అన్నదాతల ఆశలు సజీవం
eenadu telugu news
Updated : 27/07/2021 04:20 IST

అన్నదాతల ఆశలు సజీవం

వారంలోపే ఎడమ కాల్వకు నీటి విడుదల!

ఎగువ నుంచి వస్తున్న వరదను క్షుణ్ణంగా పరిశీలిస్తున్న అధికారులు

ఈనాడు, నల్గొండ

గరిడేపల్లిలో నాట్లకు సిద్ధంగా ఉన్న నారుమళ్లు

నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లోని సుమారు 3.6 లక్షల ఎకరాలకు నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు ఎడమ కాల్వ నుంచి వారంలోపే నీటిని విడుదల చేయాలని అధికారులు ప్రాథమికంగా నిర్ణయించినట్లు తెలిసింది. కృష్ణా బేసిన్‌లో భారీ వర్షాలతో తుంగభద్ర, జురాల నుంచి శ్రీశైలానికి వరద ఉద్ధృతి కొనసాగుతోంది. నాలుగైదు రోజుల్లో శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకుంటుందని, ఆపై వచ్చిన వరదంతా దిగువనున్న నాగార్జునసాగర్‌కే రానుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

ఎగువ నుంచి వస్తున్న వరదను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ కాల్వకు నీటి విడుదల కొనసాగించేలా ప్రణాళికలు రచిస్తున్నారు. ఉన్నతాధికారులతో చర్చించి కాల్వలకు నీటి విడుదల తేదీలను ఖరారు చేయనున్నట్లు సమాచారం. ఇటీవల నల్గొండలో జరిగిన జడ్పీ సర్వసభ్య సమావేశంలోనూ మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్‌రావు నీటి విడుదల అంశాన్ని లేవనెత్తారు. మంత్రి జగదీశ్‌రెడ్డి స్పందిస్తూ నీళ్లు అందుబాటులో ఉన్నప్పుడు రైతుల అవసరాల మేరకు విడుదల చేస్తామన్నారు.

సాగర్‌కు నిలకడగా వరద ప్రవాహం

శ్రీశైలం ప్రాజెక్టుకు సోమవారం సాయంత్రానికి 3.17 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండగా 215 టీఎంసీలకు గానూ 150 టీఎంసీల నీటి నిల్వ ఉంది. దిగువన సాగర్‌కు వరద ప్రవాహం నిలకడగా 25,427 క్యూసెక్కుల మేర వస్తోంది. పూర్తి స్థాయి నీటిమట్టం 312 టీఎంసీలకు గానూ ప్రస్తుతం 186 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే ఈ ఏడాది ఎడమ కాల్వకు ఆగస్టు తొలి వారంలోనే నీటి విడుదల ఖాయంగా మారింది. గతేడాది ఆగస్టు 11న ఎడమ కాల్వకు నీటిని విడుదల చేయగా అంతకుముందుసారి ఆగస్టు 7న అధికారులు సాగునీటిని వదిలారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించాక 2014, 2016, 2018, 2019, 2020 సంవత్సరాల్లో ఆగస్టులోనే ఎడమ కాల్వకు నీటిని విడుదల చేశారు.

అంతా సన్నాలేనా?

దొడ్డు రకాల ధాన్యం కొనడంపై కేంద్రం కొర్రీలు పెడుతుండటం, జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లలో డిమాండు తగ్గుతుండటం, దక్షిణాది రాష్ట్రాలు కేరళ, తమిళనాడులో ఈ రకాల వరి వంగడాల సాగు విస్తీర్ణం పెరుగుతుండటంతో సాగర్‌ ఆయకట్టులోని రైతులు వాటిపై ఆసక్తి చూపడం లేదు. గతంలో 20 నుంచి 30 శాతం లోపు దొడ్డు రకాలు, సుమారు 3 లక్షల ఎకరాల్లో సన్నాలు సాగు చేసేవారు. గతానుభవాల దృష్ట్యా ఈదఫా మొత్తం సన్నాలే సాగు చేయాలని భావిస్తున్నారు. ఇప్పటికే వరినారు సిద్ధం చేయగా కాల్వ నీళ్లు రాగానే నాట్లు వేయడానికి సిద్ధమవుతున్నారు. గత రెండు సీజన్లలో కొన్ని ఇబ్బందులు ఎదురైనా పోలీసుల జోక్యంతో మిల్లర్ల నుంచి రైతులకు మద్దతు ధర దక్కుతోంది. ఇటీవల యాసంగి సీజన్‌లో రాష్ట్రంలోనే అత్యధికంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలోనే ధాన్యం దిగుబడులు వచ్చాయి. రాష్ట్రంలోనే అత్యధికంగా నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాల్లో దాదాపు 17 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఈదఫా సన్నరకం ధాన్యం దిగుబడులు గతంలో కన్నా ఎక్కువగా వస్తాయని వ్యవసాయ శాఖ అంచనా వేస్తున్న నేపథ్యంలో క్రయవిక్రయాల సమయంలో ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని