భార్యను వేధించిన భర్తకు ఏడాది జైలు, జరిమానా
eenadu telugu news
Published : 27/07/2021 04:05 IST

భార్యను వేధించిన భర్తకు ఏడాది జైలు, జరిమానా

సూర్యాపేట న్యాయవిభాగం, న్యూస్‌టుడే: భార్యను వేధించిన భర్తకు జైలు శిక్ష, జరిమానా విధించారు. నూతనకల్‌ మండలం పెదనెమిల గ్రామానికి చెందిన కాసోజు మదనాచారి(24)పై నేరనిరూపణ కావడంతో ఏడాది జైలు శిక్షతోపాటు రూ.2 వేలు జరిమానా విధిస్తూ సూర్యాపేట రెండో అదనపు జిల్లా న్యాయమూర్తి కె.కల్యాణచక్రవర్తి సోమవారం తీర్పు చెప్పారు. మహబూబాబాద్‌ జిల్లా కొరివి మండలం సుదాన్‌పల్లి గ్రామానికి చెందిన తాటిపాముల మౌనికను 2012లో నిందితుడు మదనాచారి ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆమెపై మోజు తీరడంతో తరచూ కొట్టి వేధించేవాడు. ఈ క్రమంలో పాప జన్మించింది. అయినా అతనిలో మార్పు రాలేదు. అతని ఇబ్బందులు తట్టుకోలేక బాధితురాలు గతంలో రెండుసార్లు ఆత్మహత్యాయత్నానికి యత్నించింది. ఈ క్రమంలో మౌనిక ఆసుపత్రిలో ఉందని తెలిసి 2016 ఫిబ్రవరి 23న ఆమె తల్లిదండ్రులు సికింద్రాబాద్‌ గాంధీ ఆసుపత్రికి వెళ్లి చూడగా అపస్మారక స్థితిలో ఉంది. చికిత్స పొందుతూ మరుసటి రోజు మృతి చెందింది. మృతురాలి తండ్రి బిక్షపతి ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన నూతనకల్‌ పోలీసులు నిందితునిపై అభియోగపత్రం దాఖలు చేశారు. సాక్షులను విచారించిన న్యాయస్థానం నిందితునిపై నేరాన్ని నిర్ధారించి జైలు శిక్ష, జరిమానా విధించింది. జరిమానా చెల్లించని పక్షంలో నిందితుడు అదనంగా మరో నెలరోజులు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని న్యాయమూర్తి తీర్పులో పేర్కొన్నారు. ప్రాసిక్యూషన్‌ తరఫున అదనపు పి.పి.గ్రంథి వెంకటేశ్వర్లు కేసు వాదించగా, లైసన్‌ ఆఫీసర్‌ వి.కృష్టారెడ్డి ప్రాసిక్యూషన్‌కు సహకరించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని