ఆన్‌లైన్‌ విద్యావిధానంలో మార్పులు
eenadu telugu news
Published : 02/08/2021 03:04 IST

ఆన్‌లైన్‌ విద్యావిధానంలో మార్పులు

మాట్లాడుతున్న వీసీ ప్రొ.సీతారామారావు, పక్కన డీడీ ధర్మానాయక్‌, ఎన్జీ కళాశాల ప్రిన్సిపల్‌ చంద్రశేఖర్‌

నల్గొండ విద్యావిభాగం, న్యూస్‌టుడే: నూతన జాతీయ విద్యావిధానంలో ఇన్ఫర్మేషన్‌, కమ్యునికేషన్‌ టెక్నాలజీ(ఐసీటీ)ని ప్రోత్సహిస్తున్నందున రానున్న కాలంలో ఆన్‌లైన్‌ బోధన విధానంలో గణనీయ మార్పులు రాబోతున్నాయని డా.బి.ఆర్‌.అంబేడ్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయం (బీఆర్‌ఏవోయూ) ఉపకులపతి ప్రొ.సీతారామారావు తెలిపారు. అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీలో ఇప్పటికే యూట్యూబ్‌ పాఠాలు, స్మార్డ్‌ఫోన్‌లో యూనివర్సిటీ యాప్‌ను వినియోగించుకుని వీలైనప్పుడు పాఠాలు వినే సదుపాయం ఉందని, వెబ్‌సైట్‌నూ వినియోగించుకుని పాఠాలు వినేలా ఏర్పాట్లు చేశామని చెప్పారు. త్వరలో వెబ్‌రేడియో ద్వారా పాఠాలు వినే సదుపాయం తీసుకురానున్నట్లు చెప్పారు. ఆదివారం నల్గొండలోని ఓపెన్‌ యూనివర్సిటీ ప్రాంతీయ కేంద్రాన్ని సందర్శించారు. కౌన్సెలర్లు, విద్యార్థులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కరోనా నేపథ్యం విద్యారంగంలో పలు బోధన అభ్యసన మార్గాల అమలుకు దోహదపడిందన్నారు. ప్రస్తుతం తరగతి గది బోధన 20 శాతం, స్వతహాగా చదువుకునే విధానం(సెల్ఫ్‌లెర్నింగ్‌) 80 శాతం అమలవుతోందని తెలిపారు. 34 ఏళ్ల తరువాత వచ్చిన నూతన జాతీయ విద్యావిధానంతో 2030 నాటికి ఉన్నత విద్యారంగంలో 50 శాతం మంది పట్టాలు పొందాలని లక్ష్యంగా పెట్టారని చెప్పారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు ఎక్కువ మంది ఉన్నత విద్య చదివేందుకు బీఆర్‌ఏవోయూ కృషిచేస్తుందని తెలిపారు.

ప్రాంతీయ కేంద్రానికి అభినందనలు.. ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రాంతీయ కేంద్రం యూనివర్సిటీకి మొదటి నుంచి ఎక్కువ మంది విద్యార్థులను అందించిందని వీసీ తెలిపారు. కేంద్రం నిర్వాహకులు, కౌన్సెలర్లు, అధ్యయన కేంద్రం కళాశాలల సహకారంతో ఎక్కువ మందికి ఉన్నత విద్య అందిస్తున్నందుకు ప్రాంతీయ కేంద్రం డీడీ బి.ధర్మానాయక్‌ను అభినందించారు. ఈ సందర్భంగా వీసీని ఘనంగా సత్కరించారు. ఎన్‌జీ కళాశాల ప్రిన్సిపల్‌ చంద్రశేఖర్‌, పరీక్షల విభాగం అధికారి నందకుమార్‌ తదితరులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని