రిజిస్ట్రేషన్‌ అవుతుందా.. కాదా..
eenadu telugu news
Published : 27/07/2021 04:20 IST

రిజిస్ట్రేషన్‌ అవుతుందా.. కాదా..

సాదాబైనామా దరఖాస్తుదారుల నిరీక్షణ

నల్గొండ కలెక్టరేట్‌, న్యూస్‌టుడే

భూముల క్రయవిక్రయాలను సాదా కాగితాలపై ఒప్పందాలు చేసుకున్న వారి నుంచి ప్రభుత్వం సాదాబైనామాల దరఖాస్తులు స్వీకరించింది. గతేడాది నవంబరులో గడువు నాటికి నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో 53,907 దరఖాస్తులు వచ్చాయి. మొదట్లో గ్రామాల పరిధిలోనే దరఖాస్తులకు అవకాశమివ్వగా ఆ తర్వాత పురపాలిక పరిధిలోని విలీన గ్రామాలకు వర్తింపజేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సాదా కాగితాలపై చేసుకున్న ఒప్పందాలకు రిజిస్ట్రేషన్లు చేస్తారా లేదా అనే అంశంపై స్పష్టత లేదు. భూములతో పాటు కొన్నిచోట్ల పట్టణాల్లో ఇళ్ల స్థలాల ఒప్పందాలు సైతం సాదా కాగితాలపై జరిగాయి.

జిల్లాల వారీగా వచ్చిన దరఖాస్తులు

నల్గొండ 28,314

సూర్యాపేట 15,246

యాదాద్రి భువనగిరి 10,347

జారీకాని మార్గదర్శకాలు

సాదాబైనామా కోసం దరఖాస్తులు స్వీకరించి ఎనిమిది నెలలు గడిచింది. ఇప్పటివరకు వీటి పరిష్కారానికి తహసీల్దార్లు ఏ రకంగా ముందుకు వెళ్లాలనేది ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు వెలువడలేదు. ప్రభుత్వం సాదాబైనామాలకు అవకాశం ఇచ్చినా వాటిని ఏ విధంగా, ఎవరు చేస్తారనే అంశంపై కొత్త రెవెన్యూ చట్టంలోనూ స్పష్టత లేదు. దీంతో అధికారుల్లోనూ అయోమయం నెలకొంది. ఇదివరకైతే పాత రెవెన్యూ చట్టం ప్రకారం తహసీల్దార్లు మ్యుటేషన్లు చేసేవారు. సాదాబైనామాల విషయంలో మ్యుటేషన్‌ చేసే అధికారం కలెక్టర్లకు ఇస్తారన్న ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు రాకపోవడంతో ప్రస్తుతం అధికారులు వాటి గురించి పట్టించుకోవడం లేదు. దరఖాస్తుదారులకు నిరీక్షణ తప్పడం లేదు.

ధరణిలో నమోదుకు అవకాశం కల్పిస్తేనే..

సాదాబైనామాల దరఖాస్తుల పరిశీలనలో ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు వస్తే తప్ప వాటిని పట్టించుకునే అవకాశం లేదని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. దరఖాస్తుల స్వీకరణకు మాత్రమే ప్రభుత్వ అనుమతి ఉందంటున్నారు. ధరణిలో నమోదుకు అవకాశం కల్పించిన తర్వాత వాటిని పరిశీలిస్తే ప్రయోజనం చేకూరుతుందని అభిప్రాయపడుతున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని