ప్రజల ఆకాంక్షలకు అద్దం పట్టేలా పాలన: మంత్రి
eenadu telugu news
Published : 27/07/2021 04:20 IST

ప్రజల ఆకాంక్షలకు అద్దం పట్టేలా పాలన: మంత్రి


నల్గొండలో మాట్లాడుతున్న మంత్రి జగదీశ్‌రెడ్డి, వేదికపై ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి, కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌పాటిల్‌, తదితరులు

నల్గొండ గ్రామీణం, న్యూస్‌టుడే: ప్రజల ఆకాంక్షలకు అద్దం పట్టేలా సమస్యలకు పరిష్కారం చూపిస్తూ రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ పరిపాలన సాగిస్తున్నారని విద్యుత్‌శాఖ మంత్రి జి.జగదీశ్‌రెడ్డి అన్నారు. నల్గొండ తహసీల్దార్‌ కార్యాలయంలో సోమవారం ఆహార భద్రతా (రేషన్‌) కార్డుల పంపిణీని మంత్రి ప్రారంభించారు. నల్గొండ మండలం, పట్టణంలోని 936 మందికి కార్డులు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిల్లాలో 11,395 నూతన కార్డులు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. 2016 జనవరి నుంచి అందిన దరఖాస్తులను పరిశీలించి అర్హులకు కార్డులు మంజూరు చేసినట్లు చెప్పారు. జిల్లాలో ఇప్పటికే చలామణిలో ఉన్న 4.64 లక్షల కార్డులకు మరో 11,395 కార్డులు జతవుతాయని చెప్పారు. మొత్తం 4.75 లక్షల మంది లబ్ధిదారులకు ఆగస్ట్‌ 1 నుంచి బియ్యం పంపిణీ చేయనున్నట్లు తెలిపారు .ప్రజల ఆకలి తీర్చే కేసీఆర్‌ ప్రజల ఆకాంక్షలకు మించి సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నారన్నారు. ఇతర రాష్ట్రాలు ఏ పథకం ప్రారంభించాలన్నా తెలంగాణను ఆదర్శంగా తీసుకుంటున్నాయని వివరించారు. కరోనా సంక్షోభంలో సంక్షేమ పథకాలు ఆమలు చేస్తూ రాష్ట్రాన్ని ముందుకు తీసుకపోవడం కేసీఆర్‌ పాలనకు నిదర్శనమన్నారు. ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలో 1599 కార్డులు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. జిల్లా కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌పాటిల్‌ మాట్లాడుతూ 11395 మంది లబ్దిదారులకు ఆహార భద్రత కార్డులు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ ఛైర్మన్‌ మందడి సైదిరెడ్డి, డీఎస్‌వో వెంకటేశ్వర్లు, ఆర్డీవో జగదీశ్వర్‌రెడ్డి, ఎంపీపీ సుమన్‌, జడ్పీటీసీ సభ్యుడు లక్ష్మయ్య, పీఏసీఎస్‌ ఛైర్మన్‌ నాగరత్నంరాజు, తహసీల్దార్‌ నాగార్జునరెడ్డి పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని