లభ్యం భళా.. నిర్మాణంలో డీలా
eenadu telugu news
Published : 27/07/2021 05:30 IST

లభ్యం భళా.. నిర్మాణంలో డీలా

అంతంతమాత్రంగానే ఇంకుడుగుంతల తవ్వకం

హుజూర్‌నగర్‌ గ్రామీణం, న్యూస్‌టుడే


హుజూర్‌నగర్‌ మండలం అమరవరంలో నిర్మించుకున్న ఇంకుడుగంత


వర్షం నీరు భావితరాలదే.. దాన్ని ఒడిసిపట్టి సంరక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉంది.

- ఇటీవల ‘మన్‌ కీ బాత్‌’లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ.


వర్షం నీటిని ఒడిసిపట్టి భూగర్భజలాలు పెంపొందించేందుకు ప్రభుత్వ చేపట్టిన ఇంకుడుగుంతల నిర్మాణం అటకెక్కింది. అధికారులు, ప్రజాప్రతినిధుల అలసత్వంతో లక్ష్యం నెరవేరడం లేదు. ఇంకుడుగుంతల నిర్మాణం ఒకప్పుడు ఉద్యమంలా సాగింది. ప్రజల్లో అవగాహన లేకపోవడం, నిర్మించుకున్న వారికి సకాలంలో బిల్లులు రాకపోవటం తదితర కారణాలతో లక్ష్యం చేరుకోవటం గగనమైంది. వీటితో పాటు సామూహిక ఇంకుడుగుంతల నిర్మాణమూ ముందుకుసాగడం లేదు. వర్షం నీరు వృథాగా కాల్వలు, వాగుల్లో కలుస్తోంది.
తాగు, సాగునీటికి ఇబ్బందులు పడకూడదనే..

గ్రామాలు, పట్టణాల్లో సీసీ రోడ్లు, మురుగుకాల్వలు, ఇళ్ల ఆవరణల్లో నేల అగుపించకుండా బండలు, టైల్స్‌ లాంటివి వేడయంతో వృథా నీరు, వర్షం జలాలు భూమిలోకి ఇంకడం కష్టంగా మారింది. ఈనీరంతా మురుగుకాల్వల ద్వారా చెరువులు, వాగులు, వంకలకు చేరుతోంది. తాగు, సాగునీటి అవసరాల కోసం భవిష్యత్తులో అవస్థలు పడకూడదనే ఉద్దేశంతో ఉపాధి హామీ పథకం ద్వారా నిధులు కేటాయిస్తూ ఇంకుడుగుంతల నిర్మాణానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు శ్రీకారం చుట్టాయి. ఇళ్లల్లో వ్యక్తిగతంగా నిర్మించుకునే ఇంకుడుగుంతకు రూ.4,800, సామూహిక ఇంకుడుగుంతల నిర్మాణానికి రూ.8 వేల నుంచి రూ.12 వేల చొప్పున వరకు నిధులు మంజూరు చేస్తున్నాయి.

ఇప్పటి వరకు సుమారు 30 శాతమే పూర్తి

ఇంకుడుగుంతల నిర్మాణంతో చేకూరే ప్రయోజనాలపై ప్రభుత్వాలు అవగాహన కల్పిస్తున్నా క్షేత్రస్థాయిలో మాత్రం ఆశించిన ఫలితం కానరావటం లేదు. నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో 7,88,563 గృహాలుండగా 2,29,589 ఇంకుడుగుంతల నిర్మాణాలకు అనుమతులు మంజూరయ్యాయి. వీటిలో 96,399 ఇంకుడుగుంతల నిర్మాణం పూర్తవగా 6,122 ఇంకుడు గుంతల పనుల్లో వివిధ దశల్లో ఉన్నాయి. మంజూరైన వాటిలో ఇప్పటివరకు సుమారు 30 శాతం మాత్రమే పూర్తయ్యాయి.

జిల్లాలో ఇంకుడుగుంతల వివరాలు

గృహాల సంఖ్య 3,71,102

పురోగతి ఉన్నవి 4,640

మంజూరైనవి 1,39,728

నల్గొండ పూర్తైనవి 47,580


నిర్మాణ పనులు వేగవంతం చేస్తాం

-కిరణ్‌కుమార్‌, డీఆర్డీవో, సూర్యాపేట జిల్లా

మంజూరైన ఇంకుడుగుంతల నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయిస్తాం. జలశక్తి పేరిట ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. నర్సరీలు, పల్లె ప్రకృతివనాలు, వైకుంఠధామాలు, సెగ్రిగేషన్‌ షెడ్ల నిర్మాణాల్లో సిబ్బంది నిమగ్నమవటంతో ఇంకుడుగుంతల పనులపై దృష్టి సారించలేకపోయాం. ఇక నుంచి వాటి పనులను వేగవంతం చేస్తాం.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని