అటు కూలీ.. ఇటు చదువు
eenadu telugu news
Updated : 02/08/2021 03:04 IST

అటు కూలీ.. ఇటు చదువు

పేదింటి సరస్వతిపై తల్లి పోషణ భారం

రేఖ

సంస్థాన్‌నారాయణపురం, నల్గొండ గ్రామీణం-న్యూస్‌టుడే: ఆ బాలిక చదువులో సరస్వతి.. కానీ లక్ష్మి కటాక్షానికి దూరమైంది. బాల్యంలోనే తండ్రిని కోల్పోయింది. ఎలాంటి ఆస్తిపాస్తులు లేని ఆ కుటుంబానికి తల్లి రెక్కల కష్టమే జీవనాధారం. కూలీనాలీ చేస్తూ కూతురును చదివిస్తున్నారు. రెండేళ్లుగా ఆమెను అనారోగ్య సమస్యలు చుట్టుముట్టడంతో ఇంటికే పరిమితమైంది. హైదరాబాద్‌లో పాలిటెక్నిక్‌ డిప్లొమా కోర్సు చదువుతున్న బాలిక తప్పనిసరి పరిస్థితుల్లో పొట్ట కూటికి కూలీ పనులకు వెళుతోంది. ఇటీవల తల్లికి కరోనా పాజిటివ్‌ సోకడంతో ఎక్కడా పని దొరకని పరిస్థితి ఎదురైంది. ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తోంది. స్థానికులు వీరి దీన స్థితి చూసి నిత్యావసర సరకులు అందించి ఆదుకుంటున్నారు.

రేషన్‌ బియ్యమే ఆధారం.. సంస్థాన్‌నారాయణపురం మండలం పుర్లకుంట గ్రామానికి చెందిన వరకాంతం నర్సిరెడ్డి-రాణిల కూతురు రేఖ. ఆమె చిన్నతనంలోనే తండ్రి అనారోగ్యంతో మృతి చెందారు. అప్పటినుంచి తల్లి రాణి కూలీ పనులు చేస్తూ కూతురును సాకుతున్నారు. రేఖకు చదువంటే ప్రాణం. మొదటి నుంచి ప్రతిభ కనబరుస్తూ వస్తోంది. 10వ తరగతిలో 10 జీపీఏ సాధించింది. కష్టపడి చదివి మంచి ఉద్యోగం సాధించి తల్లిని సంతోషంగా చూసుకోవాలనే తపన రేఖది. రెండేళ్లుగా తల్లి అనారోగ్యం సమస్యలతో ఏ పని చేయలేని పరిస్థితి. దీంతో బాధ్యతలను తన భుజాలపై వేసుకొని రేఖ కూలీ పనులకు వెళుతోంది. చదువుపై ఇష్టాన్ని వదులుకోకుండా ముందుకు సాగుతోంది. తల్లికి కరోనా సోకడంతో వీరి పరిస్థితి చీకటిమయమైంది. రేఖకు ఎక్కడా పని దొరకడం లేదు. దీంతో పూట గడవక పస్తులు ఉండాల్సిన పరిస్థితి. రేషన్‌ బియ్యంతో కడుపు నింపుకుంటూ కన్నీళ్లు తాగుతున్నారు. నా అనే వాళ్లు పట్టించుకోక విలపిస్తున్నారు.త్వరలో జరగనున్న పాలిటెక్నిక్‌ పరీక్షలకు వెళ్లాలంటే తనవద్ద చిల్లి గవ్వలేదని రేఖ ఆవేదన చెందుతోంది. వారసత్వంగా సంక్రమించిన పొలాన్ని దాయాది పట్టా చేసుకోవడంతో తమకు ఏ ఆధారం లేకుండా పోయిందని, కనీసం తమ వాటా భూమి తమ పేరిట ఉంటే రైతు సంక్షేమ పథకాలైనా ఆసరాగా నిలిచేవని కన్నీరు పెడుతున్నారు. దాతలు ఆదుకోవాలని వేడుకుంటున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని