వీఆర్‌ వో ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసుకొని దర్యాప్తుచేస్తున్నట్లు తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని