ఇక్కడ వేగం.. అక్కడ జాప్యం
eenadu telugu news
Published : 02/08/2021 03:16 IST

ఇక్కడ వేగం.. అక్కడ జాప్యం

సూర్యాపేట, నల్గొండలో వైద్య కళాశాలల నిర్మాణం తీరిది

సూర్యాపేట (తాళ్లగడ్డ), న్యూస్‌టుడే

సూర్యాపేటలో ప్రభుత్వ వైద్య కళాశాల నిర్మాణం

సూర్యాపేట జిల్లా కేంద్రంలో ప్రభుత్వ వైద్య కళాశాల భవన నిర్మాణం శరవేగంగా సాగుతోంది. ఎస్వీ డిగ్రీ కళాశాల మైదానంలోని సుమారు పదిన్నర ఎకరాల స్థలంలో 2020 జనవరిలో పనులను ప్రారంభించిన విషయం తెలిసిందే. సుమారు రూ.180 కోట్ల వ్యయంతో చేపట్టిన పనులు తుది దశకు చేరుకున్నాయి. ఈ ఏడాది చివరి నాటికి భవనాన్ని ప్రభుత్వానికి గుత్తేదారు అప్పగించే అవకాశాలున్నాయి. రాబోయే విద్యా సంవత్సరం (2022-23) నుంచి నూతన భవనంలో తరగతులు నిర్వహించనున్నారు. హైదరాబాద్‌ - విజయవాడకు మధ్యలో సూర్యాపేట ముఖద్వారంలో నిర్మిస్తున్న ఐదంతస్తుల వేర్వేరు భవనాలు జిల్లా కేంద్రానికి మణిహారంగా నిలవనున్నాయి.

నిత్యం 500 మంది కార్మికుల శ్రమ

భవన నిర్మాణంలో రోజూ 500 మంది కార్మికులు శ్రమిస్తున్నారు. వీరంతా బిహార్‌, ఝార్ఖండ్‌, ఒడిశా, ఛత్తీస్‌ఘడ్‌ రాష్ట్రాలకు చెందిన కార్మికులే. 2020 జనవరిలో ప్రారంభమైన పనులు ఏడాదిలోగా పూర్తి కావాల్సి ఉంది. ప్రారంభమైన మూడు నెలలకే కరోనా మహమ్మారి విరుచుకుపడటంతో కార్మికులు స్వస్థలాలకు తరలివెళ్లారు. లాక్‌డౌన్‌ సమయంలో సుమారు మూడు నెలల పాటు పనులు నిలిచిపోయాయి. ఆ తర్వతా మెల్లగా వేగం పుంజుకున్నాయి. ప్రస్తుతం పనులు పగలూరాత్రీ నిరంతరాయంగా సాగుతున్నాయి.

ఐదు వేర్వేరు భవనాలు

10.52 ఎకరాల్లో ఐదు వేర్వేరు భవనాలకు రూపకల్పన చేశారు. ఐదేళ్ల ఎంబీబీఎస్‌ చదువులో నాలుగు సంవత్సరాల విద్యార్థులు అంటే 600 మంది విద్యార్థులకు తరగతులు నిర్వహించే ప్రధాన భవనం (నాలుగు అంతస్తులు) నిర్మిస్తున్నారు. బాలబాలికలకు వేర్వేరుగా వసతి గృహాలు (ఐదు అంతస్తులు), బోధన, బోధనేతర సిబ్బందికి వేర్వేరు క్వార్టర్స్‌ను (ఐదు అంతస్తులు) నిర్మిస్తున్నారు. పనులు పూర్తికావొచ్చాయి. భవనంలో అంతర్గత పనులు సాగుతున్నాయి. వైద్య కళాశాల, సిబ్బంది క్వార్టర్ల మధ్య నుంచి వెళ్తున్న వరద కాల్వను సుందరంగా తీర్చిదిద్దుతున్నారు.

నల్గొండలో వైద్య కళాశాల నమూనా చిత్రం

నల్గొండలో ప్రారంభంకాని పనులు

నల్గొండలో పరిస్థితి భిన్నంగా ఉంది. ఇక్కడ ఇంకా పనులు ప్రారంభించలేదు. నల్గొండలోని ఎస్‌ఎల్‌బీసీ ప్రాంతంలో సుమారు 40 ఎకరాల స్థలాన్ని ఇందుకోసం సేకరించారు. పనులకు శంకుస్థాపన జరగాల్సి ఉంది. ప్రస్తుతం రెండేళ్లకు సంబంధించిన ఎంబీబీఎస్‌ విద్యార్థులు 300 మంది చొప్పున నల్గొండ, సూర్యాపేటలోని కళాశాలల్లో ప్రవేశాలు పొందారు. నల్గొండలో వీరికి జనరల్‌ ఆసుపత్రిలో, సూర్యాపేటలో జనరల్‌ ఆసుపత్రికి ఆనుకొని ఉన్న పాలిటెక్నిక్‌ కళాశాలలో బోధన తరగతులు జరుగుతున్నాయి. ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు గురువారం నుంచి తరగతులు ప్రారంభమైనా రెండుచోట్లా ఎవరూ హాజరుకావటం లేదు. కొవిడ్‌ నిబంధనలకు అనుగుణంగా తరగతి గదులు, వసతిగృహాలను సిద్ధం చేశామని నిర్వాహకులు చెప్పారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని