నార్ముల్‌ నష్టాలపాలు!
eenadu telugu news
Published : 02/08/2021 03:16 IST

నార్ముల్‌ నష్టాలపాలు!

అనాలోచిత నిర్ణయాలతో అప్పులు

భారమవుతున్న డెయిరీ నిర్వహణ

భువనగిరి పట్టణం, న్యూస్‌టుడే

భువనగిరిలోని పాల శీతలీకరణ కేంద్రం

నల్గొండ, రంగారెడ్డి పాల ఉత్పత్తిదారుల పరస్పర సహాయక సహకార యూనియన్‌(నార్ముల్‌) నష్టాల బాటలో పయనిస్తోంది. పాలకవర్గం అనాలోచిత నిర్ణయాలు, నిర్వహణ లోపంతో మదర్‌ డెయిరీ నిర్వహణ రోజురోజుకూ భారమవుతోంది. గత ఐదేళ్లుగా తీసుకున్న అసంబద్ధ నిర్ణయాలతో సంస్థ వార్షిక టర్నోవర్‌ రూ.195 కోట్ల నుంచి రూ.145 కోట్లకు దిగజారినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉద్యోగుల నియామకాల్లో లోపాలు, పాల సేకరణ, మార్కెట్‌ వాటా సాధనలో నిర్లక్ష్యం, దుబారా ఖర్చులతో నష్టాలు తలెత్తి అప్పులను మూటకట్టుకుంటున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

నష్టాలకు కారణాలు ఇవి...

నార్ముల్‌ నష్టాలకు కర్ణుని చావుకు వంద కారణాలన్నట్లుగా ఉంది. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా పాలకవర్గం మార్కెట్‌ వ్యూహాన్ని, ఆదాయం పెంచుకునే నిర్ణయాలు తీసుకోకపోవడంతో క్రమంగా కార్యకలాపాలు తగ్గి ఆదాయం తగ్గుతోంది. నేటికీ ఏకపక్ష నిర్ణయాలతో మూస ధోరణిలో సంస్థను నడిపిస్తున్నట్లు విమర్శలు ఉన్నాయి. దీంతో ఏటా నష్టాలను చవిచూడాల్సి వస్తోంది. ఆదాయానికి అనుగుణంగా ఖర్చులు చేయకపోవడం, క్షేత్ర స్థాయిలో పాల సేకరణపై దృష్టి సారించకపోవడం, మార్కెట్‌లో పాల విక్రయం వాటా పెంచుకునే వీలున్నా విస్తరణకు వ్యూహం అమలుపర్చకపోవడంతో నష్టాలు చూడాల్సి వస్తోందని పాల ఉత్పత్తిదారులు కేంద్రాల అధ్యక్షులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం అవసరానికి మించి ఉన్న ఉద్యోగులతోనే అధిక భారం పడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. సంఘ కార్యకలాపాలు కొనసాగించేందుకు 200 మంది ఉద్యోగులు అవసరం ఉండగా 500పైగా ఉద్యోగులు ఉన్నట్లు విమర్శలు ఉన్నాయి. వీరి జీత భత్యాలకు ఏటా నెలకు రూ.1.50 కోట్లు ఖర్చు చేస్తున్నారు. అవసరం మేరకు ఉద్యోగులను నియమించుకున్న పక్షంలో నెలకు రూ.50 నుంచి రూ.70లక్షలు ఆదా చేసుకోవచ్చని అధికారులే చెబుతుండటం గమనార్హం.

తగ్గిన పాల సేకరణ

అధికారపక్ష ప్రజాప్రతినిధుల సిఫార్సుతో నైపుణ్యం లేకున్నా కొందరిని యాజమాన్యం నియమిస్తుందన్న ఆరోపణలున్నాయి. నిర్వహణకు నార్ముల్‌ రూ.15 కోట్లు రుణం తీసుకుంది. ప్రతినెలా రూ.14 లక్షల వడ్డీ చెల్లిస్తుంది. గతంలో రోజూ 1.50 లక్షల లీటర్ల పాల సేకరణ జరిగేది. ప్రస్తుతం 70 వేల లీటర్లకు పరిమితమైంది. పాల ఉత్పత్తిదారులపై నిర్లక్ష్యం, బహిరంగ మార్కెట్‌లోని పాల ధర చెల్లించకపోవడం, రాయితీపై పాడి పశువులను లక్ష్యం మేరకు పంపిణీ చేయకపోవడం, సకాలంలో బిల్లులు చెల్లించకపోవడం దీనిపై ప్రభావం చూపుతోంది. లీటరు పాలపై రూ.4 ప్రోత్సాహకం ఇప్పించకపోవడం, పశువుల మందులు, ఇతర సంక్షేమ పథకాల్లో కోత విధించడంతో పాల ఉత్పత్తిదారులు ప్రైవేటు డెయిరీలకు, వ్యాపారులకు పాలు విక్రయిస్తున్నారు.

ఐదేళ్లుగా టర్నోవర్‌ తగ్గింది

-అశోక్‌ కుమార్‌, నార్ముల్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌

నార్ముల్‌ పరిధిలో పరిమితికి మించి ఉద్యోగులు లేరు. పాల సేకరణ గణనీయంగా తగ్గడంతో ఉద్యోగులపై కొంత మేరకు పని ఒత్తిడి తగ్గింది. ఐదేళ్లుగా సంస్థ టర్నోవర్‌ తగ్గింది వాస్తవమే. గతంలో నిర్వహణ కోసం రుణాలు తీసుకున్నాం. ప్రస్తుతం డెయిరీ పేరిట రూ.15 కోట్ల అప్పు ఉంది. క్షేత్ర స్థాయిలో పాల ఉత్పత్తిని పెంచేందుకు రైతులకు ఇప్పటికే లీటరు పాలపై రూ.2 పెంచాం. రాయితీలపై గేదెలు, ఆవులతో పాటు పలు పథకాలు అమలుపరుస్తున్నాం. సాగునీరు లభిస్తుండటంతో పాడి రైతులు వ్యవసాయం వైపు మొగ్గుచూపడంతో పాల సేకరణ తగ్గింది. ఈ సీజన్‌లో సేకరణ పెంచేందుకు చర్యలు చేపడతాం. హైదరాబాద్‌ జంట నగరాలతో పాటు శివారు ప్రాంతాలపై దృష్టిని సారించి పాల విక్రయాలు పెంచుతాం. అప్పులు, నిర్వహణ ఖర్చులు తగ్గించుకుని డెయిరీని లాభాల బాటలో నడిపించేందుకు ప్రయత్నిస్తాం.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని